How To Improve Your Critical Thinking : నేటి పోటీ ప్రపంచంలో మంచి ఉద్యోగం రావాలంటే 'క్రిటికల్ థింకింగ్' కచ్చితంగా ఉండాలి. ఈ నైపుణ్యం కలిగి, ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలతో, నిత్య నూతనంగా ఉండే అభ్యర్థులకు ప్రముఖ కంపెనీలు ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానిస్తున్నాయి. అందుకే ఈ క్రిటికల్ థింకింగ్ అంటే ఏమిటి? ఈ నైపుణ్యం ఉన్నవారు ఎలా ఆలోచిస్తుంటారు? దీన్ని మనం ఎలా అలవర్చుకొని రాణించాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిటికల్ థింకింగ్ అంటే ఏమిటి?
మన వద్ద ఉన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకొని, ఏదైనా అంశాన్ని లేదా సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, దానికి సరైన పరిష్కారం కనుగొనడాన్నే క్రిటికల్ థింకింగ్ అంటారు. ఇందులో మీరు ఆబ్జెక్టివ్‌గా ఆలోచించడం చాలా ముఖ్యం. అంటే సమస్యను భావోద్వేగాలతో (ఎమోషనల్‌గా) కాకుండా, చాలా తార్కికంగా ఆలోచించి, పరిష్కార మార్గం కనిపెట్టాలి. అంటే మీరొక ట్రబుల్ షూటర్‌గా ఉండాలి. కంపెనీల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేసేవారందరికీ ఈ నైపుణ్యం ఉండి తీరాల్సిందే.
క్రిటికల్ థింకింగ్ Vs క్రియేటివ్ థింకింగ్
క్రిటికల్ థింకింగ్‌కు క్రియేటివ్ థింకింగ్‌కు చాలా తేడా ఉంది. సృజనాత్మకతలో ఏదైనా కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడం లేదా కొత్తగా ఆలోచించి దేన్నైనా సృష్టించడాన్ని క్రియేటివ్ థింకింగ్ అంటారు. కానీ క్రిటికల్ థింకింగ్ చాలా భిన్నంగా ఉంటుంది. మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఎంత సమర్థవంతంగా అర్థం చేసుకున్నారు? దాన్నుంచి సమస్యకు తగిన పరిష్కారాన్ని ఏ విధంగా కనుగొన్నారు? అనేది క్రిటికల్ థింకింగ్ కిందకు వస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, క్రిటికల్ థింకింగ్‌కు పరిశీలన, విశ్లేషణ, వివరణ, గణన, సమస్య పరిష్కారం, నిర్ణయం తీసుకునే సామర్థ్యం మొదలైనవి చాలా అవసరం. ఇందుకోసం మీరు చాలా సాధన చేయాల్సి ఉంటుంది.
క్రిటికల్ థింకింగ్ ఉన్నవాళ్ల ఎలా ఆలోచిస్తారు?
- వివిధ అంశాలకు, రకారకాల ఆలోచనలకు మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుంటారు.
- వాదన - ప్రతివాదనలకు తగినంత విలువ ఇస్తారు.
- సమస్యకు సరైన పరిష్కారాన్ని గుర్తించి, దాన్ని ఆచరణీయంగా మలుస్తారు.
- రీజనింగ్‌లో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సులువుగా గుర్తిస్తారు.
- సమస్యల పరిష్కారానికి ఒక క్రమపద్ధతిని పాటిస్తారు.
- ఆలోచనలకు, నమ్మకాలకు, వాస్తవాలకు మధ్య ఉన్న తేడాను గుర్తిస్తారు.
క్రిటికల్ థింకింగ్ నైపుణ్యాన్ని పెంచుకోవడం ఎలా?
- మీకు కనిపించేదంతా నిజమని నమ్మేయకూడదు. ఒక విషయాన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించాలి. ఏ సమస్య వచ్చినా దానికి గల కారణాలు, రుజువులు, పరిష్కార మార్గాల గురించి ఆలోచించాలి. ఇవన్నీ చేయడానికి తగిన విధంగా సాధన చేయాలి.
- మనల్ని మనం మోసం చేసుకోకూడదు. మనం నమ్మినది నిజం కాదని తెలిసినప్పుడు, ఆ విషయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించగలగాలి. ఆత్మ ద్రోహం చేసుకోకూడదు. సొంత అభిప్రాయాలు, ఆలోచనలను పక్కన పెట్టి, పూర్తిగా లాజికల్‌గా థింక్ చేయడం నేర్చుకోవాలి.
- మీకు సందేహం ఉన్న ప్రతి అంశం గురించి ప్రశ్నిస్తూ ఉండాలి. ఎందుకంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి తొలి మెట్టు ప్రశ్నించడమే. ప్రశ్నకు తగిన సమాధానం లేదా పరిష్కారం లభించే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి.
- తగినంత సమాచారం మన దగ్గర ఉంటేనే సరైన నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది. అందుకే ఏ అంశం పైనైనా పూర్తి స్థాయిలో పరిశోధన చేయాలి. అలాగే మీ పనిని ఎప్పటికప్పుడు మీరే పరిశీలించుకుని, తగిన మార్పులు, చేర్పులు చేసుకుంటా ఉండాలి.
- క్రిటికల్ థింకింగ్ గురించి నేర్చుకోవడానికి నేడు ఆన్లైన్లో చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా లాజిక్, క్రిటికల్ థింకింగ్, మైండ్‌వేర్ లాంటి పలు అంశాలపై పట్టుసాధించాలి. అప్పుడే మీరు కోరుకున్న ఉన్నత ఉద్యోగం మీకు లభిస్తుంది.
పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా? ఇలా చదివితే ఉద్యోగం గ్యారెంటీ! - Smart Study Tips
ఫ్రీలాన్సర్‌గా పని చేయాలా? ఈ టాప్-10 వెబ్‌సైట్స్‌పై ఓ లుక్కేయండి! - Best Freelancing Sites