What To Do If Your Employer Refuses To Pay Gratuity : ఉద్యోగులకు గ్రాట్యుటీ అమౌంట్ అనేది చాలా ముఖ్యమైనది. అయితే చాలా కంపెనీలు ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఏ విధంగా తమకు రావాల్సిన గ్రాట్యుటీని పొందాలో, ఇక్కడ తెలిపిన ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం.
ప్రశ్న: నాకు 64 ఏళ్లు. పదవీ విరమణ చేశాను. ఒక ప్రైవేట్ కంపెనీలో 2000-10 వరకు పనిచేశాను. మళ్లీ 2012-22 మధ్య కాలంలో రెండోసారి కూడా అక్కడే పనిచేశాను. తరువాత పదవీ విరమణ చేశాను. అయితే కంపెనీ నాకు రెండవ పదవీకాలానికి సంబంధించిన గ్రాట్యుటీని మాత్రమే చెల్లించింది. కానీ 2000-10 మొదటి పదవీకాలానికి సంబంధించిన గ్రాట్యుటీ ఇవ్వలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో గ్రాట్యుటీని పొందడానికి నేను ఏం చేయాలి?
జవాబు : గ్రాట్యుటీ చెల్లింపు చట్టం, 1972 ప్రకారం, కంపెనీ లేదా యజమాని తమ దగ్గర 5 ఏళ్లు నిర్విరామంగా పనిచేసిన ఉద్యోగికి కచ్చితంగా గ్రాట్యుటీ చెల్లించాలి. అంటే గ్రాట్యుటీ అనేది ఉద్యోగి చట్టబద్ధమైన హక్కు. సెక్షన్ 4(6) ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగికి అటువంటి చట్టబద్ధమైన హక్కును నిలిపేయడం కుదరదు. 1972 చట్టం సెక్షన్ 4 ప్రకారం, ఉద్యోగి సదరు సంస్థ నుంచి 2000-10 కాలానికి, అలాగే 2012-2022 మధ్య కాలానికి కూడా గ్రాట్యుటీని పొందేందుకు అర్హుడు.
దీనిని మరింత సింపుల్గా చెప్పాలంటే, ఉద్యోగి 2000-2010 వరకు అంటే ఐదేళ్లకు పైబడి నిరంతరంగా సేవలు అందించారు. అందువల్ల 2000-2010 కాలానికి గ్రాట్యుటీని పొందేందుకు అతను అర్హుడు. 2012-2022 మధ్యకాలంలో అతను మళ్లీ సదరు సంస్థలో పనిచేశాడు. చట్టం ప్రకారం, అతను మళ్లీ తాజాగా ఉద్యోగం ప్రారంభించినట్లు లెక్క. కనుక చట్టం ప్రకారం ఈ ఐదు సంవత్సరాలకు కూడా అతను గ్రాట్యుటీ స్వీకరించడానికి అర్హుడు.
నోటీస్ ఇవ్వండిలా!
ఉద్యోగికి 2000-10 కాలానికి గ్రాట్యుటీ చెల్లించలేదు కనుక వెంటనే అతను కంపెనీకి నోటీస్ పంపించాలి. అక్టోబరు 1, 1987 నాటి సెక్షన్ 7(3-A) ప్రకారం 10 శాతం వడ్డీతో సహా గ్రాట్యుటీ చెల్లించాలని స్పష్టం చేస్తూ, సంబంధిత పత్రాలను జత చేసి లీగల్ నోటీసును పంపాలి. అప్పటికూడా యజమాని గ్రాట్యుటీ చెల్లించకపోతే, గ్రాట్యుటీ రికవరీ కోసం సెక్షన్ 8 కింద కేస్ ఫైల్ చేయవచ్చు. ఇందుకోసం సంబంధిత కంట్రోలింగ్ అథారిటీకి ఫిర్యాదు చేయాలి. లేబర్ కమిషనర్ లేదా కంట్రోలింగ్ అథారిటీ మీరు చేసిన ఫిర్యాదుతో సంతృప్తి చెందితే యజమాని నుంచి గ్రాట్యూటీ మొత్తాన్ని రికవరీ చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు ఇస్తుంది. ఈ విధంగా ఉద్యోగులు తమకు రావాల్సిన గ్రాట్యుటీని పొందవచ్చు.
ఎన్పీఎస్ Vs పీపీఎఫ్ - ఏది బెస్ట్ రిటైర్మెంట్ ప్లాన్? - NPS Vs PPF