Murari Movie Re Release : మహేశ్ బాబు హీరోగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో 23 ఏళ్ల కిందట వచ్చిన సెన్సేషనల్ మూవీ మురారి. మహేశ్ హీరోగా నటించిన 4వ చిత్రం ఇది. ఇప్పుడు మహేశ్ బర్త్ డే సందర్బంగా ఆగస్ట్ 9న మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రీ రిలీజ్ కాబట్టి సినిమా కథ మనకు తెలుసు, మరి ఈ సినిమా వెనక ఉన్న కథలేంటో చూద్దామా?
కృష్ణతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన నిర్మాత ఎన్.రామలింగేశ్వరావు. ఆతను కృష్ణవంశీ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా ఓ సినిమా నిర్మించాలని అనుకున్నారు. దీంతో సముద్రం సినిమా పూర్తయ్యాక ఆ పనిలోనే పూర్తిగా నిమగ్నమయ్యారు కృష్ణవంశీ. అప్పుడు జరిగిన ఆ చర్చల్లోనే ఇందిరాగాంధీ కుటుంబ సభ్యులంతా అకాల మరణం చెందుతున్నారు అనే టాపిక్ వచ్చిందట. అప్పుడు ఎవరో ఇదంతా ఒక శాపం కారణంగానే అన్నారట. ఆ మాటే కృష్ణవంశీ మదిలో కథలా రూపు దిద్దుకోవటం మొదలైంది. మనోహరంగా ఉండే మహేశ్ బాబు చుట్టూ బృందావనం, అలాగే ఈ శాపాన్ని అన్నీ కలిపి కథ రాసుకుంటే బాగుంటుందనుకున్నారట కృష్ణవంశీ.
అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రేమ కథ చేయాలనేది మహేశ్ బాబు ఆలోచన. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక రొమాంటిక్ స్టోరీ వినిపించారట కృష్ణవంశీ. దానికి కృష్ణ, మహేశ్ కూడా ఓకే చెప్పారు. కానీ ఎవరు ఎన్ని అన్నా ప్రేమ కథను తెరకెక్కించడం కృష్ణవంశీకి ఇష్టం లేకపోవడంతో, పట్టు బట్టి ముందు అనుకున్న స్టోరీకే మహేశ్ చేత గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నారు కృష్ణవంశీ. ఈ సినిమాకు మొదట అనుకున్న టైటిల్ కృష్ణ ముకుందా మురారి.
హీరోయిన్గా ఎవరిని అనుకున్నారంటే - ఈ సినిమాలో మహేశ్‌కు తగ్గ జోడీగా కనిపిస్తుంది సోనాలీ బింద్రే. అయితే మొదట మాత్రం హేమమాలిని కుమార్తె ఈషా దేఓల్, లేదా వసుంధర దాస్‌లలో ఎవరో ఒకరిని అనుకున్నారట. కానీ చివరికి సోనాలి బింద్రే ఫైనల్ అయ్యారు. ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా. అలాగే సినిమాలో కీలకమైన బామ్మ పాత్రకు షావుకారు జానకిని ఫిక్స్ చేసుకున్నారు. అయితే డేట్స్‌లో సర్దుబాటు కాకపోవడంతో మలయాళ నటి సుకుమారిని బామ్మ పాత్రకు ఎంపిక చేశారు.
సినిమాలోని డుమ్ డుమ్ డుమ్ నటరాజ ఆడాలి పాటను తెరకెక్కిస్తున్న సమయంలో, అలాగే వాటర్ ఫైట్ సమయంలో మహేశ్ బాగా జ్వరంతో ఉన్నారట. అయితే షెడ్యూల్ మిస్ అవ్వకూడదని జ్వరాన్ని కూడా లెక్కచేయకుండా మహేశ్ షూటింగ్లో పాల్గొన్నారట. ఇంకా హాలీవుడ్ మూవీ టెర్మినేటర్‌లోని జైలు సన్నివేశం స్ఫూర్తితో చెప్పమ్మా చెప్పమ్మా పాటలో ముగ్గు సోనాలి బింద్రే మారేలా చిత్రీకరించారట.
