Car Buying Tips And Tricks : కొత్త కారు కొనుక్కోవాలని చాలా మందికి ఆశగా ఉంటుంది. కానీ కారు కొనేటప్పుడు మీ మనస్సుతో కాకుండా, బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి. లేకుంటే ఇష్టపడి కొనుక్కున్న కారు తరవాత మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అందుకే కారు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి తప్పులు చేయకూడదు? అనే విషయాలు ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.
Car Buying Tips In Telugu
1. బడ్జెట్ : మంచి లగ్జరీ కారు కొనాలని అనుకోవడం ఏమాత్రం తప్పుకాదు. కానీ అది మీ బడ్జెట్‌కు మించి ఉండకుండా చూసుకోవాలి. ఒక వేళ మీరు మీ ఆర్థిక స్థితికి మించిన బడ్జెట్‌తో కారు కొంటే, తరువాత చాలా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే, కారు కొన్న తరువాత దానిని బాగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దీనికి బాగా ఖర్చు అవుతుంది. పైగా ఆయిల్ ధరలు ఎలానూ ఉంటాయి. అన్నింటి కంటే కారు సర్వీసింగ్ ఛార్జీలు భారీగా ఉంటాయి. వీటిని సామాన్యులు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కనుక భవిష్యత్‌లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలంటే, మీ బడ్జెట్‌కే మీరు కట్టుబడి ఉండాలి.
2. రీసెర్చ్ : కారు కొనేముందు మీ బడ్జెట్ రేంజ్‌లో ఉన్న కార్ల గురించి కచ్చితంగా రీసెర్చ్ చేయాలి. అలాగే ఆ కార్లను సరిపోల్చి చూసుకోవాలి. దీని వల్ల ఏ కారులో మంచి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయో, ఏది మంచి పెర్ఫార్మెన్స్, మైలేజ్ ఇస్తుందో తెలుస్తుంది. అంతేకాదు కార్లపై మీకు మరింత పరిజ్ఞానం పెరుగుతుంది. ఫలితంగా కార్లు అమ్మేవారి ట్రాప్‌లో పడకుండా ఉంటారు.
3. టెస్ట్ డ్రైవ్ : కారు కొనేముందు కచ్చితంగా దాన్ని టెస్ట్ డ్రైవ్ చేయాలి. ఇందులో ఎలాంటి మొహమాటానికి తావులేదు. అప్పుడే సదరు కారు ఎంత సౌకర్యంగా ఉందో మీకు తెలుస్తుంది. కారు టెస్ట్ డ్రైవ్ చేస్తేనే - కాలు పెట్టుకోవడానికి అనువుగా లెగ్‌రూమ్ ఉందా? డ్రైవ్ చేస్తున్నప్పుడు కారు స్థిరంగా ఉంటోందా? కారు లోపల విశాలమైన స్థిలం ఉందా? లగేజ్ పెట్టుకోవడానికి కారులోని బూట్ స్పేస్ సరిపోతుందా? ఓవరాల్ డ్రైవింగ్ ఫీల్ ఎలా ఉంది? అనే విషయాలు తెలుస్తాయి. ఫలితంగా ఆ కారు కొనాలా? వద్దా? అనేది నిర్ణయించుకోవడానికి వీలు ఏర్పడుతుంది.
4. ఆ విషయం చెప్పవద్దు : చాలా మంది కొత్త కారు కొంటున్నామనే సంతోషంలో సేల్స్ మ్యాన్‌కు తమ బడ్జెట్ గురించి, తమకు ఇష్టమైన మోడల్ గురించి ముందుగానే చెప్పేస్తుంటారు. అలాగే తమకు కావాల్సిన ఫీచర్స్, లైకింగ్స్ గురించి కూడా చెప్పేస్తారు. కానీ అలా చేయడం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే, చాలా మంది సేల్స్ మ్యాన్లు చాలా తెలివిగా ఉంటారు. వారు మీ మైండ్ సెట్‌ను పూర్తిగా మార్చేస్తారు. అదనపు ఫీజర్లు, స్పెక్స్, కంఫర్ట్ గురించి చెబుతూ, హైయ్యర్-వెర్షన్ మోడల్‌ను మీకు అంటగడతారు. దీని వల్ల మీపై అదనపు ఆర్థిక భారం పడుతుంది.
5. షో చేయడానికి కారు కొనవద్దు : బాగా డబ్బు ఉన్నవాళ్లు అయితే ఎలాంటి కారు కొన్నా ఫర్వాలేదు. కానీ బడ్జెట్లో కారు కొనాలని అనుకునేవాళ్లు కచ్చితంగా తమ అవసరాలకు అనుగుణమైన కారు మాత్రమే కొనుక్కోవాలి. మీరు వ్యక్తిగత అవసరాల కోసం కారు కొంటున్నారా? లేదా వారాంతాల్లో సరదాగా డ్రైవ్ చేయాలని అనుకుంటున్నారా? లేదా ప్రతి రోజూ కారు వాడుతుంటారా? కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రయాణించడానికి కారు అనువుగా ఉందా? మొదలైన అంశాల ఆధారంగా బండిని కొనుక్కోవాలి. అంతేకానీ బ్రాండ్ పేరు కోసం, లేదా ఇతరుల ముందు షో చేయడానికి కారు కొంటే, తరువాత మీరే ఇబ్బంది పడతారు.
