Vistara - Air India Merger : ఎయిర్ ఇండియాతో విలీనం నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 11న విస్తారా చివరి విమానం నడపనుంది. నవంబరు 12 నుంచి విస్తారాకు చెందిన విమానాలన్నీ ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలోనే నడుస్తాయి. బుకింగ్‌లు సైతం ఎయిర్ ఇండియా వెబ్సైట్ నుంచే జరగనున్నాయి. సెప్టెంబర్ 3 నుంచి విస్తారాలో బుకింగ్‌లు నిలిచిపోనున్నాయి. అయితే నవంబర్ 11 వరకు మాత్రం విస్తారా కార్యకలాపాలన్నీ యథావిధిగా కొనసాగుతాయని సదరు కంపెనీ వెల్లడించింది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం ఆమోదం
ఎయిర్ ఇండియాలో విస్తారాను విలీనం చేసే ప్రతిపాదిత ఒప్పందంలో భాగంగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం భారత ప్రభుత్వం సింగపూర్ ఎయిర్ లైన్స్‌కు అనుమతి ఇచ్చింది. ఈ విలీనం పూర్తయిన తర్వాత ఎయిర్ ఇండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ 25.1 శాతాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి 2022 నవంబర్లోనే ఎయిర్ ఇండియా, విస్తారా విలీనాన్ని ప్రకటించాయి. విస్తారా అనేది టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్. ఎయిర్ ఇండియా టాటా గ్రూప్‌నకు చెందిన సంస్థ.
స్వాగతించిన ఎయిర్ ఇండియా
తమ సంస్థలో సింగపూర్ ఎయిర్ లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని ఎయిర్ ఇండియా స్వాగతించింది. ఇది విస్తారా, ఎయిర్ ఇండియా మధ్య విలీన ప్రక్రియను మరింత సులభతరం చేసే ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొంది. "ఎయిర్ ఇండియా, విస్తారా క్రాస్-ఫంక్షనల్ టీమ్స్ చాలా నెలలుగా కలిసి పనిచేస్తున్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్, ఫ్లయింగ్ సిబ్బంది, గ్రౌండ్ బేస్డ్ సహోద్యోగులు కలిసి కస్టమర్లకు మంచి ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు కష్టపడుతున్నాయి" అని ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు.
ప్రయాణికులకు మరింత మంచి ప్రయాణ అనుభవం
"ఎయిర్ ఇండియా, విస్తారా విలీనం ప్రయాణికులకు పెద్ద శుభవార్త. విస్తృత నెట్‌వర్క్‌తో ఎయిర్ ఇండియా ప్రయాణికులకు మరింత మంచి ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది" అని విస్తారా సీఈఓ వినోద్ కణ్ణన్ వ్యాఖ్యానించారు. ఈ విలీనం పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ఎయిరిండియా (Air India) నిలుస్తుంది.