How To Make The Perfect Resume : ప్రస్తుత పోటీ ప్రపంచంలో అగ్రశ్రేణి కంపెనీల్లో ఉద్యోగం సాధించడమంటే ఆషామాషీ కాదు. కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. చాలా మంది అభ్యర్థులు ఇంటర్వ్యూల్లో విఫలమవుతుంటారు. ఎందుకంటే రెజ్యూమ్‌ను కూడా ఇంటర్వ్యూ చేసేవారు నిశితంగా పరిశీలిస్తారని చాలా మందికి తెలియదు. అంతకు ముందు ఉద్యోగం చేసి వేరే కంపెనీ మారే ఉద్యోగులకు కూడా రెజ్యూమ్ చాలా కీలకం అవుతుంది. అందుకే రెజ్యూమ్ క్రియేట్ చేసుకునేటప్పుడు చాలా మంది చేసే తప్పులను తెలియజేశారు అమెజాన్ మాజీ రిక్రూటర్ లిండ్సే ముస్టెన్. ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే అభ్యర్థులు, తాము పని చేసిన పాత కంపెనీల్లో సాధించిన విజయాలను రెజ్యూమ్‌లో నమోదు చేయట్లేదని ముస్టెన్ తెలిపారు. అలాగే రెజ్యూమ్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దట్లేదని చెప్పారు. దీనితో వారిపై రిక్రూటర్లకు సదాభిప్రాయం ఏర్పడడం లేదని స్పష్టం చేశారు. అందుకే ఉద్యోగం కోసం ప్రయత్నించే ప్రతి ఒక్కరూ, తాము గతంలో చేసిన ఉద్యోగంలో ఏం సాధించారు? ఎంత మేర రాణించారు? మొదలైన అంశాలను రెజ్యూమ్‌లో కచ్చితంగా పొందుపర్చాలని ఆయన స్పష్టం చేశారు.
2. రిక్రూటర్‌లు అభ్యర్థుల రెజ్యూమ్‌ను చూడటానికి కొన్ని సెకన్ల సమయం మాత్రమే కేటాయించగలుగుతారని ముస్టెన్ అన్నారు. ఎందుకంటే వారు ఒకేరోజు 15 - 25 మందిని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది. పైగా వారికి వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. వాటన్నింటినీ పరిశీలించడం అంత సులువు కాదు. అందుకే వారిని ఆకర్షించే విధంగా మీ రెజ్యూమ్‌ను రూపొందించుకోవాలి. ఇందుకోసం మీరు అంతకు ముందు చేసిన ఉద్యోగంలో సాధించిన విజయాలను రెజ్యూమ్‌లో పొందుపర్చాలి. అప్పుడే రిక్రూటర్ల దృష్టిలో మీరు పడతారు.
3. ఉద్యోగానికి దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు చాలా సాధారణ రెజ్యుమ్‌ను జత చేస్తుంటారు. అయితే, ఇలా సాదాసీదాగా రెజ్యూమ్ ఉంటే, సంస్థ యాజమాన్యం పట్టించుకోదేమోనని కొంతమంది తమ సృజనకు పని చెబుతారు. క్రియేటివ్‌గా రెజ్యుమ్ రూపొందించి మెయిల్ చేయడమో, నేరుగా ఇవ్వడమో చేస్తుంటారు. కానీ, యూకేకు చెందిన ఓ నిరుద్యోగి మరి కాస్త భిన్నంగా ఆలోచించి కంపెనీనే అవాక్కయ్యేలా రెజ్యుమ్ రూపొందించాడు. దీనితో ఆ కంపెనీ అతడి తెలివి తేటలకు మెచ్చుకొని 'నీలాంటోడే మాకు కావాలి' అంటూ వెంటనే అతడికి ఉద్యోగం ఇచ్చేసింది. ఇంతకూ అతను ఏమి చేశాడంటే?
యూకేకు చెందిన జోనథన్ స్విఫ్ట్ ఓ నిరుద్యోగి. యార్క్‌షైర్‌లో ఉన్న 'ఇన్‌స్టాంట్‌ప్రింట్' కంపెనీ ఉద్యోగ ప్రకటన చూసి దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే, అందరిలా తాను రెజ్యుమ్ పంపిస్తే యాజమాన్యం దృష్టిలో పడనేమోనని భావించిన స్విఫ్ట్, కొత్త పంథాను ఎంచుకున్నాడు. సదరు కంపెనీకి చెందిన కొన్ని కరపత్రాలను సేకరించి, వాటిపై తన వివరాలను ముద్రించాడు. వాటిని తీసుకెళ్లి నేరుగా ఆ కంపెనీ భవనం పార్కింగ్ స్థలంలో నిలిచి ఉన్న కార్లకు అంటించడం మొదలుపెట్టాడు. సీసీటీవీ ఫుటేజ్‌లో స్విఫ్ట్ చేస్తున్న తంతుని ఆ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ క్రెయిగ్ వాస్సెల్ గమనించి ఆరా తీశారు. స్విఫ్ట్ క్రియేటివిటీ గురించి తెలుసుకుని, వెంటనే అతడిని ఇంటర్వ్యూకి పిలిపించి, ఉద్యోగానికి ఎంపిక చేశారు. 'మేం ఉద్యోగ ప్రకటన ఇచ్చింది కూడా ఇలాంటి సృజనాత్మక ఆలోచన ఉన్న వారి కోసమే. అందుకే, ఇంకేం ఆలోచించకుండా అతడికి ఉద్యోగం ఇచ్చాం. ఇలాంటి క్రియేటివ్ దరఖాస్తులు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది' అని క్రెయిగ్ చెప్పుకొచ్చారు. జొనాథన్ కార్లకు తన రెజ్యుమ్‌ను అంటిస్తున్నప్పుడు రికార్డయిన సీసీటీవీ ఫుటేజీని సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఆ కంపెనీలో అతడికి ఉద్యోగంతోపాటు పాపులారిటీ కూడా లభించింది.
చూశారుగా, నేటి పోటీ ప్రపంచంలో మీకంటూ ఒక మంచి ఉద్యోగం లభించాలంటే, కచ్చితంగా సృజనాత్మకంగా ఆలోచించాలి. సరైన రెజ్యూమ్‌ను రూపొందించుకోవాలి. ఆల్ ది బెస్ట్!
పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా? ఈ 10 టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ! - Exam Preparation Tips
ఇంటర్వ్యూకు సిద్ధం అవుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ! - How To Success In Interview