12th Fail Supreme Court Screening : బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మస్సే లీడ్ రోల్లో, ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ బయోపిక్‌గా తెరకెక్కిన '12th ఫెయిల్' మూవీ ఇప్పటికే పలు అవార్డులతో పాటు ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కోసం సుప్రీంకోర్టులో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఇక ఈ స్క్రీనింగ్‌లో ఆయనతో పాటు పలువురు న్యాయవాదులు, 600 మంది సుప్రీంకోర్టు అధికారులు, వారి కుటుంబసభ్యులు, అలాగే మూవీ టీమ్ పాల్గొని సందడి చేశారు.
ఇక సినిమా చూసిన తర్వాత సీజేఐ '12th ఫెయిల్' మూవీ టీమ్‌ను మెచ్చుకున్నారు. ఇది ఓ ఇన్స్పిరేషనల్ మూవీ అని కొనియాడారు.
"చుట్టూ ఉన్న ప్రజల కోసం ఏదైనా చేసేలా ఉండే ఇటువంటి సినిమాలు ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తి నింపుతాయి. విక్రాంత్, మేధా శంకర్ ఈ మూవీలో అద్భుతంగా నటించారు. వారి పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. అయితే ఈ చిత్రంలోని కొన్ని సీన్స్ చూసి నా కళ్లు చెమర్చాయి. ఆశ అనే గొప్ప సందేశాన్ని ఈ సినిమా చాలా బాగా చూపించింది. నా కో స్టార్స్, సిబ్బంది అందరి తరఫున ఈ చిత్ర బృందానికి ధన్యవాదాలు" అంటూ సీజేఐ మూవీ టీమ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.
ఇదిలా ఉండగా, సీజేఐ మాటలకు డైరెక్టర్ విదు వినోద్ చోప్రా కూడా సంతోషం వ్యక్తం చేశారు. "నా జీవితంలో ఇవి ఎంతో అందమైన క్షణాలు. సీజేఐతో కలిసి ఈ సినిమాను చూడటం ఎంతో ఆనందంగా ఉంది. సుమారు ఐదేళ్లు శ్రమించి మరీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. ఆయన మాటలతో నా శ్రమకు తగిన విలువ దక్కినట్లు అనిపించింది" అని చోప్రా తెలిపారు.
స్టోరీ ఏంటంటే ?
ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా అనురాగ్ పాఠక్ రాసిన పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం రూపొందింది. మధ్యప్రదేశ్‌లోని చంబల్‌లోయ ప్రాంతమైన మౌర్యానాకు చెందిన మనోజ్ కుమార్ శర్మ ( విక్రాంత్ మాస్సే)ది నిరుపేద కుటుంబం. తినడానికి సరిగా తిండి లేని పరిస్థితి. మనోజ్ తండ్రి పనిలో నిజాయతీగా ఉన్నాడన్న కారణం వల్ల సస్పెండ్ అవుతాడు.
చదువులో మనోజ్ టాపర్ ఏమీ కాదు. పైగా పరీక్షల్లో కాపీ కొట్టమని అతడి పాఠశాల ప్రిన్సిపలే ఎంకరేజ్ చేస్తారు. ఈ విషయం డీఎస్పీ దుష్యంత్ (ప్రియాన్షు ఛటర్జీ)కి తెలియడం వల్ల ఆ పాఠశాల ప్రిన్సిపల్‌ను పట్టుకుని, జైలుకు పంపుతాడు. అందరూ నిజాయతీగా ఉండాలని విద్యార్థులకు చెబుతారు. సగటు విద్యార్థి అయిన మనోజ్ 12వ తరగతి ఫెయిల్ అవుతాడు. డీఎస్పీ దుష్యంత్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని మనోజ్ ఏం చేశాడు? 12th ఫెయిల్ అయినా సివిల్స్ వైపు అతడి పయనం ఎలా సాగింది? ఈ క్రమంలో మనోజ్‌కు ఎదురైన సవాళ్ల గురించే ఈ సినిమా.
23 ఏళ్లలో తొలిసారిగా - ఆ టాప్ మూవీస్ రికార్డులు బ్రేక్! - 12th Fail Movie Record