Nandamuri Balakrishna Family : వసుంధర, నాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భార్య వసుంధరాదేవిది స్వస్థలం కాకినాడ. పెళ్లి చూపుల్లోనే ఒకరికొకరం నచ్చడం వల్ల 1982లో మా వివాహమైంది. మా కుటుంబాన్నీ, నా వృత్తినీ ఎంతో బాగా అర్థం చేసుకుంది నా భార్య వసుంధర. నేను షూటింగ్స్‌లో బిజీగా ఉంటే ఇంటినీ, పిల్లల్నీ జాగ్రత్తగా చూసుకునేది. విదేశాల్లో షూటింగ్స్‌కి వెళ్లినప్పుడు పనిలో పడి పిల్లలకి ఏమీ తీసుకురాలేకపోయే వాడ్ని. పిల్లలు నొచ్చుకోకుండా వసుంధర కొన్ని బహుమతుల్ని కొని కారులో పెట్టి నాకోసం ఎయిర్ పోర్ట్‌కి పంపేది. నేను ఇంటికి రాగానే తనే కారులోంచి గిఫ్ట్స్ తీసి నాన్న మీకేం తెచ్చారో చూడండని పిల్లలకు వాటిని ఇచ్చేది. అలా తనే నా పాత్రనూ చాలా సందర్భాల్లో పోషించేది.
తను మా నాన్నగారిని ఆటపట్టించేది
నాకే సమస్య వచ్చినా నా భార్య వసుంధరే చూసుకుంటుంది. వసుంధర నాకు భార్య మాత్రమే కాదు బెస్ట్ ఫ్రెండ్, సలహాదారు, మా ఇంటి ఫైనాన్స్ మినిస్టర్ కూడా. ఇక పిల్లల విషయానికొస్తే నా పెద్ద కుమార్తె బ్రాహ్మణి పుస్తకాలు బాగా చదివేది. చాలా క్రమశిక్షణగా ఉంటుంది. విదేశాల్లో చదవాలనుకుంది. పెళ్లయినా చదువు పూర్తి చేశాకే హెరిటేజ్ బాధ్యతలు తీసుకుంది. చిన్నమ్మాయి తేజస్విని అల్లరి చేసినా వాళ్ల అక్కతో పోటీ పడి మరీ చదివేది. తను మా నాన్నగారిని (సీనియర్ ఎన్టీఆర్)ను కూడా ఆటపట్టించేది. ప్రస్తుతం అన్‌స్టాపబుల్ కార్యక్రమం ప్రొడక్షన్ పనులు చూసుకుంటోంది. మా అబ్బాయి మోక్షజ్ఞ సినిమాకి నిర్మాత కూడా తనే. మోక్షజ్ఞ క్లాస్ లో ఎప్పుడూ టాపరే. అమెరికాలో బీబీఎమ్ చదివొచ్చాడు. నాతోపాటు పాత సినిమాలు చూస్తుంటాడు. తనకీ సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉందని నాకు అర్థమయ్యే ప్రోత్సహిస్తున్నా. త్వరలోనే మోజ్ఞక్ష ఎంట్రీ గురించి ప్రకటిస్తాను.
'ఇది నా ఇల్లు రా. నువ్వు వెళ్లు అనేవాణ్ని'
ఇక అల్లుళ్ల విషయానికొస్తే లోకేశ్ ని మేనల్లుడిగా చిన్నప్పట్నుంచీ చూస్తున్నాను. ప్రస్తుతం మేం ఉంటున్న ఇంట్లో ఒకప్పుడు మా సోదరి భువనేశ్వరి వాళ్లు ఉండేవాళ్లు. అప్పుడు మేం మద్రాసులో ఉండేవాళ్లం. అందుకని ఆ ఇంటిని తనదిగా భావించేవాడు లోకేశ్. 'ఇది నా ఇల్లు రా. నువ్వు వెళ్లు' అని లోకేశ్‌ను ఆటపట్టించేవాణ్ని. దానికి లోకేశ్ కూడా 'కాదు, నాది' అంటూ గోడలు పట్టుకుని నన్ను కోపంగా చూసేవాడు. అప్పుడు ఇల్లు నాదీ నాదీ అంటూ ఇప్పుడు నా కూతురునే తీసుకెళ్లావ్ కదరా అని లోకేశ్ తో అప్పుడప్పుడు సరదాగా అంటుంటాను.
వాళ్లిద్దరూ అలా పిలుస్తుంటారు
చిన్న అల్లుడు భరత్ కూడా చాలా తెలివైనవాడు. వాళ్ల అమ్మగారూ, వసుంధరా చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. అందువల్ల భరత్ మాకు చిన్నప్పట్నుంచీ తెలుసు. గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించడం సహా ఎంపీగానూ సరికొత్త పాత్ర పోషిస్తున్నాడు. మనవళ్ల సంగతికొస్తే నేను అరవైల్లో ఉన్నా ఆరేళ్ల పిల్లాడిలా ఫీలై వాళ్లతో కలిసి ఆట్లాడతాను. అలాగే పోట్లాడతాను. వాళ్లతో కలిసి అల్లరి కూడా చేస్తాను. బ్రాహ్మణి కొడుకు దేవాంశ్ నన్ను అల్లరి తాతా అనీ, చిన్నమ్మాయి తేజస్విని కొడుకు ఆర్యవీర్ బాలా అనీ పిలుస్తుంటారు. నేనేమో పెద్ద మనవడిని సీఎం (క్లాస్ మనవడు) అనీ, చిన్నోడిని ఎంఎం (మాస్ మనవడు) అనీ సరదాగా పిలుస్తుంటాను.