Aadu Jeevitham Pritviraj Sukumaran : మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ కథానాయకుడిగా రీసెంట్ గా విడుదలైన 'ది గోట్ లైఫ్'(ఆడుజీవితం)బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. తన అసాధారణమైన నటనతో పృథ్వీరాజ్ సినిమా మొత్తాన్ని ఒంటి కాలిమీద నడిపించాడనంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యంగా పాత్రకు తగ్గట్టుగా తన శరీరాన్ని మార్చుకున్న విషయంలో విమర్శకులు నుంచి కూడా ప్రశంసలు పొందేలా చేసింది. అయితే పృథ్వీరాజ్ శారీరక పరివర్తన తెర మీద కనిపించినంత సులువుగా మాత్రం జరగలేదట. ఇందుకోసం ఎన్నో సార్లు ఆకలితో అలమటించిపోయేవాడని పృథ్వీరాజ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
"ది గోట్ లైఫ్ చిత్రంలో నజీబ్ పాత్ర కోసం దాదాపు 72గంటల పాటు నేను ఏమీ తినకుండా ఉండేవాడిని. కేవలం మంచి నీరు, బ్లాక్ కాఫీ మాత్రమే తాగుతూ ఆకలిని అదుపు చేసుకునేవాడిని. అలా ఫాస్టింగ్ చేస్తూ నేను దాదాపు 30కిలోలకు పైగా బరువు తగ్గాను. ముఖ్యంగా కోవిడ్ సమయంలో సినిమా షూటింగ్ ఆగిపోయిన తర్వాత మళ్లీ పాత్రకు తగ్గట్లు నా శరీరాన్ని మార్చుకోవడం నాకు పెద్ద సవాలుగా మారింది. ఇందుకోసం నేను పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు."అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.
నమ్మశక్యంగా లేదు కదా. కానీ ఆ సినిమా చూస్తే కచ్చితంగా నమ్మాల్సి వస్తుంది. వాస్తవానికి 'ది గోట్ లైఫ్'(ఆడుజీవితం) సినిమాలో పృథ్వీరాజ్ పాత్ర చాలా భిన్నమైనది. బ్లెస్సీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ పాత్ర పేరు నజీబ్. కేరళకు చెందిన నజీబ్ యువ కార్మికుడిగా పనిచేసేందుకు గల్ఫ్ దేశానికి వెళ్తాడు. అక్కడ మోససోయి ఎడారిలో ఓ గొర్రెల కాపరిలా ఉండాల్సి వస్తుంది. అక్కడ ఆహారం, కనీస వసతులు లేక నజీబ్ పడ్డ ఇబ్బందులను సినిమాలో కళ్లకు కట్టినట్టుగా చూడవచ్చు.
ఈ ఎమెషనల్ జర్నీలో పృథ్వీ యాక్టింగ్, ఫిజికల్ ట్రాన్స్పరెన్సీ చూసి అంతా మెచ్చుకున్నారు. మలయాళంలో బాగా ఫేమస్ అయిన 'ఆడుజీవితం' పుస్తకం ఆధారంగా బ్లెస్సీ ఈ సినిమాను ఎడారి ప్రాంతంలో దాదాపు 13 ఏళ్ల పాటు తెరకెక్కించారు. భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా మలయాళంతో పాటు పలు భాషల్లో విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది.