Zomato Gets IT Notice : ప్రముఖ పుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు ఆదాయ పన్ను శాఖ ట్యాక్స్ డిమాండ్ నోటీసు జారీ చేసింది. సర్వీస్ ట్యాక్స్, పెనాల్టీలు కలిపి ఏకంగా రూ.184 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. అయితే దీనిపై తాము అప్పీల్‌కు వెళతామని జొమాటో తెలిపింది. సోమవారం అర్ధరాత్రి సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.
సర్వీస్ ట్యాక్స్ బకాయి
దిల్లీ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ ఏప్రిల్ 1న జొమాటోకు ట్యాక్స్ డిమాండ్ నోటీసు పంపించారు. దీని ప్రకారం, జొమాటో విదేశీ అనుబంధ సంస్థలు, దేశం వెలుపల ఉన్న శాఖల్లో 2014 అక్టోబర్ నుంచి 2017 జూన్ మధ్య జరిగిన విక్రయాలపై సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదు. అయితే దీనిపై తాము అప్పీల్‌కు వెళతామని జొమాటో వెల్లడించింది. ఇది వరకే పంపించిన ఐటీ శాఖ షోకాజ్ నోటీసుకు తాము ఆధారాలతో సహా వివరణ ఇచ్చామని తెలిపింది. కానీ తాజా ఉత్తర్వులు ఇచ్చే ముందు, సంబంధిత అధికారులు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని జొమాటో పేర్కొంది.
అసలు+వడ్డీ+పెనాల్టీ
వడ్డీతో కలిపి సర్వీస్ ట్యాక్స్ కింద రూ.92,09,90,306 (రూ.92 కోట్లు); అంతే మొత్తంలో (రూ.92 కోట్లు) పెనాల్టీ కలిపి మొత్తం రూ.184 కోట్లకు డిమాండ్ నోటీసు అందుకున్నట్లు జొమాటో పేర్కొంది. దీనిపై సంబంధిత అథారిటీ ముందు అప్పీల్‌కు వెళతామని తెలిపింది. అయితే దీనివల్ల కంపెనీ ఆర్థిక పరిస్థితిపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చని అభిప్రాయపడింది. రెండ్రోజుల క్రితం కూడా ఇలానే కర్ణాటక అసిస్టెంట్ కమిషన్ కార్యాలయం నుంచి జొమాటోకు రూ.23 కోట్లకు పన్ను డిమాండ్ నోటీసు వచ్చింది. దీన్ని కూడా సవాల్ చేస్తామని జొమాటో ఇదివరకే వెల్లడించింది.
జొమాటో ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’
జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ జోషి ఇటీవలే శాకాహారుల కోసం ప్రత్యేకంగా 'ప్యూర్ వెజ్ ఫ్లీట్' పేరుతో ప్రత్యేక సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని వల్ల కస్టమర్లు శాకాహారం మాత్రమే అందించే రెస్టారెంట్‌లను ఎంపిక చేసుకునే సౌకర్యం కలుగుతుంది. అంతేకాదు నాన్-వెజ్ వండే హోటల్స్‌ను పూర్తిగా మినహాయించే అవకాశం కూడా యూజర్లకు కల్పిస్తారు. అయితే ఇందుకోసం మొదటిగా ఆకుపచ్చ డెలివరీ బాక్స్‌లను ఉపయోగించాలని జొమాటో భావించింది. కానీ చివరికి ఎర్ర బాక్స్‌ల్లోనే ఫుడ్ ఆర్డర్స్ అందించాలని నిర్ణయించుకుంది.
మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అవుతోందా? వెంటనే రిపోర్ట్ చేయండిలా! - How To Check PAN Card Fraud
SIP చేస్తున్నారా? 7-5-3-1 నియమం పాటిస్తే భారీ లాభాలు గ్యారెంటీ! - Mutual Fund Investment Tips