Kangana Ranaut Emergency: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన 'ఎమర్జెన్సీ' సినిమా రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. మూవీ మేకర్స్‌కు బాంబే హై కోర్టులో బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ని తాము ఆదేశించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే సెప్టెంబర్ 18వ తేదీలోపు ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు హై కోర్టు సూచించింది. తదుపరి విచారణను 19వ తేదీ నాటికి వాయిదా వేసింది.
అయితే ఈ మూవీ సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. సినిమాలో తమని తక్కువగా చూపించారని విడుదలను అడ్డుకోవాలని ఒక వర్గం మధ్యప్రదేశ్ న్యాయస్థానాన్ని సంప్రదించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు వారి వాదనలను పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. అయితే సినిమా విడుదల తేదీ దగ్గరవుతున్నందున సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో కంగన ఇటీవల బాంబే హైకోర్టును సంప్రదించారు. ఈ క్రమంలోనే తాజాగా తీర్పు వెలువడింది.
కాగా, ఎమర్జెన్సీ సినిమా కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను ఈ సినిమాలో చూపించనున్నారు. ఇందులో నటి కంగన ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మూడు వారాల్లో ట్రైలర్‌కు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇక రీసెంట్గా సినిమా నుంచి మ్యూజిక్ ఆల్బమ్ రిలీజైంది. పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన ఉంది. ఈ చిత్రంలో జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో స్టార్ నటుడు అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. నటి మహిమా చౌదరి కీలక పాత్ర పోషించారు. ఇక జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
'ఎమర్జెన్సీ' ట్రైలర్ రిలీజ్- పవర్ఫుల్ ఉమెన్‌గా కంగనా రనౌత్! - Kangana Ranaut Emergency
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే: కంగనా రనౌత్ - Kangana Ranaut Marriege