Will Govt Reduce Import Tax On Gold Bars In Budget : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో భారత్‌లో బంగారం దిగుమతులపై విధిస్తున్న 12.5 శాతం పన్నును 4 శాతానికి తగ్గించాలని గోల్డ్ ట్రేడర్స్ కోరుతున్నారు. దీనివల్ల బంగారం స్మగ్లింగ్ తగ్గుతుందని, చట్టబద్ధంగా జరిగే పసిడి వ్యాపారం మెరుగుపడుతుందని వారు చెబుతున్నారు.
ప్రస్తుతం భారతదేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర సుమారుగా రూ.63,000 వరకు ఉంది. ఇతర దేశాలతో పోల్చితే ఈ ధర చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు. పసిడి ధర ఇంత ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఏమిటంటే, భారతదేశంలో బంగారంపై 12.5 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నారు. దీనికి అదనంగా 3 శాతం జీఎస్టీ, 2.5 శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ సెస్ విధిస్తున్నారు. అంటే బంగారంపై మొత్తంగా 18 శాతం వరకు పన్ను వసూలు చేస్తున్నారు. ఈ పన్నుల భారం తగ్గించుకోవడానికి చాలా మంది అక్రమ మార్గాల్లో బంగారాన్ని దేశంలోకి తరలిస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే స్మగ్లింగ్ చేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం, ఏటా దేశంలోకి 100 నుంచి 120 టన్నుల బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తెస్తున్నారు. దీని వల్ల బంగారం రిటైల్ అమ్మకాలు భారీగా దెబ్బతింటున్నాయి.
పన్నులు తగ్గించాల్సిందే!
త్వరలో పెళ్లిళ్ల సీజన్ మొదలుకానుంది. కనుక బంగారానికి విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. ఇలాంటి తరుణంలో గోల్డ్ స్మగ్లింగ్‌ను అరికట్టకపోతే, దేశంలో బంగారం ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రస్తుతం బంగారం దిగుమతులపై విధిస్తున్న 12.5 శాతం సుంకాన్ని ఏకంగా 4 శాతానికి తగ్గించాలని గోల్డ్ ట్రేడర్స్ కోరుతున్నారు.
"బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ వేయడం, జీఎస్టీ విధించడం లాంటి సంస్కరణల వల్ల, దేశంలో వ్యవస్థీకృత బంగారు ఆభరణాల వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ రిటైల్ వ్యాపారం మరింతగా అభివృద్ది చెందాలంటే, బంగారం దిగుమతులపై విధిస్తున్న సుంకాలను బాగా తగ్గించాల్సి ఉంటుంది. లేకుంటే ఇది పరోక్షంగా బంగారం అక్రమ రవాణాకు, గ్రేమార్కెట్ లావాదేవీలు పెరగడానికి కారణమవుతుంది."
- ఎం.పీ. అహ్మద్, మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఛైర్మన్
పారదర్శకత పెరగాలి!
'ప్రభుత్వం దేశంలో అక్రమ పద్ధతుల్లో జరుగుతున్న వ్యాపారాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. లెక్కల్లోకి రాని పసిడి వ్యాపారాన్ని నియంత్రించాలి. దీనికోసం సమర్థవంతమైన పన్ను విధానాలను బడ్జెట్లో ప్రతిపాదించాలి. తద్వారా బంగారం వ్యాపారంలో పారదర్శక విధానాలను తీసుకురావాలి. అలాగే వ్యవస్థీకృత బంగారు ఆభరణాల వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తగిన విధివిధానాలను బడ్జెట్లో ప్రవేశపెట్టాలి' అని ఎం.పీ. అహ్మద్ అభిప్రాయపడ్డారు.
