Best Job Skills : నేటి జాబ్ మార్కెట్లో కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్), మెషీన్ లెర్నింగ్, కోడింగ్‌ల హవా నడుస్తోంది. వీటిలో మంచి నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ఈ ఉద్యోగాలకు కూడా ఏఐ నుంచి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ ఓ స్కిల్‌ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏఐ రీప్లేస్ చేయలేదని అమెరికాకు చెందిన మార్కెటింగ్ ప్రొఫెసర్ స్కాట్ గాల్లోవే చెబుతున్నారు. అదే 'స్టోరీ టెల్లింగ్'.
స్టోరీ టెల్లింగ్ స్కిల్
Story Telling Skill : న్యూయార్క్‌లోని ఓ యూనివర్సిటీలో మార్కెటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న స్కాట్ గాల్లోవే సొంతంగా ఓ కంపెనీని స్థాపించి దానిని విజయవంతంగా నడిపారు. తరువాత దానిని 130 మిలియన్ డాలర్లకు విక్రయించి భారీ లాభాలు ఆర్జించారు. ఆయన నేటి తరం యువతీ యువకుల కోసం కొన్ని కీలక విషయాలు తెలిపారు. ఉద్యోగం కోసం ప్రయత్నించే అభ్యర్థులకు 'స్టోరీ టెల్లింగ్' నైపుణ్యం చాలా కీలకమని స్పష్టం చేశారు. ఇది తన అనుభవంతో తెలుసుకున్నట్లు ఆయన చెప్పారు. పూర్తిగా టెక్నాలజీపైనే ఆధారపడుతున్న ఈ రోజుల్లోనూ, మన మనస్సులో ఉన్నది అత్యంత ప్రభావవంతంగా చెప్పగలగడం చాలా కీలకమని తెలిపారు. తగిన సమాచారం, చిత్రాలు, ఇన్ఫోగ్రాఫిక్స్‌తో మన ఆలోచనలను వ్యక్తపర్చడం, ఇతరులకు వాటిపై అవగాహన కల్పించడం చాలా అవసరమని అన్నారు. 'వాస్తవం ఏమిటంటే, కమ్యూనికేషన్ మాధ్యమాలు మారవచ్చు. కానీ చెప్పే విధానానికి మాత్రం ఎప్పుడూ ప్రాధాన్యం తగ్గదు' అని ఆయన అన్నారు. అందుకే ఈ స్టోరీ టెల్లింగ్ అనేది ఎప్పటికీ కాలం చెల్లని ప్రత్యేకమైన నైపుణ్యమని వివరించారు.
అతిగా టెక్నాలజీపై ఆధారపడవద్దు!
నేటి యువత చాట్‌జీపీటీ లాంటి ఏఐ టూల్స్‌పై అతిగా ఆధారపడుతున్నారు. కానీ ఇది ప్రయోజనకరమైన అలవాటు కాదని స్కాట్ హెచ్చరిస్తున్నారు. ఏఐ, కోడింగ్ అవసరమైనప్పటికీ, స్టోరీ టెల్లింగ్ లాంటి విలువైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని స్పష్టం చేశారు. ఒక బ్రాండ్ ప్రతిష్ఠను పెంచడం లేదా తగ్గించడం అనేది స్టోరీ టెల్లింగ్పైనే ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో చాట్‌జీపీటీ లాంటి అత్యాధునిక టెక్నాలజీలు సైతం కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదని స్కాట్ అభిప్రాయపడ్డారు. న్యూరల్ నెట్‌వర్క్ వంటి సరికొత్త టెక్నాలజీలు తెరపైకి రావచ్చని, అప్పుడు కోడింగ్‌కు పూర్తిగా ప్రాధాన్యం తగ్గిపోతుందని ఆయన అన్నారు. కానీ స్టోరీ టెల్లింగ్‌కు ఎప్పుడూ కాలం చెల్లదని, ఈ కీలక నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని స్కాట్ సూచించారు.
సక్సెస్ మంత్ర!
మీరు ఎంచుకున్న రంగంలో మంచి నైపుణ్యం సాధించడమే విజయానికి మూల సూత్రమని స్కాట్ వివరించారు. ఎన్ని నూతన సాంకేతికలు వచ్చినా, చేసే పనిపై పట్టు సాధించడమే విజయానికి నమ్మకమైన దారి అని ఆయన తెలిపారు. ‘'మీకు నచ్చిన ఒక రంగాన్ని ఎంచుకోవాలి. అది ఎంత చిన్నదైనా ఫర్వాలేదు. కానీ గట్టిగా ప్రయత్నించాలి. దానిపై పట్టు సాధించాలి. ఆ డొమైన్‌లో వీలైనంత ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ జాబ్‌ను ఎంజాయ్ చేయాలి. లేదంటే నైపుణ్యం సాధించడం చాలా కష్టమవుతుంది' అని స్కాట్ వివరించారు.
న్యూ జాబ్ ట్రెండ్ - ' ప్రమోషన్ ఇస్తారు - కష్టపడి పని చేయ్ - ఫలితం ఆశించకు!' - Dry Promotion