6. ఈఎంఐ : మీరు కనుక బ్యాంక్ లోన్ తీసుకుని కారు కొనాలనుకుంటే, నెలవారీగా ఈఎంఐ భారం ఎంత ఉంటుందో ముందే లెక్కవేసుకోవాలి. అలాగే కచ్చితంగా తక్కువ వడ్డీ రేటుతో లోన్ ఇచ్చే బ్యాంకును ఎంచుకోవాలి. చాలా మంది నేరుగా కారు బయ్యర్స్ సూచించే బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదు. డీలర్లకు బ్యాంకులతో టయ్యప్ ఉంటుంది. వారికి బ్యాంకులు కమీషన్ ఇస్తుంటాయి. కనుక డీలర్లు మీకు ఎక్కువ వడ్డీ వసూలు చేసే, కారు లోన్స్‌ను అంటగడుతూ ఉంటారు. కనుక ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
7. ఫ్యూయెల్ టైప్ : ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్), ఎల్‌పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) కార్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక ప్రతిరోజూ లాంగ్ రూటుల్లో డ్రైవ్ చేయాల్సి ఉంటే డీజిల్ లేదా సీఎన్‌జీ లేదా ఎల్‌పీజీ కార్లు తీసుకోవడం మంచిది. కానీ ఈ కార్లు పెట్రోల్ కార్ల కంటే బాగా ఎక్కువ రేటు ఉంటాయి. పైగా వాటి మెయింటెనెన్స్, రిపేర్ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు పెట్రోల్ కారు పార్ట్స్ కంటే మిగతా కార్ల పార్టుల కంటే చాలా ఎక్కువ ఖరీదు ఉంటాయి. ఎలక్ట్రిక్ కార్లు కూడా మరో ఆప్షన్. అయితే వీటి మెయింటెనెన్స్ గురించి మీరు ముందే తెలుసుకోవడం చాలా అవసరం.
8. రీసేల్ వాల్యూ : కార్లు కొన్న తరువాత వాటి విలువ ఏటా తగ్గుతూ ఉంటుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం కారు ధర 20-30 శాతం వరకు తగ్గుతుంది. కనుక మీ కారు రీసేల్ వాల్యూ గురించి కూడా ముందుగానే ఆలోచించుకోవాలి. కొన్ని కార్లకు మంచి రెప్యుటేషన్ ఉంటుంది. పైగా వాటి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి కార్లు పాతబడినప్పటికీ, మార్కెట్లో వాటికి మంచి రీసేల్ వాల్యూ ఉంటుంది. కనుక మంచి రీసేల్ వాల్యూ ఉన్న కార్లను ఎంచుకోవడమే మంచిది.
9. తొందర పడవద్దు : కొంత మంది కారు కొనాలనే ఆత్రుతతో ఉంటారు. కానీ ఇది మంచిది కాదు. కారు కొనేటప్పుడు మీ ఎమోషన్స్‌ను అదుపులో ఉంచుకోవాలి. ఏ మాత్రం తొందర పడకుండా, అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా బేరీజ్ వేసుకోవాలి. కారు ధర, మెయింటెనెన్స్ కాస్ట్, సర్వీస్ ఛార్జ్‌లు, పెట్రోల్ ధరలు మొదలైన వాటన్నింటినీ చూసుకోవాలి. కారు కొనేముందు కచ్చితంగా రీసెర్చ్ చేయాలి. మార్కెట్లోని వివిధ కార్లను సరిపోల్చి చూడాలి. వాటిలో బెస్ట్ కార్‌ను ఎంచుకోవాలి.
10. సెకెండ్ హ్యాండ్ కారు : మీ బడ్జెట్ చాలా తక్కువగా ఉంటే, సెకెండ్ హ్యాండ్ కారు కొనడంలో ఎలాంటి తప్పు లేదు. సర్టిఫైడ్ యూజ్డ్ కార్లు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. అయితే సెకెండ్ హ్యాండ్ కార్లు కొనేముందు కచ్చితంగా దానిని టెస్ట్ డ్రైవ్ చేయాలి. మంచి అనుభవం ఉన్న మెకానిక్‌తో దానిని పూర్తిగా చెక్ చేయించాలి. లేకుంటే, తరువాత చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
బోనస్ టిప్ : కారు కొనేముందు కచ్చితంగా వెహికల్ ప్రోబ్లమ్స్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోండి. అలాగే స్వయంగా చిన్నచిన్న రిపేర్లు చేయడం కూడా నేర్చుకోండి. దీని వల్ల భవిష్యత్‌లో చాలా ఉపయోగం ఉంటుంది. అనవసరపు ఖర్చులు బాగా తగ్గిపోతాయి. అలాగే కారు ఇన్సూరెన్స్‌తోపాటు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ఉండేలా చూసుకోండి. ఈ టిప్స్ అన్నీ పాటిస్తే, మీ కలల కారు మీ ముందుంటుంది.
దీపావళికి మంచి కారు కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లో లభించే టాప్-5 మోడల్స్ ఇవే!