RBI Monetary Policy April 2024 : కీకీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది. అంతా ఊహించినట్లుగానే రెపోరేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. 5:1 ఓట్ల మెజారిటీతో ఈ ద్రవ్య విధాన నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు.
2023 ఏప్రిల్ నుంచి రెపో రేటును ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగిస్తూ వస్తుంది. కాగా, రెపో రేటును ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగించడం ఇది వరుసగా ఏడో సారి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ ప్రకటించిన తొలి ద్వైమాసిక పరపతి విధానం ఇదే కావడం గమనార్హం.
''భారతదేశానికి ధృఢమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయి. అయితే ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితి చేయాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణం ఒత్తిడి పెరిగింది. అందుకే ఈ ద్రవ్యోల్బణాన్ని కట్టిడి చేసేందుకు ఆర్‌బీఐ కృషి చేస్తుంది."
- శక్తికాంత దాస్, ఆర్‌బీఐ గవర్నర్
జీడీపీ వృద్ధి రేటు 7 శాతం!
ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 7 శాతం ఉండవచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది.
ఫారెక్స్ నిల్వలు
2024 మార్చి 29 నాటికి భారతదేశ ఫారెక్స్ నిల్వలు ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయి (645.6 బిలియన్ డాలర్లకు) చేరుకున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వలను (బఫర్) మరింత పెంచుకోవడంపై ఆర్‌బీఐ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఆర్‌బీఐ మోనటరీ పాలసీ నిర్ణయాలు
1. గ్లోబల్ డెట్-టు-జీడీపీ నిష్పత్తి ఎక్కువగా ఉంది. కనుక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలపై స్పిల్-ఓవర్ ప్రభావం ఉండవచ్చు.
2. ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ డిమాండ్, వినియోగం పెరుగుతోంది. ఇది దేశ ఆర్థిక వృద్ధికి తొడ్పడుతుంది.
3. ద్రవ్యోల్బణం ఒత్తిడిని తగ్గించాల్సిన అవసరం ఉంది.
4. తయారీ, సేవల రంగాల్లో స్థిరమైన వృద్ధి సాధించడానికి ప్రైవేట్ పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉంది.
5. ప్రపంచ వృద్ధి ప్రస్తుతానికి స్థిరంగా ఉంది. కానీ ముడిచమురు ధరల పెరుగుదలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
6. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కమోడిటీ ధరలను తలకిందులు చేసే అవకాశం ఉంది.
7. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాధారణ రుతుపవనాలు వస్తాయని ఊహిస్తున్నాం. కనుక ద్రవ్యోల్బణ అంచనాలను 4.5 శాతం వద్ద ఉంచాం.
8. ఆర్‌బీఐ లిక్విటిడీ మేనేజ్మెంట్ విషయంలో చాలా చురుకుగా వ్యవహరిస్తుంది.
9. శాశ్వత ప్రాతిపదికన ధరల స్థిరత్వాన్ని సాధించడమే ఆర్‌బీఐ లక్ష్యం.
10. వర్ధమాన దేశాలతో పోల్చితే, 2023లో భారత రూపాయి విలువ దాదాపు స్థిరంగా ఉంది.
11. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతర ఆర్థిక సంస్థలు తమ కార్యకలాపాలను చాలా సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే దేశ ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది.
12. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా రెమిటెన్స్ను స్వీకరించే దేశంగా భారత్ కొనసాగుతోంది.
13. ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్లో రిటైల్ మదుపరుల భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికి ఆర్‌బీఐ ప్రత్యేకమైన మొబైల్ యాప్ను తీసుకురానుంది.
14. అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో సావరిన్ గ్రీన్ బాండ్స్ ట్రేడింగ్ కోసం ఆర్‌బీఐ త్వరలో ఓ స్కీమ్ ప్రవేశపెట్టనుంది.
15. యూపీఐ ద్వారా నగదు డిపాజిట్లను అనుమతించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది.
16. ఆర్‌బీఐ స్థాపించి 100 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, రానున్న దశాబ్దం పరివర్తన ప్రయాణం (ట్రాన్సఫర్మేషనల్ జర్నీ) కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆన్లైన్ Vs ఆఫ్లైన్ ఇన్సూరెన్స్- రెండింటిలో ఏది బెటర్? - Online Vs Offline Insurance