What Is Temporary Car Insurance : భారతదేశంలో కారు కొనాలని అనుకుంటే ఇన్సూరెన్స్ చేయడం తప్పనిసరి. ప్రమాదం, దొంగతనం, లేదా ఇతర రూపాల్లో వాహనానికి నష్టం జరిగినప్పుడు ఈ బీమా పాలసీ మీకు ఆర్థిక రక్షణను కల్పిస్తుంది. నగదు ఖర్చును తగ్గిస్తుంది. అయితే చాలా మంది వార్షిక ఇన్సూరెన్స్ తీసుకుంటేనే ఆర్థిక రక్షణ ఉంటుందని అనుకుంటారు. అయితే 'తాత్కాలిక కారు ఇన్సూరెన్స్'ను తీసుకున్నా కూడా బీమా కవరేజీని పొందొచ్చు. తక్కువ ప్రీమియంతో వార్షిక బీమా కవరేజీకి లభించే ప్రయోజనాలు అన్నీ దీని ద్వారా పొందవచ్చు. అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సమగ్ర కారు ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏటా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కారు యజమాని ఆర్థిక భద్రత కోసం 'తాత్కాలిక లేదా స్వల్పకాలిక ఇన్సూరెన్స్'ను కూడా తీసుకోవచ్చు. అనేక బీమా కంపెనీలు కేవలం ఒక రోజుకు కూడా బీమా పాలసీలను అందిస్తుంటాయి.
ఇంతకీ తాత్కాలిక కార్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
పేరులో ఉన్నట్టుగానే ఐదొక తాత్కాలిక కారు బీమా. ఈ తాత్కాలిక కారు బీమా పాలసీదారుడికి స్వల్పకాలిక కవరేజీని అందిస్తుంది. ఈ బీమాను నిమిషాలు, ఒక రోజు, కొన్ని రోజులు, నెలల వ్యవధికి తీసుకోవచ్చు. మీకు కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అవసరం లేకపోతే, అప్పుడు ఈ తాత్కాలిక బీమా పాలసీని ఎంచుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. వాస్తవానికి భారతదేశంలో 'స్వల్పకాలిక బీమా' అంత పాపులర్ కాదు. కానీ విదేశాల్లో ఈ బీమా చాలా ప్రజాదరణ పొందింది.
టెంపరరీ కార్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు
Temporary Car Insurance Benefits : భారతదేశంలో బీమా కంపెనీలు సాధారణంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను అందిస్తాయి. ఈ బీమా కవరేజీ ఒక సంవత్సరం వరకు ఉంటుంది. అయితే తాత్కాలిక వాహన బీమా అనేది కారు యజమాని అవసరాలు పరిమితంగా ఉన్నప్పుడు లేదా తక్కువ కాలవ్యవధికి మాత్రమే ఇన్సూరెన్స్ అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డ్రైవింగ్ నేర్చుకోవడం, కొత్త ప్రదేశానికి వెళ్లడం, కొన్ని గంటలు డ్రైవింగ్ చేయడం, పెద్దగా కారు వాడకపోవడం, ఏడాది కంటే ఎక్కువ కాలం కవరేజ్ అవసరం లేని సందర్భాల్లో టెంపరరీ కార్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే మంచిది.
టెంపరరీ కార్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కావాల్సిన పత్రాలు
- పేరు, నివాసం, లింగం, వృత్తి వంటి వ్యక్తిగత సమాచారం.
- డ్రైవింగ్ లైసెన్స్, బీమా చరిత్ర మొదలైన గుర్తింపు పత్రాలు.
- అడ్రస్ ఫ్రూఫ్
- సీటింగ్ సామర్థ్యం, ప్యూయెల్ వేరియంట్, మోడల్, ఇంజిన్ సామర్థ్యం వంటి కారు వివరాలు.
తాత్కాలిక కారు బీమా రకాలు
భారతదేశంలో అందించే సమగ్ర బీమా పాలసీలతో పోల్చినప్పుడు తాత్కాలిక బీమా కవరేజీ ప్రయోజనాలు కాస్త తక్కువనే చెప్పాలి. థర్డ్ పార్టీ ఖర్చులు, వాహన దొంగతనం, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల కారుకు నష్టం ఏర్పడితే, సమగ్ర బీమా వల్ల పరిహారం లభిస్తుంది. అయితే ఇవన్నీ స్వల్పకాలిక బీమా పాలసీలో ఉండవు. అయినప్పటికీ స్వల్ప కాలానికి ఈ టెంపరరీ కార్ బీమా కవరేజ్ సరిపోతుంది.
