Sony Terminates Merger Agreement With Zee Entertainment : సోనీ కంపెనీ - జీ ఎంటర్టైన్మెంట్తో జరగాల్సిన విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. వీటి మధ్య విలీన ఒప్పందం జరిగి ఉంటే, భారత్‌లో 10 బిలియన్ డాలర్ల విలువైన మీడియా ఎంటర్ప్రైజ్ ఏర్పడి ఉండేది.
ఒప్పందం రద్దు కావడానికి కారణం ఏమిటంటే?
సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (SPNI) పేరును దాని మాతృ సంస్థ చాలా కాలం కిందటే కల్వర్ మాక్స్ ఎంటర్టైన్మెంట్గా మార్చింది. ఇది జీ-ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)ను తమలో విలీనం చేసుకోవాలని తొలుత భావించింది. కానీ తాజాగా ఆ విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
అంతర్జాతీయ సంస్థ అయిన సోనీ గ్రూప్ కార్పొరేషన్‌కు చెందిన అనుబంధ సంస్థయే SPNI. అందుకే మాతృ సంస్థ ఆదేశాల మేరకు జీ ఎంటర్టైన్మెంట్తో విలీన ఒప్పందాన్ని తాజాగా రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.
సోనీ- జీ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, ఒక నెల గ్రేస్ పీరియడ్‌తో కలుపుకొని, 2023 డిసెంబర్ 21లోపు, అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు, ఆర్థిక లావాదేవీలు పూర్తి కావాలి. ఒకవేళ అగ్రిమెంట్ జరిగిన 24 నెలలలోపు విలీనం జరగకపోతే, ఇరుపార్టీలు కలిసి, సహేతుక కారణాలతో, ఈ కాలవ్యవధిని మరికొంత కాలం పొడిగించుకోవచ్చు. అయితే కాల వ్యవధి పొడిగింపు నిర్ణయం అనేది అగ్రిమెంట్ గడువు ముగిసిన 30 రోజుల్లోపే తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ అలా జరగకపోతే, ఏ పార్టీ వారైనా, రాతపూర్వక నోటీస్ ఇచ్చి, విలీన ఒప్పందం నుంచి తప్పుకోవచ్చు. లేదా ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు.
అందుకే ఒక నెల గ్రేస్ పీరియడ్ ముగిసిన తరువాత సోనీ గ్రూప్, జీ ఎంటర్టైన్మెంట్ ప్రమోటర్లైన సుభాష్ చంద్ర కుటుంబానికి 2023 డిసెంబర్ 17న టెర్మినేషన్ నోటీస్ పంపించింది. దీనితో ఈ ఒప్పందం గడువు పెంచాలని సుభాష్ చంద్ర కుటుంబం కోరింది. మొదటదానికి అంగీకరించని సోనీ, తరువాత చర్చలకు ఒప్పుకుంది. కానీ తాజాగా ఆ విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.
ఆమోదం లభించినా రద్దు : సోనీ-జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి ఇదివరకే ఫెయిర్ ట్రేడ్ రెగ్యూలేటర్ సీసీఐ, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, సహా కంపెనీ వాటాదారులు, రుణదాతలు అందరూ ఆమోదం తెలిపారు. 2023 ఆగస్టులో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ముంబయి బెంచ్ కూడా ఈ విలీనానికి అనుమతి ఇచ్చింది.
బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!