How To Avoid Stock Market Frauds : ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్ మోసాలు (ఫ్రాడ్స్) విపరీతంగా పెరిగిపోతున్నాయి. స్టాక్ మార్కెట్లలో మంచి లాభాలు ఇప్పిస్తామని ఇన్వెస్టర్లను నమ్మించి, మోసగాళ్లు కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. అహ్మదాబాద్‌కు చెందిన పటేల్(88) అనే రిటైర్డ్ చార్టర్డ్ అకౌంటెంట్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. సైబర్ కేటుగాడి చేతిలో ఆయన ఏకంగా రూ.1.97 కోట్లు మోసపోయాడు. అందుకే మనం కూడా ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే, స్టాక్ మార్కెట్ మోసాలను ఎలా గుర్తించాలి? వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి? అనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.
నమ్మించి మోసం చేశాడు!
సునీల్ సింఘానియా అనే మోసగాడు, తాను ఓ స్టాక్ మార్కెట్ నిపుణుడితో కలిసి పనిచేస్తున్నాని, పటేల్ అనే ఇన్వెస్టర్‌కు వాట్సాప్ మెసేజ్ పంపాడు. పెట్టుబడి చిట్కాలను ఉచితంగా ఇస్తామని నమ్మించి పటేల్‌ను ఓ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశాడు. నకిలీ లాభాలను చూపించి పటేల్‌ను బాగా ఆకర్షించాడు. ఆ తర్వాత ఓ నకిలీ వెబ్సైట్ ద్వారా పెట్టుబడులు పెట్టేలా చేశాడు. అలా మెల్లగా పటేల్‌కు చిన్నపాటి లాభాలను చూపించి, తరువాత ఏకంగా రూ.1.97 కోట్లు మేర పెట్టుబడి పెట్టేటట్లు చేశాడు సింఘానియా. ఆ తర్వాత షేర్ల ఉపసంహరణకు 15శాతం పన్ను చెల్లించాలని సింఘానియా డిమాండ్ చేశాడు. అక్కడితో ఆగకుండా పోర్ట్ ఫోలియో విలువలో 1శాతం ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశాడు. దీనితో తాను మోసపోయానని గ్రహించిన పటేల్ అహ్మదాబాద్ సైబర్‌క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశాడు.
స్టాక్ మార్కెట్ స్కామ్‌లను ఎలా గుర్తించాలి?
ఆర్థిక నిపుణులు ఇలాంటి షేర్ మార్కెట్ మోసాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కొత్త వ్యక్తుల పరిచయాల పట్ల జాగ్రత్త వహించాలని స్పష్టం చేస్తున్నారు. ఆర్థిక నిపుణులమని చెప్పుకునేవారి సెబీ లేదా ఆర్బీఐ రిజిస్ట్రేషన్‌ను కచ్చితంగా చెక్ చేయమంటున్నారు. వారికి సెబీ, ఆర్బీఐ నుంచి లైసెన్స్ ఉంటే ఓకే. లేదంటే వారి కాంటాక్ట్‌ను పూర్తి విస్మరించాలి. లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
ఆర్థిక నిపుణులు చెబుతున్న చిట్కాలు
- యాప్స్, వెబ్‌సైట్స్ ద్వారా పెట్టుబడి పెట్టేటప్పుడు, అవి ఒరిజినలా లేదా నకిలీయా అనేది చెక్ చేసుకోవాలి.
- నిజమైన స్టాక్ ఇన్వెస్టింగ్ యాప్‌లకు సెబీ లైసెన్స్ ఉంటుంది. NBFCలకు ఆర్బీఐ లైసెన్స్ ఉంటుంది.
- అధికారిక యాప్ స్టోర్లలో లిస్ట్ చేయని ఏపీకే ఫైల్స్‌ను డౌన్లోడ్ చేయకూడదు.
- అధిక రాబడిని అందిస్తామని వచ్చే మెసేజ్‌లను నమ్మవద్దు.
- మీ పాస్వర్డ్లు, ఓటీపీలు ఎవరికీ చెప్పకూడదు, షేర్ చేయకూడదు.
- క్రమం తప్పకుండా పాస్‌వర్డ్‌లను మార్చుతూ ఉండాలి.
- మీ ఐడెంటిటీ ఫ్రూప్స్(ఆధార్, పాన్ వంటివి) మోసగాళ్ల చేతిలో పడకుండా జాగ్రత్త వహించాలి.
- స్టాక్ మార్కెట్‌పై సరైన అవగాహన కల్పించుకోవాలి.
- ఆన్లైన్ స్కామ్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుని, అప్రమత్తంగా ఉండాలి.