AI Prompt Engineers Recruitment : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)- పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న అంశం కూడా ఇదే. పెద్ద సంఖ్యల్లో కంపెనీలు దీని సాయంతో పనులను సులభంగా, తక్కువ సమయంలోనే పూర్తి చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో ఏఐ ఆధారిత ఉద్యోగాలపై ఆసక్తికరమైన అంశం తెలిసింది. ఏఐ ఆధారంగా చేసే ప్రాంప్ట్ ఇంజినీర్ ఉద్యోగాలకు దేశంలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. యాక్సెంచర్, ఐబీఎం, టాటా గ్రూప్ సహా పలు అగ్రశ్రేణి కంపెనీలు ప్రాంప్ట్ ఇంజనీర్ ఉద్యోగులను నియమించుకునే పనిలో ఉన్నాయి. ప్రాంప్ట్ ఇంజనీర్ ఉద్యోగి ఏం చేయాలి? ఈ జాబ్‌కు విద్యార్హతలు ఏంటి? వార్షిక శాలరీ ఏమాత్రం ఉంటుంది? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
భారీ శాలరీలు!
దేశంలో గత ఆరు నెలల్లో ప్రాంప్ట్ ఇంజినీర్ సహా పలు విభాగాల్లో 18,000-22,000 ఉద్యోగ నియామకాలు జరిగాయి. ప్రాంప్ట్ ఇంజినీర్ ఉద్యోగం పొందాలంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఆంగ్ల భాషపై పట్టు ఉండాలి. అయితే ఏఐ, మెషీన్ లెర్నింగ్ సర్టిఫికేషన్ కలిగిన ఇంజినీర్లు దాదాపుగా రూ. 20 లక్షల వార్షిక వేతనాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అప్పుడే ఉద్యోగంలో జాయిన్ ప్రాంప్ట్ ఇంజినీర్లకు ఏడాదికి రూ. 4 లక్షల ప్యాకేజీ లభిస్తోంది.
ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే- ఏఐ నుంచి అత్యంత కచ్చితమైన, అవసరమైన సమాచారం తెలుసుకునేందుకు అడగాల్సిన ప్రశ్నలు ఏంటో గుర్తించడం. హ్యుమన్ ఇంటెంట్, ఏఐ మోడల్ ఆర్కిటెక్చర్, ట్రైనింగ్ డేటా, టోకనైజేషన్ మోడల్‌పై ప్రాంప్ట్ ఇంజినీర్లు అవగాహన కలిగి ఉండాలి. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్‌ఎల్‌పీ) టెక్నాలజీలో నైపుణ్యం ఉండాలి. చాట్ జీపీటీ, గూగుల్ జెమిని, డాల్-ఈ వంటి ఏఐ మోడల్స్‌పై అవగాహన ఉండాలి. ప్రాంప్ట్ ఇంజినీర్లు అనలిటిక్స్‌ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏఐ ప్లాట్ ఫామ్స్ ప్రవర్తన, ప్రదర్శనను అంచనా వేసేందుకు ఇన్ పుట్స్ - ఔట్ పుట్స్‌ను గమనించాల్సి ఉంటుంది. పైథాన్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పై పట్టుకూడా అవసరమే.
అమెరికాలో ఫుల్ డిమాండ్
భారత దేశంలో ఏఐ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఉద్యోగాల వృద్ధి గతేడాదిగా పెరిగిందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ప్రాంప్ట్ ఇంజినీర్ జీతం సగటున ఏడాదికి రూ.8 లక్షలు- రూ. 13 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. అయినప్పటికీ అమెరికాతో పోలిస్తే భారత్‌లో ప్రాంప్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు తక్కువేనట.