Ram Charan Wax Statue : టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అరుదైన ఘనత సాధించారు. చిత్ర పరిశ్రమకు చరణ్ అందించిన సేవలకుగానూ సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహం కొలువుదీరనుంది. అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ ఈవెంట్లో ఈ విషయాన్ని అధికారిక ప్రకటించారు.
రామ్ చరణ్ మైనపు విగ్రహానికి సంబంధించిన కొలతలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు తీసుకున్నట్లు తెలిపారు. 2025 వేసవి నాటికి చరణ్ విగ్రహాన్ని సిద్ధం చేసి, సందర్శన కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు కార్యక్రమంలో తెలిపారు. మేడమ్ టుస్సాడ్స్‌లో ఉన్న ఐఐఎఫ్‌ఏ జోన్‌లో ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బాద్ షా షారుక్ ఖాన్, కాజోల్, కరణ్ జోహార్‌ల మైనపు విగ్రహాలు ఉన్న సంగతి తెలిసిందే.
తన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. "సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో సూపర్ స్టార్స్ పక్కన నా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిజంగా నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. చిన్నప్పుడు లెజెండరీ యాక్టర్స్ విగ్రహాలు చూసి ఆశ్చర్యపోయేవాడిని. అలాంటిది వారి పక్కన నా విగ్రహం ఉంటుందని, ఇంతటి గౌరవం దక్కుతుందని కలలో కూడా ఊహించలేదు. కష్టం, సినిమాపై నాకున్న ప్యాషన్ వల్లే ఈ గుర్తింపు దక్కింది. అపురూపమైన అవకాశాన్ని అందించిన మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అని అన్నారు.
రామ్ చరణ్ పెంపుడు శునకం కూడా - రామ్‌చరణ్ పెంపుడు శునకం రైమ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. క్వీన్ ఎలిజిబెత్ - 2 కూడా గతంలో తన పెంపుడు జంతువుతో మైనపు విగ్రహంగా కనిపించారు. ఇప్పుడా మళ్లీ రామ్ చరణ్ తన పెంపుడు శునకంతో మైనపు విగ్రహంగా కనిపించనున్నారు. "రైమ్ నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. నా వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని మిళితం చేస్తూ ఈ విగ్రహం రూపుదిద్దుకోవడం ప్రత్యేకంగా భావిస్తున్నాను" అని చరణ్ అన్నారు.
అంతర్జాతీయ వేదికపై 'SSMB 29' మేనియా - హింట్ ఇస్తూనే హైప్ పెంచిన జక్కన్న!
బావ బామ్మర్దిల అనుబంధంతో కార్తి ఎమోషనల్ మూవీ! - ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?