Balakrishna Unstoppable Season 4 : బాలయ్య తన అభిమానులకు దసరా కానుక అందించాడు. దేశంలోనే టాప్ టాక్ షోగా గుర్తింపు తెచ్చుకొన్న 'అన్‌స్టాపబుల్' సీజన్ 4 ట్రైలర్ శనివారం రిలీజ్ అయింది. వెండితెరపైనే కాకుండా ఓటీటీలోనూ తనకు ఎదురులేదని బాలయ్య అన్‌స్టాపబుల్‌తో నిరూపించారు. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మూడు సీజన్‌లు పూర్తి చే సుకొని నాలుగో సీజన్ ఇప్పుడు స్ట్రీమింగ్‌కి రెడీ అయింది. అక్టోబరు 24వ తేదీ నుంచి సీజన్-4 ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా బాలయ్య తాను వ్యాఖ్యాతగా మారడం వెనకగల ఆసక్తికర అంశాలు షేర్ చేసుకొన్నారు.
ఆయన కోసమే ఒప్పుకొన్నా
బాలయ్య అన్‌స్టాపబుల్ గురించి కీలక విషయాలు చెప్పారు. "చాలా షోలకు వ్యాఖ్యాతగా చేయమని చాలా మంది అడిగారు. కానీ ఒప్పుకోలేదు. ఈ షో కూడా కేవలం అరవింద్ కోసమే అంగీకరించారు. ఐఎండీబీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఈ షో 18వ స్థానంలో ఉండటం అద్భుతం. చాలా మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు షోకు వచ్చారు. వాళ్ల వల్ల కూడా ఈ షో సక్సెస్ అయింది. ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగినా, అన్నింటికీ ఓపికగా సమాధానం ఇచ్చారు." అని బాలయ్య చెప్పారు.
సీజన్ 4 అదిరిపోతుంది
దసరా శరన్నవరాత్రుల సందర్బంగా అన్‌స్టాపబుల్ మొదలైందని, నాన్న నందమూరి తారకరామారావు ప్రయోగాత్మక చిత్రాల స్ఫూర్తితోనే అన్‌స్టాపబుల్‌కి వ్యాఖ్యాతగా మారానని బాలయ్య కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తారని, అందుకే షో మంచి విజయాన్ని అందుకుందని చెప్పారు. సీజన్-4 కొత్తగా అందించాలన్న ఉద్దేశంతో యానిమేషన్ రూపంలో ట్రైలర్ తీసుకొచ్చారని, గత సీజన్ల కంటే సీజన్ 4 అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు.
బాలయ్యలో కొత్త కోణం చూశారు
బాలకృష్ణ కుమార్తె తేజస్వినీ కూడా ఈ ఈవెంట్లో మాట్లాడారు. "నాన్న ఈ షో చేస్తున్నప్పుడు బాలకృష్ణ పర్సనాలిటీకి నప్పుతుందా? లేదా అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ధైర్యంగా చేశారు. ఇప్పుడు దేశంలోనే పాపులర్ షో అయింది. నాన్నలో ఎవరూ చూడని కోణాన్ని ప్రజలు చూశారు. ఆయన చేయని జానర్ లేదు, వేయని గెటప్ లేదు. 'అన్‌స్టాపబుల్ సీజన్ 4'లో ఏం చేస్తారా? అని అందరూ చూస్తున్నారు. మీరు ఊహించని స్థాయిలో ఉంటుంది. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ షూట్ కూడా చేశాం. ఇప్పుడు మీరు చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే" అని తేజస్వీనీ అన్నారు.
'అన్‌స్టాపబుల్ సీజన్ 4 అనౌన్స్మెంట్' - ఈ సూపర్ హీరో దెబ్బకు థింకింగ్ మారితీరాలా!