Satyabhama Movie Review : చందమామ కాజల్ లీడ్ రోల్లో రూపొందిన తాజా మూవీ 'సత్యభామ'. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ శుక్రవారం (జూన్ 7)న ప్రేక్షకుల ముందుకొచ్చింది. డైరెక్టర్ శశికిరణ్ తిక్క సమర్పణలో, ఆయన స్క్రీన్‌ప్లే రచనలో ఈ చిత్రం భారీ అంచనాన నడుమ విడుదలైంది. మరి చిత్రం ఎలా ఉందంటే?
స్టోరీ ఏంటంటే :
సత్యభామ (కాజల్) షీ టీమ్‌లో ఏసీపీ స్థాయి పోలీస్ అధికారిగా పనిచేస్తుంటారు. చూడటానికి శాంతంగా కనిపించినప్పటికీ, నేరస్థుల దగ్గర నుంచి నిజాలు రప్పించే విషయంలో ఆమె దిట్ట. తనకు అప్పజెప్పిన కేసులన్నింటినీ సులభంగా వదిలిపెట్టదని పేరు. అయితే రచయిత అమరేందర్ (నవీన్‌చంద్ర)ను ఇష్టపడి పెళ్లి చేసుకున్న సత్యభామ తన వ్యక్తిగత జీవితానికంటే, వృత్తికే ఎక్కువ సమయం కేటాయిస్తుంటుంది.
ఇదిలా ఉండగా, ఆమె షీ టీమ్‌లో పనిచేస్తున్న సమయంలోనే హసీనా అనే ఓ బాధితురాలు గృహ హింసని అనుభవిస్తూ సాయం కోసం సత్యభామ దగ్గరికి వస్తుంది. నీకేం కాదు, అంతా నేను చూసుకుంటానని ధైర్యం చెప్పి పంపిస్తుంది సత్యభామ. అయితే ఆ తర్వాత హసీనా తన భర్త చేతిలో దారుణ హత్యకి గురవుతుంది. ఆ హత్య సత్యభామను ఎంతగానో కలచివేస్తుంది. దీంతో హసీనాతో పాటు, ఎంతో మంది జీవితాలతో ఆడుకున్న ఆ హంతకుడిని పట్టుకునే క్రమంలో సత్యభామకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆ కేసుని ఆమె వ్యక్తిగతంగా తీసుకోవడానికి కారణమేమిటి? ఇటువంటివి తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే :
పరిశోధన నేపథ్యంలో సాగే ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇది. ఈ తరహా కథలు ఈ మధ్య తెలుగులో చాలానే వచ్చాయి. ఓ నేరం. అది ఎవరు చేశారనేది చాలా కాలం వరకు అంతుచిక్కదు. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా అత్యంత పకడ్బందీగా జరిగిన ఆ ఘటన వెనక ఉన్న గుట్టుని విప్పేందుకు ఓ పోలీస్ అధికారో లేదంటే ఓ డిటెక్టివో లేదంటే, బాధితుడు, లేకుంటే అతడి తాలూకూ వ్యక్తులు వచ్చి చేధిస్తారు.
ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, వెలుగులోకి వచ్చే అసలు నిజాలు, కేసు ముడి వీడే క్రమం ఎలా సాగిందనేదే ఇటువంటి కథలకు కీలకం. 'సత్యభామ' కూడా అలాంటిదే. కానీ ఇక్కడ హత్య ఎవరు చేశారన్న విషయం ముందే తెలిసిపోతుంది. అతన్ని వెతికి పట్టుకోవడమే ఇక హీరోయిన్ పని. పైగా కేస్‌ని ఛేదించేది ఓ మహిళా పోలీస్ అధికారి. ఆమె కేస్‌ని వ్యక్తిగతంగా తీసుకునే క్రమంలో పండిన భావోద్వేగాలు ఈ సినిమాను కాస్త ప్రత్యేకంగా చూపించిందని చెప్పుకోవాలి. కొత్త కథేమీ కాదు కానీ, ఇలాంటి సినిమాలకు కథనమే కీలకం. మంచి రచయితగా పేరున్న శశికిరణ్ తిక్క కథనం పరంగా తనదైన ప్రభావం చూపించే ప్రయత్నాన్ని చేశారు.
