Stock Market Today December 13, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొని, భారీ లాభాలతో ముగిశాయి. ఒకానొక దశలో 1000 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ తరువాత క్రమంగా పుంజుకుంది. చివరకు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 843 పాయింట్లు లాభపడి 82,133 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 219 పాయింట్లు వృద్ధి చెంది 24,769 వద్ద ముగిసింది.
- లాభపడిన షేర్లు : భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, కోటక్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, టైటన్, హెచ్‌సీఎల్ టెక్, పవర్‌గ్రిడ్, నెస్లే ఇండియా, అదానీ పోర్ట్స్
- నష్టపోయిన షేర్లు : టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్‌సెర్వ్
గ్రేట్ రికవరీ
విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడం సహా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వచ్చిన నేపథ్యంలో మొదట్లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. కానీ మధ్యాహ్నం తరువాత టెలికాం, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్ అండతో మార్కెట్లు పుంజుకుని, భారీ లాభాలను మూటగట్టుకున్నాయి.
అక్టోబరులో 6.21 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం నవంబరులో 5.48 శాతానికి తగ్గింది. ఆర్‌బీఐ నియంత్రణ లక్ష్యమైన 6% లోపునకు ఇది దిగిరావడం గమనార్హం. ప్రధానంగా ఆహార పదార్థాల ధరలు దిగివచ్చాయి. ఇది కూడా మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచింది. అయితే గురువారం విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం- మైనింగ్, పవర్, తయారీ రంగాల పేలవమైన పనితీరు కారణంగా భారత పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి 2024 అక్టోబర్‌లో 3.5 శాతానికి తగ్గింది. ఇది కాస్త ఆందోళన కలిగించే అంశం.
అంతర్జాతీయ మార్కెట్లు
శుక్రవారం ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్ నష్టాలతో ముగియగా, సియోల్ మాత్రం లాభపడింది. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. గురువారం యూఎస్ మార్కెట్లు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, గురువారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.3,560.01 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు.
రూపాయి విలువ : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 9 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.84.79గా ఉంది.
ముడిచమురు ధరలు : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.54 శాతం మేర తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 73.77 డాలర్లుగా ఉంది.