SpiceJet Plans To Lay Off 1000 Employees : సంక్షోభంలో ఉన్న ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ త్వరలో 1350 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్లీట్ ఖర్చులు తగ్గించడానికి, సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆర్థిక సంక్షోభం
'స్పైస్‌జెట్ ఇప్పటికే అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అలాగే చట్టపరమైన పోరాటాలు చేస్తోంది. అందుకే సంస్థలో ఉన్న అదనపు సిబ్బందిని తొలగించి, కొంత మేరకు ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తోంది. ఈ వారం చివరి నాటికి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది' అని ఓ స్పైస్‌జెట్ అధికారి తెలిపారు.
పింక్ స్లిప్స్
'ప్రస్తుతం స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌లో 9000 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 10-15% మందిని తొలగించే అవకాశం ఉంది. ఇదే జరిగితే సంస్థకు ఏడాదికి రూ.100 కోట్ల వరకు ఆదా అవుతుంది.'
- ఓ స్పైస్‌జెట్ అధికారి
ఇదే జరిగితే స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌లో దాదాపు 1,350 మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది.
అన్ని శాఖల్లోనూ తొలగింపులు
'స్పైస్‌జెట్ దాదాపు అన్ని శాఖల్లోనూ అదనంగా ఉన్న ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మేనేజ్మెంట్, కన్సల్టెన్సీ సిబ్బంది సంస్థలో అదనంగా ఉన్న ఉద్యోగుల జాబితాను తయారు చేస్తున్నారు' అని మరో అధికారి తెలిపారు. అయితే దీనిపై స్పైస్‌జెట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.
ఒడుదొడుకులు
ప్రస్తుతం స్పైస్‌జెట్ వద్ద 10 లీజుకు తీసుకున్న విమానాలు, 30 వరకు ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం స్పైస్‌జెట్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. అందుకే స్పైస్‌జెట్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ సంస్థ ఖర్చులను గణనీయంగా తగ్గించడంపై దృష్టి కేంద్రీకరించారు. అలాగే స్పైస్‌జెట్ క్యారియర్ ఫ్లీట్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు, ఆన్-టైమ్ పెర్ఫార్మెన్స్ను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు.
స్పైస్‌జెట్ ప్రారంభమైనప్పటి నుంచి అనేక యాజమాన్య మార్పులు జరిగాయి. ప్రస్తుతం అజయ్ సింగ్ నేతృత్వంలో నడుస్తోంది. ఈయన సంస్థను నిలబెట్టేందుకు పెట్టుబడిదారుల నుంచి నిధులు సేకరించే పనిలో ఉన్నారు.
నిధుల సమీకరణ
స్పైస్‌జెట్ ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన సెక్యూరిటీలు జారీ చేసి రూ.2,250 కోట్లు సమీకరించాలని నిర్ణయించుకుంది. మొదటి విడతగా రూ.744 కోట్లు సమీకరించినట్లు ఈ జనవరి 26న ప్రకటించింది. అయితే అవసరమైన నిధులు సేకరించడంలో తీవ్రమైన జాప్యం జరుగుతున్నట్లు సమాచారం.
గవర్నమెంట్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ కింద ఇప్పటికే స్పైస్‌జెట్ రూ.1000 కోట్ల విలువైన నిధులను పొందింది. మరో రూ.500 కోట్లు కూడా సమకూర్చుకోవడానికి అజయ్ సింగ్ ప్రయత్నిస్తున్నారు.
లీగల్ ఇష్యూస్
లీజుకు తీసుకున్న విమానాలకు స్పైస్‌జెట్ అద్దె చెల్లించలేదు. దీనితో లీజర్లు తమ విమానాలను తిరిగి తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం కోర్టు కేసులు కూడా వేశారు. ఇది స్పైస్‌జెట్‌కు పెద్ద సమస్యగా మారింది.
కష్టాల్లో
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్లోలో భారత్ ఒకటి. ముఖ్యంగా దేశీయ విమానాలు పెద్దఎత్తున రాకపోకలు కొనసాగిస్తున్నాయి. అయితే స్పైస్‌జెట్ మాత్రం గతకొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. 2023లో స్పైస్‌జెట్ 83.90 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. దేశంలో దీని మార్కెట్ వాటా 5.5 శాతంగా ఉండడం గమనార్హం.
గోల్డ్ బాండ్ సబ్స్క్రిప్షన్ షురూ - వారికి స్పెషల్ డిస్కౌంట్ - అప్లై చేయండిలా!
క్రిప్టోకరెన్సీ ఇన్వెస్ట్మెంట్ చేయాలా? ఈ టాప్-7 టిప్స్ మీ కోసమే!