మౌలిక వసతుల కల్పన
'కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాల తయారీకి కావాల్సిన మౌలిక వసతులు, ముడిపదార్థాలు చాలా తక్కువ ధరకే లభించేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం అంతర్జాతీయ బంగారు సరఫరాదారులు, మన దేశంలోని ఆభరణాల తయారీదారులకు సరసమైన ధరలకే ముడిపదార్థాలు అందించడానికి కావాల్సిన అనుమతులు మంజూరు చేయాలి. ముఖ్యంగా గోల్డ్ లోన్స్ కల్పించాలి. దీని ద్వారా దేశంలో పోటీతత్వం పెరిగి గోల్డ్ బిజినెస్ బాగా అభివృద్ధి చెందుతుంది.' అని ఎం.పీ అహ్మద్ పేర్కొన్నారు.
నైపుణ్యాభివృద్ధి
"మన దేశంలో ఉన్న హస్తకాళాకారులకు ప్రపంచస్థాయి ఉత్పత్తులు తయారుచేసే సామర్థ్యం ఉంది. అయితే అందుకు కావాల్సిన నైపుణ్యాలను అప్పటికప్పుడు మనం అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. దీనికోసం కూడా బడ్జెట్లో తగు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యంత్రాలపై సుంకాలు తగ్గించాలి. అంతేకాదు ఈ యంత్రాల దిగుమతికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇవ్వాలి. రాయితీలు కల్పించాలి. అలాగే అంతర్జాతీయ మార్కెట్ల డిమాండ్‌కు అనుగుణంగా భారతీయ ఉత్పత్తులు తయారు చేసేందుకు తగిన ప్రోత్సాహకాలు కల్పించాలి."
- సువంకర్ సేన్, సెన్కో గోల్డ్ & డైమండ్స్ మేనేజింగ్ డైరెక్టర్
ఆర్థిక సాయం తప్పనిసరి
'విదేశాల్లోనూ భారతీయ కంపెనీలు, బ్రాండ్లు విస్తరించడానికి మన ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. ముఖ్యంగా మేడిన్ ఇండియా బ్రాండ్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు తగిన చర్యలను తీసుకోవాలి. దీని కోసం బడ్జెట్లో తగు ప్రాధాన్యం కల్పించాలి' అని సువంకర్ సేన్ అభిప్రాయపడ్డారు.
భారత్ - నంబర్ వన్
'ప్రపంచంలో పెద్దఎత్తున బంగారు ఆభరణాలు, రత్నాలు ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. భారతదేశానికి పెద్ద ఎత్తున విదేశీ మారక నిల్వలు సంపాదించిపెట్టే ప్రధానమైన ఎగుమతులు కూడా ఇవే. అందువల్ల బడ్జెట్లో బంగారు ఆభరణాల తయారీదారులకు తగినంత మూలధనం లేదా కాపెక్స్ అందించాలి. దీనితో వాళ్లు ప్రపంచస్థాయి ఉత్పత్తులను తయారుచేస్తారు. ఫలితంగా మన ఎగుమతులు మరింతగా పెరుగుతాయి. దేశానికి కూడా గొప్ప ఆర్థిక లాభం చేకూరుతుంది.' అని సువంకర్ సేన్ సూచించారు.
సాంకేతిక సహకారం
'ప్రపంచ దేశాల్లో ఉన్న మన భారతీయులకు మాత్రమే కాకుండా, విదేశీయులకు కావాల్సిన ఆభరణాలు కూడా తయారు చేసే సామర్థ్యం భారతీయ కంపెనీలకు/ బ్రాండ్లకు ఉంది. అయితే దీనికి కావాల్సిన ఏఐ లాంటి నూతన సాంకేతికతలను, యంత్రాలను బంగారం పరిశ్రమ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. వీటికి కూడా బడ్జెట్లో తగు ప్రధాన్యం కల్పించాలి. అలాగే ఆభరణాల పరిశ్రమలో లిక్విడిటీని పెంచాలి. బ్యాంకులు మార్జిన్ మనీని విడుదల చేయాలి. ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని తగ్గించాలి. అప్పుడే భారత బంగారు పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందుతుంది' అని సువంకర్ సేన్ అభిప్రాయపడ్డారు.
ఈ టాప్-5 క్రెడిట్ కార్డ్స్‌తో - ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, క్లబ్ మెంబర్షిప్ ఫ్రీ!