Nana Patekar Slams Fan : బాలీవుడ్‌లో సీనియర్ నటుడిగా పేరు సంపాదించుకున్న యాక్టర్ నానా పటేకర్. గతేడాది వన్‌వాస్ మూవీ సినిమా సెట్‌లో ఆయన ఓ యువకుడితో దురుసుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్‌గా మారింది. తాజాగా ఈ విషయంపై నానా పటేకర్ స్పందించారు. యువకుడితో ఆవిధంగా ప్రవర్తించకుండా ఉండాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు.
"నాతో సెల్ఫీ దిగేందుకు ఓ యువకుడు నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు నేను షాట్‌లో ఉన్నాను. యాక్టర్స్ అందరూ సన్నివేశంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ టైమ్లో ఓ యువకుడు నా పక్కన నిల్చొని ఫొటో తీసుకుంటుంటే కోపంతో కొట్టేశాను. అది కాస్త కాంట్రవర్సీకి దారీ అయింది. నేను అలా చేయడం తప్పే. కానీ అతడు ప్రేమతోనే సెల్ఫీ తీసుకోవడానికి వచ్చాడు. మేము షాట్‌లో ఉన్న విషయం అతడికి తెలీదు. ఒక మనిషిపై ప్రేమను వ్యక్తపరచడానికి సరైన సమయం, సందర్భం కూడా ఉంటుంది. ఒకవేళ అతడు షూట్ పూర్తయ్యాక వచ్చి సెల్ఫీ కోసం అడిగి ఉంటే బాగుండేది. అప్పుడు ఎలాంటి సమస్య ఉండేది కాదు" అని నానా పటేకర్ పేర్కొన్నారు.
'వన్‌వాస్' చిత్రీకరణ సమయంలో గతేడాది నవంబర్‌లో నానా పటేకర్ వారణాసిలో పర్యటించారు. అప్పుడు వారణాసి వీధుల్లో చిత్రీకరణ జరుగుతోన్న సమయంలోనే అక్కడివారు ఆయన్ని చూసేందుకు, ఆయనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో నానా పటేకర్కు దగ్గరకు వెళ్లిన ఓ యువకుడు సెల్ఫీ తీసుకునేందుకు ట్రై చేశాడు. అయితే యువకుడి తీరుతో అసహనానికి గురైన నానా పటేకర్, అతడి తలపై కొట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నానా పటేకర్ తీరును చాలా మంది తప్పుబట్టారు. అభిమానితో అలా ప్రవర్తించడం సరికాదని చెప్పారు. ఈ క్రమంలోనే నానా పటేకర్ ఈ విషయంపై స్పందించారు. ఆ యువకుడికి క్షమాపణలు కూడా చెప్పారు. కాగా, వన్‌వాస్ చిత్రానికి అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. శ్రుతి మరాఠే, అశ్విని కల్సేకర్ కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ కానుంది.