Fathers Day Special 2024: తెలుగు సినిమా, ప్రపంచానికి చాలా మంది గొప్ప నటులను పరిచయం చేసింది. ఎంతలా అంటే, కొన్ని పాత్రల పేర్లు చెబితే, కొందరు నటులు మనసులో మెదులుతారు. గయ్యాలి అత్త పాత్రకు సూర్యకాంతం, తల్లి పాత్రలకు నిర్మలమ్మ మారుపేరుగా మారిపోయారు. అలానే చాలా మంది యాక్టర్లు తండ్రి పాత్రల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆదివారం (జూన్ 16) 'ఫాదర్స్ డే' సందర్భంగా వెండి తెరపై తండ్రి పాత్రలకు వన్నె తీసుకొచ్చిన యాక్టర్లను గుర్తు చేసుకుందాం.
గుమ్మడి వెంకటేశ్వరరావు: 1950లలో హాస్యనటుడిగా కెరీర్ ప్రారంభించి, అనంతరం విలన్‌గా మారారు. క్రమంగా హీరోకి, వాళ్ల పెద్దన్నకి ఫ్రెండ్ రోల్స్ చేశాడు. ఏఎన్నార్, ఎన్టీఆర్ లాంటి టాప్ హీరోలకు సమానంగా ప్రధాన పాత్ర లేదా ప్రతినాయకుడి పాత్రలు పోషించారు. 1970ల చివరలో తండ్రి పాత్రలు చేశారు. కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, అలానే కొన్ని మూవీల్లో విలన్స్‌కి కూడా ఫాదర్‌గా యాక్ట్ చేశారు. భార్య భర్తలు, సంపూర్ణ రామాయణం, ఇద్దరు మిత్రులు, మరో మలుపు, పునర్జన్మ, అంతస్తులు, ఆస్తిపరులు, బృందావనం లాంటి సినిమాల్లో ఆయన చేసిన తండ్రిపాత్రలకు గుర్తింపు వచ్చింది.
ఎస్వీ రంగారావు: ఎస్వీ రంగారావు 1950లలో ఏఎన్నార్, ఎన్టీఆర్ తండ్రి పాత్రలు పోషించారు. పెళ్లి చేసి చూడులో ఎన్టీఆర్‌కు తండ్రిగా, ఏఎన్నార్ సినిమాల్లో హీరోయిన్ తండ్రిగా కనిపించారు. అటు పౌరాణికాలు, ఇటు జానపదాలు, సాంఘిక చిత్రాల్లో చాలా కీలక పాత్రలు పోషించి, ఉత్తమ నటులనే గుర్తింపు పొందారు. పెళ్లి చేసి చూడు, మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు, లక్ష్మీ నివాసం, తాత- మనవడు, ఆత్మ బంధువు, దసరాబుల్లోడు మూవీల్లో ఆయన చేసిన తండ్రి పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
చిత్తూరు వి.నాగయ్య: తెలుగు సినిమాల్లో మొదటి స్టార్ యాక్టర్‌గా చిత్తూరు వి.నాగయ్యను పేర్కొంటారు. ఆయన ఆరోజుల్లోనే లీడ్ రోల్‌కి రూ.లక్షకు పైగా వసూలు చేశారని చెబుతారు. కొంతకాలానికి తండ్రి పాత్రలు లేదా చిన్న పాత్రలు కూడా పోషించారు. పాండురంగ మహత్యం, శ్రీ సీతారామ కళ్యాణం, వాగ్దానం, మూగ నోము సినిమాల్లో తండ్రి పాత్రల్లో మెప్పించారు.
కైకాల సత్యనారాయణ: కైకాల సత్యనారాయణ చాలా కాలం విలన్‌గా యాక్ట్ చేశారు. తర్వాత మెల్లగా పెద్ద స్టార్స్ సినిమాల్లో పాజిటివ్ రోల్స్‌లో కనిపించారు. నెగెటివ్ లీడ్, పాజిటివ్ ఫాదర్‌గా కూడా క్లిక్ అయ్యాడు. శ్రీ రంగ నీతులు, అమ్మ రాజీనామా, శుభలేఖ, మంత్రి గారి వియ్యంకుడు, మజ్ను, ఆఖరి పోరాటం, పెళ్లి సందడి సినిమాల్లో ఆయన చేసిన తండ్రి పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది.