1. గ్యాప్ ఇన్సూరెన్స్
ఫైనాన్స్ ద్వారా లేదా లీజుకు తీసుకున్న వాహనాలకు ఈ గ్యాప్ ఇన్సూరెన్స్ బాగా ఉపయోగపడుతుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కారు ఓనర్‌కు కాకుండా, అవతలి వ్యక్తులకు జరిగిన నష్టాన్ని కవర్ చేస్తుంది. అదే సమగ్ర బీమా పాలసీ అయితే కారు రికవరీ చేయలేనంతగా దెబ్బతింటే, దాని మార్కెట్ వాల్యూని ఓనర్‌కు అందిస్తుంది. ఒక వేళ అంతకంటే భారీ నష్టం ఏర్పడితే, దానిని ఈ గ్యాప్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.
2. అద్దె కార్లకు బీమా
రెంటల్ కార్ ఇన్సూరెన్స్ అనేది అద్దె వాహనాల కోసం తీసుకునే వాహన బీమా. ప్రమాదాలు జరిగినప్పుడు, వ్యక్తులు తీవ్రంగా గాయపడినప్పుడు ఈ బీమా వల్ల పరిహారం లభిస్తుంది.
3. నాన్-ఓనర్స్ ఇన్సూరెన్స్
ఈ ఇన్సూరెన్స్ ప్రైవేట్, అద్దె వాహనాలకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, మీరు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను అడిగి, ఒక నెలపాటు కారును తెచ్చుకున్నారని అనుకుందాం. ఆ నెలరోజులకు మీరు నాన్-ఓనర్స్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు.
టెంపరరీ కార్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకుంటే మంచిది?
కొన్ని రోజులు, నెల, ఆరు నెలలు, గరిష్ఠంగా 9 నెలలకు ఈ తాత్కాలిక ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు, అనుకోకుండా జరిగే ప్రమాదాలు మొదలైన వాటిని ఇది కవర్ చేస్తుంది. అయితే దీనిని ఎప్పుడు తీసుకోవాలంటే?
- మీ కారును అమ్మాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు
- పని లేదా వ్యాపార ప్రయోజనాల కోసం వేరే రాష్ట్రంలో కారు అవసరమైనప్పుడు
- డ్రైవింగ్ సరిగ్గా రాకపోయినా లేక పెద్దగా అనుభవం లేకపోయినా
- మీరు అద్దె కారును నడుపుతున్నప్పుడు
- మీరు చాలా అరుదుగా కారు నడుపుతున్నప్పుడు
- బంధువుల, స్నేహితుల నుంచి తీసుకున్న కారును నడుపుతున్నప్పుడు
- మీ దగ్గర రెండు వాహనాలు ఉండి, ఒకటి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటే 'తాత్కాలిక కార్ ఇన్సూరెన్స్' తీసుకోవడం మంచిది.
తాత్కాలిక బీమా పాలసీ ప్రయోజనాలు
పాలసీదారుడు తన అవసరాలను బట్టి కొన్ని రోజులు, వారాలు, నెల, 6 నెలలు, 9 నెలల వ్యవధికి తాత్కాలిక వాహన బీమా కవరేజీని పొందవచ్చు. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే?
- తాత్కాలిక బీమాకు తక్కువ ప్రీమియం ఉంటుంది.
- తక్షణ బీమా కవరేజీ లభిస్తుంది.
- థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ కవరేజీ కూడా ఉంటుంది.
- కవరేజ్ పీరియడ్‌ను అడ్జెస్ట్ చేసుకోవచ్చు.
తాత్కాలిక బీమాను ఎలా క్లెయిమ్ చేయాలి?
- దొంగతనం లేదా ప్రమాదం జరిగిన 48 గంటలలోపు మీ బీమా ప్రొవైడర్‌కు విషయం తెలియజేయాలి.
- వాహనం ధ్వంసమైనా లేదా వేరొకరు తీసుకెళ్లినా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
- ముఖ్యంగా ఎఫ్ఐఆర్ (FIR) ఫైల్ అయ్యేటట్లు చేయాలి.
- అవసరమైన అన్ని పత్రాలు సమర్పించాలి. అంతే సింపుల్!
- మీరు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత, ఎంత మేరకు నష్టం జరిగిందో తెలుసుకోవడానికి, బీమా కంపెనీ ఒక సర్వేయర్‌ను నియమిస్తుంది.
- వాళ్లు కారును గ్యారేజీకి పంపిస్తారు.
- నెట్వర్క్ గ్యారేజ్‌లో అయితే ఫ్రీగానే రిపేర్ చేస్తారు.
- ఒక వేళ దొంగతనానికి గురైన వాహనం దొరకకపోతే పోలీసులు 'అన్‌ట్రేసబుల్ రిపోర్ట్' ఇస్తారు.
- ఈ రిపోర్ట్ ప్రకారం, బీమా కంపెనీ పాలసీదారుడికి కార్ డిక్లేర్డ్ విలువ (IDV) ఆధారంగా పరిహారం ఇస్తుంది.
మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Best Mileage Bikes Under 1 Lakh