Ratan Tata Funeral : పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు యావత్భారతావని కన్నీటి వీడ్కోలు పలికింది. మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించారు. ముంబయి వర్లీలోని శ్మశానవాటికలో అతిరథ మహారథుల సమక్షంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, టాటా గ్రూపు ఉన్నతోద్యోగులు, పారిశ్రామిక వేత్తలు రతన్ టాటాకు తుది వీడ్కోలు పలికారు. కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రతన్ టాటా అంత్యక్రియల్లో పాల్గొన్నారు
నివాళుల్పరించిన ప్రముఖలు
అంతకుముందు ముంబయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్ నుంచి వర్లీ శ్మశానవాటిక వరకు అంతిమ యాత్ర సాగింది. మహనీయుడిని కడసారి చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. రతన్ టాటా అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ప్రజల సందర్శనార్థం గురువారం సాయంత్రం 3:30 గంటల వరకు ