Kalki 2898 AD Director NagAshwin : కల్కి 2898 ఏడీతో భారీ సక్సెస్ అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రస్తుతం విజయోత్సాహంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారాయన. ఇందులో భాగంగానే కల్కిలో కృష్ణుడు పాత్ర గురించి మాట్లాడారు. అందులో మహేశ్ బాబు నటించి ఉంటే బాగుండేదని అంటూ వస్తున్న అభిప్రాయాలపై స్పందించారు. కల్కి చిత్రంలో కాకుండా మరో సినిమాలో మహేశ్ కృష్ణుడిగా నటిస్తే చాలా బాగుంటుందని అన్నారు. అలానే రూపం లేకుండా ఉంటేనే భగవంతుడి పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని, అందుకే చిత్రంలో కృష్ణుడు ఫేస్‌ను రివీల్ చేయలేదని అన్నారు.
ఆ స్ఫూర్తితోనే తీశా - "సాధారణంగా తెలుగు సినిమా అనగానే చాలా మందికి మాయాబజార్ గుర్తొస్తుంది. చెప్పాలంటే ఆ చిత్రం మహాభారతం ఆధారంగానే రూపొందింది. దాన్నే నేను స్ఫూర్తిగా తీసుకున్నాను. అలా ఇతిహాసాలను కల్కి కథతో ముడిపెట్టాలనే ఆలోచన వచ్చింది" అని అశ్విన్ పేర్కొన్నారు.
అందుకే 6 వేల సంవత్సరాలుగా చూపించా - "కలియుగాన్ని 4 లక్షల 32 వేల సంవత్సరాలుగా చెబుతుంటారు. కానీ, ఓ లాజిక్ ప్రకారం 72 ఏళ్లను ఒక్క సంవత్సరమనేది ఎక్కడో చదివా. 4,32,000ను 72తో భాగిస్తే 6 వేలు. అందుకే ఆరు వేల సంవత్సరాల తర్వాత కల్కి వచ్చినట్లు అనే ఐడియాతో ముందుకెళ్లాం. ఇక రెండో భాగం విషయానికొస్తే స్క్రిప్టే ఓ పెద్ద ఛాలెంజ్. ఇక రెండో భాగంలో తప్పకుండా ప్రభాస్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. పార్ట్ 1 క్లైమాక్స్‌లో కర్ణుడి పాత్రనూ ఏ కోణంలోనూ నెగెటివ్‌గా చూపించలేదు. పార్ట్ 2లోనూ అలానే అంతే. అతిథి పాత్రల గురించి ఇంకా ఏం అనుకోలేదు" అని చెప్పుకొచ్చారు అశ్విన్.
ఆ తర్వాతే అనుకున్నాం - "ముందుగా ఒక్క సినిమాగానే కల్కి కథను తెరకెక్కించాలనుకున్నాను. కానీ కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ పూర్తైన తర్వాత ఇంత పెద్ద కథను ఒక్క భాగంలో చెప్పడం సవాలుగా అనిపించింది. అప్పుడే పార్ట్‌లుగా చూపించాలని డిసైడ్ అయ్యాను. పార్ట్ 2కు సంబంధించి 20 రోజులు చిత్రీకరణ చేశాం" అని అశ్విన్ వెల్లడించారు.
ఆ ఆలోచన లేదు - "మహాభారతాన్ని పూర్తిస్థాయిలో తెరకెక్కించే అవకాశం ఉందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు నాగ్ అశ్విన్. ప్రస్తుతానికైతే ఆ ఆలోచన లేదని అన్నారు. అలానే ఈ కథను ముందుగా చిరుకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు" అని పేర్కొన్నారు అశ్విన్.
నాగ్ అశ్విన్ గత చిత్రాల్లోని నటులంతా కల్కిలో కనపడగా నాని, నవీన్ పొలిశెట్టిని మాత్రం కనపడలేదు. దీనిపై మాట్లాడుతూ "వారిని తీసుకునే అవకాశం దొరకలేదు. కానీ, తర్వాత ఎక్కడ వీలుంటే అక్కడ వారిని పెట్టేస్తా" అని అన్నారు అశ్విన్. విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ గురించి మాట్లాడుతూ - "నా తొలి సినిమా నటులు నాకెప్పుడూ ప్రత్యేకమే. వారు నాకు లక్కీ ఛార్మ్. అందుకే వాళ్లతో కలిసి పనిచేయడం నాకు కంఫర్ట్‌గా ఉంటుంది" అని చెప్పారు. పార్ట్ 2 రిలీజ్ డేట్ గురించి కూడా క్లారిటీ లేదని చెప్పుకొచ్చారు.