SBI Home Loan EMI Calculation : మీరు కొత్త ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఇందుకోసం హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ముందుగా ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు ఉందో తెలుసుకోవాలి. అలాగే వడ్డీ చెల్లింపు నిబంధనలపై కూడా దృష్టి సారించాలి. ఆ తర్వాత మాత్రమే మీరు హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవాలి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ (SBI)లో గృహ రుణాల ప్రారంభ వడ్డీ రేటు 9.15 శాతంగా ఉంది. ఉదాహరణకు మీరు కనుక 20 సంవత్సరాలకుగానూ రూ.30 లక్షలు రుణంగా తీసుకుంటే, మీ నెలవారీ ఈఎంఐ (EMI) ఎంత అవుతుంది? మీరు లోన్ కాలవ్యవధిలో ఎంత వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
SBI Home Loan EMI Calculation : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం, 750 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న కస్టమర్లకు ఎస్బీఐ 9.15 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో గృహ రుణాన్ని మంజూరు చేస్తోంది. ఉదాహరణకు మీరు 20 సంవత్సరాల కాలవ్యవధితో రూ.30 లక్షలు రుణంగా తీసుకున్నారు అనుకుందాం. మీకు కేవలం 9.15 వడ్డీ రేటుతో రుణం ఇస్తే, మీరు కట్టాల్సిన ఈఎంఐ ఎంత ఉంటుందంటే?
- లోన్ మొత్తం : రూ.30 లక్షలు
- రుణ కాలపరిమితి : 20 సంవత్సరాలు
- వడ్డీ రేటు : సంవత్సరానికి 9.15 శాతం
- ఈఎంఐ : నెలకు రూ.27,282
- కట్టాల్సిన మొత్తం వడ్డీ : రూ.35,47,648
- మొత్తం చెల్లింపు (లోన్ రీపేమెంట్) : రూ.65,47,648
చూశారుగా, మీరు కనుక ఎస్బీఐ నుంచి రూ.30 లక్షలు హోం లోన్ తీసుకుంటే, 20 ఏళ్లలో రూ.35,47,648 వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అంటే మీరు లోన్ రీపేమెంట్ కింద ఏకంగా రూ.65,47,648 చెల్లించాల్సి ఉంటుంది. దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే, మీరు కట్టాల్సిన వడ్డీ, అసలు కంటే ఎక్కువగా ఉంటుందని స్పష్టమవుతుంది.
బేరమాడే అవకాశం ఉంది!
మీ సిబిల్ స్కోర్, లోన్ రీపేమెంట్ కెపాసిటీలను బట్టి, తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్ మంజూరు చేయమని బేరం ఆడవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఫిక్స్డ్ ఇంట్రస్ట్ రేట్ కంటే, ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
రెపో రేటు ప్రభావం :
ఎస్బీఐ లాంటి షెడ్యూల్డ్ బ్యాంకుల వడ్డీ రేట్లు, నేరుగా ఆర్బీఐ రెపో రేటుతో లింక్ అయి ఉంటాయి. ఎలా అంటే, కమర్షియల్ బ్యాంకులు ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకుంటాయి. ఇలా తీసుకున్న రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటునే రెపో రేటు అంటారు. కనుక రెపో రేటు పెరిగితే, వ్యక్తిగత రుణాలు, గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. ఒకవేళ రెపో రేటు తగ్గితే, బ్యాంకులు మంజూరు చేసే రుణాల వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఆర్బీఐ 2019 అక్టోబర్ నుంచి బ్యాంకులు అన్నీ - తమ వ్యక్తిగత, వాహన, గృహ రుణాల ఫ్లోటింగ్ ఇంట్రస్ట్ రేట్లను, రెపో రేటుతో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేసింది. అందుకే చాలా బ్యాంకులు రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR) వద్ద గృహ రుణాలను అందిస్తున్నాయి.
మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలనా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Popular Bikes In India