Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె అరుదైన ఘనత సాధించింది. హాలీవుడ్ మ్యాగజైన్ 'డెడ్‌లైన్స్ గ్లోబల్ డిస్‌రప్టర్స్' ఈ ఏడాది జాబితాలో దీపిక చోటు దక్కించుకుంది. ఈ మ్యాగజైన్లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ నటిగా దీపిక నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వినోదరంగంలో రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నటీనటుల జాబితాను ప్రతి ఏడాది ఈ మ్యాగజైన్ విడుదల చేస్తుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, పలు విషయాలు షేర్ చేసుకుంది.
'ఒక మంచి వ్యక్తిగా ఎదగడం, మంచి వ్యక్తులతో సమయం గడపడం, సెట్‌లోని అనుభవాలను మర్చిపోలేని జ్ఞాపకాలుగా గుర్తుచేసుకోవడం ఇవే నా దృష్టిలో ముఖ్యమైనవి. ఇప్పుడు దక్కిన ఈ గౌరవానికి కూడా ఇదే కారణమని భావిస్తున్నాను. కానీ అందరు నటీనటులు నాలా ఉండరు. నటించిన సినిమా సక్సెస్ అవ్వాలి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రావాలి, నటనలో మెప్పించాలి, అవార్డులు, ప్రశంసలు ఇవే ముఖ్యం అని అనుకుంటారు' అని చెప్పింది.
'2007లో భారీ విజయం అందుకున్న 'ఓం శాంతి ఓం' సినిమాతో నేను బాలీవుడ్‌కు పరిచమయ్యా. ఈ సినిమాకు నేను అసలు ఆడిషన్ కూడా ఇవ్వలేదు. డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ ఎలాంటి ఆడిషన్ చేయకుండానే నన్ను సెలక్ట్ చేశారు. ఎందుకలా చేశారో నాకే తెలీదు. కానీ, నాలో ఓ స్టార్ ఉందని, నాపై నమ్మకంతో ఆ ఛాన్స్ ఇచ్చామని మూవీ మేకర్స్ చెప్పడం వల్ల చాలా సంతోషించాను. అలా మొదలైన సినీ ప్రయాణంలో అనేక విషయాలు నేర్చుకున్నా. ఇప్పుడు బాలీవుడ్‌తోపాటు నన్ను హాలీవుడ్‌లోనూ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అక్కడి సినిమాలోని నటనకు తగ్గట్టు నేను ఫాన్సీ యాక్టింగ్ స్కూల్లో చేరలేదు, ఇంగ్లిష్ నటనలో శిక్షణ తీసుకోలేదు. కానీ, ఒక్కసారి హాలీవుడ్‌లో అడుగుపెట్టిన తర్వాత ఇంగ్లిష్ సినిమాలకి తగ్గ నైపుణ్యాలను నేర్చుకున్నా' అని తన కెరీర్ జర్నీ గురించి ఈ సందర్భంగా దీపిక చెప్పుకొచ్చింది.
ఇక రెబల్‌స్టార్ ప్రభాస్ 'కల్కి AD 2898' మూవీతో దీపిక తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వనునుంది. ఈ సినిమాలో దీపిక కీలక పాత్రలో నటిస్తోంది. నాగ్అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 27న వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.