చంద్ర మోహన్: చంద్ర మోహన్ 1990ల ప్రారంభం నుంచి హాస్యనటుడు. కామెడీ హీరో పాత్రల నుంచి క్యారెక్టర్ రోల్స్‌కి మారారు. ఏ పాత్రైనా ఈజీగా చేయగలరనే గుర్తింపు పొందారు. ఆయన ఫాదర్‌గా నవ్వించారు, కొన్ని సినిమాల్లో ఏడిపించారు. ముఖ్యంగా ఆమె, ఒక్కడు, నువ్వే నువ్వే, ఢీ, మనసంతా నువ్వే, 7జీ బృందావన కాలనీ, గులాబీ సినిమాల్లో ఫాదర్ రోల్స్ మంచి పేరు తెచ్చిపెట్టాయి.
సుత్తి వీరభద్రరావు: సుత్తి వీరభద్రరావు ఎక్కువగా కామెడీ షేడ్స్ ఉన్న తండ్రి పాత్రలు చేశారు. ప్రధానంగా జంధ్యాల సినిమాల్లో కామెడీ హీరోల తండ్రిగా యాక్ట్ చేసి మెప్పించారు. చూపులు కలసిన శుభవేళ, శ్రీవారికి ప్రేమ లేఖ, నాలుగు స్తంభాల ఆట, మొగుడు పెళ్లాలు వంటి చిత్రాల్లో ఆయనకు మంచి మార్కులు పడ్డాయి.
ప్రకాష్ రాజ్: తెలుగు సినిమాల్లో ప్రకాష్ రాజ్ చాలా రకాల పాత్రలు పోషించారు. విలన్‌గా, హీరో, హీరోయిన్ తండ్రిగా చాలా మూవీల్లో నటించారు. విలన్, హీరోయిన్ తండ్రిగా కనిపించిన సినిమాలు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. నువ్వే నువ్వే, అంతఃపురం, నువ్వు నాకు నచ్చావ్, ప్రేమకు స్వాగతం, దిల్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పరుగు, బొమ్మరిల్లు సినిమాలు ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతాయి.
మురళీ శర్మ: 2010 నుంచి ప్రకాష్ రాజ్ స్థానాన్ని మురళీ శర్మ ఆక్రమించారని చెప్పవచ్చు. వరుసగా తెలుగు సినిమాల్లో హీరో లేదా హీరోయిన్స్‌కి తండ్రి పాత్రలు పోషిస్తున్నారు. భలే భలే మొగాడివోయ్, అలా వైకుంఠపురం లో, విజేత (2018), పడి పడి లేచే.. మనసు సినిమాలు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి.
రాజేంద్ర ప్రసాద్: ఇండస్ట్రీలో కామెడీ హీరో నుంచి తండ్రి పాత్రలకు వచ్చి అద్భుతంగా మెప్పించిన నటుల్లో రాజేంద్ర ప్రసాద్ ఒకరు. కామెడీ చేసి నవ్వించినంత ఈజీగా, ఎమోషన్ చూపించి ఏడిపించగలరు. ఆ నలుగురు సినిమాలో ఆయన పాత్రకు చాలా ప్రశంసలు దక్కాయి. మహానటి, కౌసల్య కృష్ణమూర్తి, సుప్రీమ్, ఈడో రకం ఆడో రకం, నాన్నకు ప్రేమతో సినిమాల్లో తండ్రిగా ఆయన నటన అద్భుతంగా ఉంటుంది.
నరేశ్: రాజేంద్ర ప్రసాద్ తరహాలోనే కామెడీ హీరో నుంచి క్యారక్టెర్ ఆర్టిస్ట్‌గా మారారు. 2010 నుంచి ఇప్పటి వరకు ఫాదర్ క్యారక్టెర్స్‌లో నటిస్తున్నారు. భలే భలే మొగాడివోయ్, దృశ్యం, సమ్మోహనం, అందరి బంధువయా లాంటి సినిమాల్లో తండ్రిగా ఆకట్టుకున్నారు.
రావు రమేశ్: తన తండ్రి రావు గోపాలరావు లానే రావు రమేష్ మంచి క్యారక్టెర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అటు పాజిటివ్, ఇటు నెగెటివ్ రోల్స్ చేయడంలో తనకు తరుగులేదని నిరూపించకున్నారు. ఓ బేబీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆర్‌ఎక్స్ RX100, అ..ఆ, అత్తారింటికి దారేది సినిమాల్లో ఆయన చేసిన తండ్రి పాత్రలు ప్రత్యేకంగా నిలిచిపోయాయి.
జగపతి బాబు: చాలా కాలం హీరోగా కొనసాగిన జగపతి బాబు, తర్వాత రూటు మార్చారు. విలన్, హీరో, హీరోయిన్లకు తండ్రి పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీమంతుడు, రారండోయ్ వేడుక చూద్దాంలో ఆయన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.
Fathers Day 2023 : 'ఆ మాట నేను కాదనలేదు.. ఇంకా పాటిస్తున్నాను'