NPS Vatsalya Scheme Benefits : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024 బడ్జెట్‌లో 'ఎన్‌పీఎస్ వాత్సల్య' అనే కొత్త పథకం ప్రవేశపెట్టారు. తమ పిల్లల భవిష్యత్ కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 18 ఏళ్ల లోపు బాలబాలికల పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ స్కీమ్‌లో మదుపు చేయవచ్చు. అయితే పిల్లలు మేజర్లు అయ్యాక ఈ ఖాతా సాధారణ ఎన్‌పీఎస్ (NPS) ఖాతాగా మారిపోతుంది. పిల్లల భవిష్యత్ కోసం ముందు నుంచే మదుపు ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
పన్ను ప్రయోజనాలు
దేశంలోని ప్రజలందరికీ సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2024లో 'ఎన్‌పీఎస్' పథకాన్ని తీసుకువచ్చింది. ఇది పన్ను ప్రయోజనాలతో పాటు, దీర్ఘకాలిక పెట్టుబడి పథకంగానూ బాగా ప్రాచుర్యం పొందింది. దీన్నే ఇప్పుడు మరింత విస్తృత పరుస్తూ, మైనర్ల కూడా ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తేవడం జరిగింది. అంటే సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ పథకాల సరసన ఇది చేరింది.
రెండు రకాల ఖాతాలు
ఎన్‌పీఎస్‌లో టైర్-1, టైర్-2 అనే రెండు రకాల ఖాతాలు ఉంటాయి. టైర్-1 అనేది ఒక ప్రాథమిక పింఛను ఖాతా. ఇందులో ఉపసంహరణలపై కొన్ని పరిమితులు ఉంటాయి. టైర్-2 అనేది స్వచ్ఛంద పొదుపు పథకం లాంటిది. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడిపై సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద రూ.50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. అదనంగా సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
పదవీ విరమణ తర్వాత (60 ఏళ్లు) ఎన్‌పీఎస్ నిధిలో నుంచి 60 శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. మిగతా 40% మొత్తంతో తప్పనిసరిగా యాన్యుటీ పథకాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల పదవీ విరమణ తర్వాత పింఛను పొందేందుకు వీలవుతుంది.
ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్ ప్రయోజనాలు
- ఎన్‌పీఎస్ వాత్సల్య వల్ల ముందుగానే మదుపు ప్రారంభించడానికి వీలు ఏర్పడుతుంది. దీనివల్ల చక్రవడ్డీ ప్రయోజనం కూడా లభిస్తుంది.
- మైనర్లుగా ఉన్నప్పుడే ఎన్‌పీఎస్ ఖాతా తెరవడం వల్ల, పదవీ విరమణ నాటికి పెద్ద మొత్తంలో కార్పస్ సమకూరుతుంది.
- ఎన్‌పీఎస్ వాత్సల్య అకౌంట్ ఉండడం వల్ల చిన్నతనం నుంచే పిల్లలకు పొదుపు అలవాటు చేయవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడుల వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వారికి తెలియజేయవచ్చు.
- నెలకు రూ.500 లేదా ఏడాదికి రూ.6 వేలు చొప్పున అతి తక్కువ పెట్టుబడితో ఈఎన్‌పీఎస్ ఖాతా తెరవవచ్చు. నేరుగా వెబ్‌సైట్‌లో గానీ, బ్యాంకులో గానీ ఈ ఖాతా ఓపెన్ చేయవచ్చు.
- ఎన్‌పీఎస్ వాత్సల్య పథకంలో పెట్టే పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఉంటుంది. పైగా మెచ్యూరిటీ అమౌంట్‌పై కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.