రొటీన్‌కు భిన్నంగా క్లైమాక్స్‌కు ముందు వస్తుంది అలనాటి రామచంద్రుడు పాట. ఈ పాట ఎంత పాపులర్ అయింది అంటే ఇప్పటికీ చాలా పెళ్లిళ్లలో కచ్చితంగా వినిపిస్తూనే ఉంటుంది. అసలు మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ పాయింట్. ఈ చిత్రంతో పీటర్ హైయెన్స్ ఫైట్ మాస్టర్‌గా పరిచయమయ్యారు. అలాగే శోభన్(వర్షం), నందిని రెడ్డి (అలా మొదలైంది), శ్రీవాస్ (లక్ష్యం) ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేశారు.
అందుకే శాపం - ప్రతి సినిమాలో విలన్ - హీరో మధ్య పోరాటాలు సాగుతాయి. అయితే ఈ సినిమాలో విలన్ మనిషై ఉండకూడదని అనుకున్నాం. ఒక ఫోర్స్ అవ్వాలి అని భావించాం. దానిని ఎలా జయించాలో ఎవరికీ తెలియకూడదు. చివరి నిమిషం వరకూ థ్రిల్ కొనసాగాలి. మరి హీరో ఆ గండం నుంచి ఎలా బయటపడతాడా? అనేది ప్రేక్షకుడు చివరి వరకూ ఉత్కంఠతో చూడాలి. అందుకే దేవత కోపానికి కారణమైన ఓ వ్యక్తి ఆ శాపం నుంచి ఎలా బయటపడ్డాడన్న అనే విషయమై మురారి స్టోరీని డెవలప్ చేశాం. మైథలాజికల్ కథలో మన సంస్కృతి, సంప్రదాయాలను కూడా చూపించాం. అని ఓ సందర్భంలో దర్శకుడు కృష్ణవంశీ అన్నారు.
రీమేక్ ప్రయత్నాలు - అభిషేక్ హీరోగా హిందీలో ఈ సినిమాను రీమేక్ చేయమని కృష్ణవంశీని అమితాబ్ అడిగారట. అలాగే తుషార్ కపూర్‌తో రీమేక్ చేయడానికి ఓ సంస్థ ప్రయత్నించిందంట కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. అసలు ఈ సినిమా మహేశ్‌తోనే రీమేక్ చేద్దామని కూడా అనుకున్నారు. కానీ అది కూడా సాధ్యపడలేదు. కన్నడలో మాత్రం మురళి హీరోగా గోపి పేరుతో ఇది రీమేక్ అయింది. అలాగే కృష్ణవంశీ, ప్రకాశ్ రాజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తమిళంలోకి డబ్ చేసి రిలీజ్ చేశారు.
వసూళ్ల రికార్డ్ - మురారి సినిమా తూర్పుగోదావరి జిల్లా పంపిణీ హక్కులు 5 లక్షలకు ఐదేళ్లపాటు తీసుకున్న కృష్ణవంశీకి ఫస్ట్ రౌండ్లో రూ.1.3 కోట్ల వసూళ్లు తెచ్చి పెట్టాయి. ఇప్పుడు రీరిలీజ్ విషయంలో కూడా తక్కువ సమయంలోనే రెండు కోట్ల కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అందుకున్న సినిమాగా మురారి రికార్డును సృష్టించింది. రిలీజైన అయిన సంవత్సరంలో మురారి చిత్రానికి 3 నంది అవార్డులు వచ్చాయి. సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిమ్ (సిల్వర్), బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్ (లక్ష్మీ) , స్పెషల్ జ్యూరీ (మహేశ్ బాబు) విభాగాల్లో అవార్డు వరించాయి.
ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానము - అందరూ ఆహ్వానితులే! - Ghattamaneni Wedding Invitation