SBI To Hire 12000 Employees : ఇంజినీరింగ్ చేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ 12,000 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఐటీ సెక్టార్‌లో నియామకాలు నెమ్మదించిన వేళ, ఫ్రెషర్లకు ఎస్‌బీఐ ఈ తీపి కబురు చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 12,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు తెలిపింది.
ఇంజినీర్లకు బెస్ట్ ఛాన్స్!
మొత్తం 12 వేల పోస్టుల్లో 85% వరకు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకే అవకాశం కల్పించనున్నట్లు ఎస్‌బీఐ ఛైర్మన్ దినేశ్ ఖారా స్పష్టం చేశారు. 3000 మంది పీఓలు, 8000 మంది అసోసియేట్లకు బ్యాంకింగ్ వ్యవహారాల్లో శిక్షణ ఇచ్చి, ఆ తరువాత వారిని వివిధ వ్యాపార విభాగాల్లో నియమించుకోనున్నట్లు ఆయన చెప్పారు.
అంతా టెక్నాలజీమయం!
ఒకప్పటిలా కాకుండా, నేడు బ్యాంకింగ్ సెక్టార్ చాలా వరకు ఆధునిక సాంకేతికతపై ఆధారపడుతోందని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేశ్ ఖారా అన్నారు. అందుకే నూతన సాంకేతికత ఆధారంగా, కస్టమర్లకు ఏ విధంగా సేవలందించాలనే దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది అని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలోనే దేశంలోని కొన్ని బ్యాంకులు పలు సవాళ్లు ఎదుర్కొంటున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అందుకే ఇంజినీరింగ్ అభ్యర్థులకు ప్రత్యకంగా శిక్షణ ఇచ్చి, వారి వారి ప్రతిభను బట్టి వివిధ వ్యాపార, ఐటీ బాధ్యతలు అప్పగించనున్నట్లు దినేశ్ ఖారా తెలిపారు. దీని వల్ల బ్యాంకింగ్ సెక్టార్‌లో తగినంత స్థాయిలో టెక్ మ్యాన్‌పవర్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
ఎస్‌బీఐ సిబ్బందికి ఇన్‌హౌన్ ఇన్‌స్టిట్యూట్‌లో సాంకేతిక శిక్షణ ఇస్తున్నామని, ఇందుకోసం చాలా ఎక్కువ మొత్తమే ఖర్చవుతోందని దినేశ్ ఖారా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకింగ్ సిబ్బంది అంతా కచ్చితంగా టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు చాలా వరకు ఆర్థిక లావాదేవీలు టెక్నాలజీ ఆధారంగానే జరుగుతున్నాయి కనుక దీనిని ఎవరూ విస్మరించడానికి వీల్లేదని చెప్పారు. ఈ విషయంలో ఆర్‌బీఐ నుంచి కూడా తగిన మార్గదర్శకాలు ఉన్నాయని ఖారా తెలిపారు. వాస్తవానికి సాంకేతిక అంశాలపై ఆర్‌బీఐ ఇప్పటికే దృష్టి సారించింది. ఏదైనా బ్యాంక్‌లో సాంకేతిక లోపాలు గుర్తిస్తే, వెంటనే పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తోంది.
పరీక్షలు అంటేనే భయంగా ఉందా? ఈ 9-టిప్స్ పాటిస్తే విజయం మీదే! - Exam Anxiety