World Super Rich Club : ప్రపంచంలో 100 బిలియన్ డాలర్లకు పైగా సంపద కలిగిన వారిని సూపర్ రిచ్ అంటారు. ఇలాంటి ‘సూపర్-రిచ్’ క్లబ్‌లోని సభ్యల సంఖ్య 15కు చేరింది. ఈ జాబితాలోకి ఇంత మంది చేరడం ఇదే మొదటిసారి. వీరిలో భారత కుబేరులు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు కూడా ఉన్నారు.
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం, ‘సూపర్-రిచ్’ జాబితాలోని 15 మంది సంపద ఈ ఏడాది ఏకంగా 13% పెరిగి 2.2 ట్రిలియన్ డాలర్లకు చేరింది. కృత్రిమ మేధ, విలాస వస్తువులకు గిరాకీ పెరగడం, భౌగోళిక రాజకీయాల్లో మార్పులు, ద్రవ్యోల్బణం మొదలైన కారణాల వల్ల వీరి సంపద భారీగా వృద్ధి చెందింది. ప్రపంచంలోని తొలి 500 మంది ధనవంతుల సంపదలో, పావు వంతు కేవలం ఈ 15 మంది వద్దే ఉండడం విశేషం.
100 బిలియన్ డాలర్ల సంపద
ఈ సూపర్ రిచ్ క్లబ్లో ఉన్నవారి సంపద గతంలోనే 100 బిలియన్ డాలర్లు దాటింది. అయితే, వీరంతా ఒకేసారి 100 బిలియన్ డాలర్ల థ్రెషోల్డ్‌కు ఎగువన నిలవడం మాత్రం ఇదే మొదటిసారి. లోరియల్ ఎస్‌ఏ వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్, డెల్ టెక్ వ్యవస్థాపకుడు మైకేల్ డెల్, మెక్సికన్ బిలియనీర్ కార్లోస్ స్లిమ్ మొదలైనవారు, కేవలం గత 5 నెలల కాలంలోనే ఏకంగా 100 బిలియన్ డాలర్ల మైలురాయిని అందుకున్నారు. గతంలో ఈ జాబితా నుంచి తొలగించబడిన గౌతమ్ అదానీ, తిరిగి తన స్థానాన్ని చేరుకోగలిగారు. వాస్తవానికి హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం గౌతమ్ అదానీ సంపద భారీగా తగ్గింది. కానీ తరువాత చేపట్టిన దిద్దుబాటు చర్యల కారణంగా, అదానీ కంపెనీల షేర్లు భారీగా పుంజుకున్నాయి. అదే సమయంలో భారత్‌లోకి విదేశీ పెట్టుబడులు పెరగడం కూడా ఆయనకు బాగా కలిసొచ్చింది.
తొలి సూపర్ రిచ్ మహిళ ఎవరంటే?
100 బిలియన్ డాలర్ల మైలురాయిని అందుకున్న తొలి మహిళగా ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ రికార్డ్ సృష్టించారు. సౌందర్య ఉత్పత్తుల కంపెనీ అయిన లోరియల్ షేర్లు రాణించడమే ఇందుకు కారణం. గ్లోబల్ సూపర్ రిచ్ క్లబ్లో 101 బిలియన్ డాలర్లతో ఆమె 14వ స్థానంలో ఉన్నారు. ఏఐ ఆధారిత పరికరాలకు డిమాండ్ పెరగడం వల్ల మైకేల్ డెల్ సంపద 113 బి.డాలర్లు దాటింది. దీనితో ఆయన ఈ జాబితాలో 11వ స్థానంలో నిలిచారు. లాటిన్ అమెరికాలోనే అత్యంత ధనవంతుడైన కార్లోస్ స్లిమ్ సంపద 2023లో ఏకంగా 28 బిలియన్ డాలర్లు మేర పెరిగింది. దీనితో ఆయన 106 బిలియన్ డాలర్లతో 13వ స్థానంలో నిలిచారు.
నంబర్-1 ఎవరంటే?
ఎల్‌వీఎంహెచ్ వ్యవస్థాపకుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ 222 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 208 బి.డాలర్లు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 187 బి.డాలర్లుతో 2, 3 స్థానాల్లో కొనసాగుతున్నారు. టెస్లా షేర్ల పతనం కారణంగా ఎలాన్ మస్క్ సంపద ఈ ఏడాది ఏకంగా 40 బిలియన్ డాలర్లు కుంగడం గమనార్హం.
ముకేశ్ అంబానీ సంపాదన గంటకు రూ.90 కోట్లు - మరి మనకెంత టైమ్ పడుతుంది? - Mukesh Ambani One Hour Income
కొత్తగా ఉద్యోగంలో చేరారా? ఈ 6 హక్కుల గురించి తెలుసుకోవడం మస్ట్! - Employee Basic Rights