Invicta Career Consultancy Helps Aspirants To Study In America : భవిష్యత్తు కోసం ఏటా విదేశాల బాట పట్టే విద్యార్థులెందరో. ప్రస్తుతం భారత్ నుంచి 108 దేశాల్లో 13 లక్షల మంది వరకు భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. త్వరలోనే ఆ సంఖ్య 18 లక్షలకు చేరుకుంటుందని సర్వేలూ చెబుతున్నాయి. అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా 19% పెరుగుతోంది. దాంతో అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు వాళ్ల ప్రతినిధులను భారత్‌కి పంపించి అవగాహన సదస్సులు నిర్వహింపజేస్తున్నాయి.
విజయవాడలోని ఇన్వెక్టా కెరీర్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమం జరిగింది. కోస్తాంధ్ర జిల్లాల నుంచి అమెరికా వెళ్లేందుకు ఆసక్తి కనబరిచే విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రుల సందేహాల నివృత్తికి ఈ కార్యక్రమం వేదికయ్యింది. పదికిపైగా అమెరికాకు చెందిన యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొని విద్యార్థుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేశారు.
ఎంఎస్ చేయడానికి ఈ ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో అమెరికాకు వెళ్లినా 2025 ఏప్రిల్ లోపు చదువు పూర్తవుతుంది. ఇప్పుడు వెళ్లేవారికి ఆర్థిక మాంద్యం సమస్య కాదని విదేశీ కన్సల్టెన్సీ నిర్వాహకులంటున్నారు. సైబర్ టెక్నాలజీ, ఐఓటీ, డేటాసైన్స్, ఏడబ్ల్యూఎస్ లాంటి టెక్నాలజీలపై పట్టున్న వాళ్లకు ఐటీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వారికి ఎక్కడైనా ఉద్యోగాలకు కొదవ లేదు. అందుకే అమెరికా విద్యాసంస్థలు ఈ కోర్సుల వైపు విద్యార్థులు వచ్చేలా చూస్తున్నాయి.
రకరకాలైన కారణాలవల్ల అమెరికా వెళ్లే ప్రయత్నాలకు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ఇమ్మిగ్రేషన్ మొదలు బ్యాంకు రుణాల వరకు వివిధ దశల్లో అనేకమంది ఆశావహులు అమెరికా వెళ్లలేకపోతున్నారు. దరఖాస్తు దశలో యూనివర్సిటీ ఎంపిక నుంచి ప్రతి అడుగులోనూ చాలా స్పష్టత కనబరిస్తే తప్ప అమెరికాలో అడుగుపెట్టలేం. మారుతున్న పరిస్థితులు, ఎదురవుతున్న పోటీని దాటుకుంటూ ముందుకు సాగితేనే గమ్యం చేరుకోగలరంటున్నారు విద్యానిపుణులు.
కొన్ని సంవత్సరాల నుంచి కంప్యూటర్ సైన్సు కోర్సులు చదివేందుకే ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఐటీ రంగ అనిశ్చితి కారణంగా ప్రత్యామ్నాయ కోర్సుల వైపు చాలా మంది దృష్టి సారిస్తున్నారు. ఇదే సమయంలో వీసా ఇంటర్వ్యూలు, సరైన ప్రతిభ పత్రాలు లేనికారణంగా విద్యార్థుల విదేశీ ప్రయాణం మరికొంత కాలం నిరీక్షించాల్సి వస్తోందంటున్నారు నిపుణులు. చాలా మంది ఇంటర్వ్యూల్లో విఫలమవుతున్నారని తెలిపారు.
కోర్సు ఎంపికలో అప్రమత్తం : విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు ఆయా కోర్సులు, విశ్వవిద్యాలయాల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి. పెరుగుతున్న విద్యా ద్రవ్యోల్బణం దృష్ట్యా విదేశాల్లో చదువుకోవడం కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారమే. ఇది తట్టుకోవాలంటే బ్యాంకులతో పాటు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు అందించే విద్యారుణాలు అందిపుచ్చుకోవాలి. అలాగే ఏయే విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఎలాంటి స్కాలర్‌షిప్‌లు ఏ విధంగా అందిస్తోందనే విషయాలపైనా తగిన అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
భారతీయులకు అమెరికా గుడ్‌న్యూస్- ఆ వీసాదారులపై ఆంక్షల ఎత్తివేత!