Job Loss Finland Survey : జీవితంలో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు భారతీయులు సంసిద్ధతతో ఉన్నారా ? ఆకస్మికంగా జరగరానిది జరిగితే, ఉద్యోగం పోతే పరిస్థితేంటి ? అనే ఆసక్తికర అంశాలపై 'ఫిన్ సేఫ్ ఇండియా' సంస్థ నిర్వహించిన సర్వేలో కీలక అంశాలు వెలుగుచూశాయి. సర్వేలో భాగంగా వివిధ రంగాలకు చెందిన 4,289 మంది అభిప్రాయాలను సేకరించి విశ్లేషించారు. ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించిన విభాగంలో 'ఫిన్ సేఫ్ ఇండియా' సంస్థ సేవలను అందిస్తోంది.
67 శాతం మందికి దీర్ఘకాలిక జీవిత లక్ష్యాలు
ఈ సర్వేలో ఒక ఆశాజనక అంశం వెల్లడైంది. ఇందులో పాల్గొన్న 67 శాత మంది తాము దీర్ఘకాలిక జీవిత లక్ష్యాలను సాధించే అంశంపై ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. లక్ష్య సాధన గురించే వాళ్లు నిత్యం పరితపిస్తున్నారని సర్వేలో తేలింది. దీర్ఘకాలిక జీవిత లక్ష్యాల కేటగిరీలో రిటైర్మెంట్, పిల్లల చదువులు వంటివి వస్తాయి. 'భవిష్యత్తులో తమకు ఆర్థిక భద్రత ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. ఈక్రమంలో పొదుపు, పెట్టుబడులకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందనేది వాళ్లు గ్రహించారు' అని ఫిన్ సేఫ్ ఇండియా వ్యవస్థాపకుడు, సీఈవో మ్రిన్ అగర్వాల్ తెలిపారు.
అకస్మాత్తుగా ఉద్యోగం పోతే ఎలా ?
'ఒకవేళ అకస్మాత్తుగా ఉద్యోగం పోతే ఎలా ?' అని ఈ సర్వేలో పాల్గొన్న వారిని ప్రశ్నించగా 53 శాతం మంది ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. 'ఉద్యోగం పోతే ఇంటి ఖర్చులను ఎలా వెళ్లదీయాలనే ఆందోళన మమ్మల్ని వెంటాడుతుంది' అని వారు బదులిచ్చారు. ఉద్యోగం లేకపోతే తమ ఇంట్లోని పెద్ద వయస్కులకు (తల్లిదండ్రులు) సహాయం చేయలేమేమో అనే ఆందోళనను మరో 26 శాతం మంది వ్యక్తపరిచారు. 'ఓ వైపు పిల్లలు, మరోవైపు పెద్ద వయస్కులైన తల్లిదండ్రుల పోషణా భారం మాపై ఉంది. ఉద్యోగం పోతే ఆ బాధ్యతను నెరవేర్చడం కష్టమవుతుంది' అని చాలామంది సర్వేలో చెప్పుకొచ్చారు. 'ఉద్యోగం పోతే అప్పులను తిరిగి చెల్లించడం పెద్ద సవాల్‌గా మారుతుంది. మా దీర్ఘకాలిక జీవిత లక్ష్యాలను సాధించడం కష్టతరంగా మారుతుంది' అని సర్వేలో పాల్గొన్న 29 శాతం మంది ఆందోళన వెలిబుచ్చారు.
సర్వేలోని ఇతర కీలక అంశాలు
సర్వేలో పాల్గొన్న 55 శాతం మంది తమ ఆదాయంలో 20 శాతానికిపైగా పొదుపు చేస్తున్నట్లు చెప్పగా, ఇంకో 45 శాతం మంది తమ పొదుపులు ఆదాయంలో 20 శాతంలోపే ఉంటాయన్నారు. అప్పుల భారం వల్ల అస్సలు పొదుపులు చేయలేకపోతున్నామని 13 శాతం మంది తెలిపారు. తమ కుటుంబానికి వైద్యపరమైన అత్యవసర పరిస్థితి వస్తే ఖర్చులను భరించే స్థితిలో లేమని 77 శాతం మంది తెలిపారు. ఆస్పత్రి బిల్లులను చెల్లించేందుకు కంపెనీ కల్పించే ఆరోగ్య బీమానే నమ్ముకున్నామని చెప్పారు. తమ ఆదాయంలో వచ్చే మిగులును ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే దానిపై స్పష్టత లేదని 35 శాతం చెప్పారు.
'వ్యూహాత్మక ఫైనాన్షియల్ ప్లానింగ్ తప్పనిసరి'
దేశంలోని ఉద్యోగులు, కార్మికులకు ఆర్థిక అక్షరాస్యత అంతగా లేదని ఈ సర్వేలో గుర్తించారు. ఈ అంశంపై వారికి అవగాహన పెంచేందుకు కంపెనీలు/సంస్థలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని ఫిన్ సేఫ్ ఇండియా వ్యవస్థాపకుడు, సీఈవో మ్రిన్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. జనరేటివ్ ఏఐ, ఇతర అధునాతన సాంకేతికతల వల్ల ఎంతోమంది ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ తరుణంలో ఆకస్మిక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేలా వ్యూహాత్మకమైన ఫైనాన్షియల్ ప్లానింగ్‌ను ప్రతి ఒక్కరు చేసుకోవాలని అగర్వాల్ సూచించారు. ఆకస్మిక అవసరాలు, ఉద్యోగ సవాళ్లను ఎదుర్కొనేందుకు మానసిక సంసిద్ధత కూడా ఉండాలన్నారు.
'స్పెషల్ స్కిల్స్' ఉంటేనే జాబ్- అభ్యర్థుల ఎంపికలో కొత్త ట్రెండ్! - Special Skills For Job Aspirants
ఉద్యోగాన్వేషణలో తోడుగా - సరికొత్త AI టూల్స్ - ఎలా వాడాలంటే? - LinkedIn AI Tools