ఇటువంటి కథల్లో రకరకాల అనుమానాల్ని రేకెత్తిస్తూ, చివరికి ఎవరూ ఊహించని ముగింపుని ఇస్తుంటారు డైరెక్టర్లు. ఇందులోనూ అదే చేశారు కానీ, అనుమానాల్ని రేకెత్తించే క్రమంలో ఉపకథల్లాగా కొత్త సంఘటనల్ని, కొత్త పాత్రల్ని తెరపై చూపిస్తూ వెళ్లడం వల్ల అసలు కథ కాస్త పక్కదారి పడుతుంది. అసలు నిందితుడు ఎక్కడా అనే ఉత్కంఠ క్రమంగా సడలిపోతూ, మధ్యలో వచ్చే వీడియో గేమ్స్ నేపథ్యం, మహిళల అక్రమ రవాణా, టెర్రరిజం తదితర అంశాల మీదనే ఎక్కువ ఫోకస్ పోతుంది. అయితే షి సేఫ్ యాప్ గురించి చెప్పే సీన్స్ కాస్త ఉపయోగకరంగా ఉంటాయి.
హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌లో అస్సలు బలం లేదు. సత్యభామ ఓ శక్తిమంతమైన పోలీస్ అధికారిగా పరిచయం అవుతుంది కానీ ఆ పాత్రను అందుకు తగ్గట్టుగా మలచలేదు. నిందితుడినీ అలాగే ఆధారాల్ని చేజేతులా వదిలేస్తూ, మళ్లీ వాటి కోసమే అన్వేషించే ఆ పాత్రలో ఏ కోశానా బలం, సహజత్వం అస్సలు కనిపించదు. సత్యభామ తన పరిశోధనతో వెలుగులోకి తీసుకొచ్చిన విషయాల కంటే కూడా, పతాక సన్నివేశాల్లో ఓ పాత్ర తనంతట తాను చెప్పే విషయాలే కాస్తా ఆసక్తికరంగా అనిపిస్తాయి. కొన్ని మలుపులు, పతాక సన్నివేశాలు ఆడియెన్స్‌ను మెప్పిస్తాయి.
ఎవరెలా చేశారంటే :
ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో, పక్కా కమర్షియల్ హీరోయిన్‌గా కనిపించిన చందమామ కాజల్, ఈ సారి ఫీమేల్ ఓరియెంటడ్ పాత్రలో కాస్త కొత్తగా కనిపించింది. పాత్రకు తగ్గట్టుగా హుషారుగానే కనిపించారు ఆమె. పోరాట ఘట్టాల్లోనూ తన కష్టం కనిపిస్తుంది. నవీన్‌చంద్రతో కలిసి ఓ సీన్లో ఎమోషన్స్ కూడా బాగా పండిచింది. ఆ పాత్ర మినహా, ఈ సినిమాలో మరే పాత్రకూ ప్రాధాన్యం లేదు. ప్రకాశ్‌రాజ్, హర్షవర్ధన్, నాగినీడు లాంటి సీనియర్ నటులు ఉన్నా కూడా ఈ సినిమాపై వాళ్ల ఎఫెక్ట్ ఎక్కడా కనిపించదు.
నవీన్‌చంద్ర ఈ సినిమాలో ఓ రచయితగా కనిపిస్తారు. అయితే ఈ చిత్రంలో ఆయనకు నటించేందుకు పెద్దగా ఆస్కారం దొరకలేదు. సాంకేతికంగా సినిమా ఫర్వాలేదనిపించింది. కెమెరా, సంగీతం, ఎడిటింగ్ విభాగాలు కూడా మంచి పనితీరుని కనబరిచాయి. రచన పరంగా పలు లోపాలు కనిపిస్తాయి.
సుమన్ చిక్కాల మేకింగ్‌లోనూ బిగి కొరవడింది. కాళికాదేవి కోపం, సీతాదేవిలోని శాంతం అనీ, ఆ సత్యభామ ఆయుధం చేతబూని యుద్ధం చేస్తే, ఈ సత్యభామ ఆయుధం వదిలిపెట్టి యుద్ధం చేసిందనీ ఇలా రైమింగ్‌తో కొన్ని డైలాగ్స్ వినిపిస్తాయి.
బలాలు
+ కాజల్ నటన
+ కథలోని కొన్ని మలుపులు
బలహీనతలు
- ఆసక్తి రేకెత్తించని కథ, కథనాలు
- ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు
చివరిగా : సత్యభామ - మమ అనిపించే ఓ క్రైమ్ థ్రిల్లర్.
గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
సౌత్ ఇండస్ట్రీపై కాజల్ షాకింగ్ కామెంట్స్!
బాక్సాఫీస్ ముందు పోలీస్ భామల పోరు - Kajal Agarwal VS Payal Rajput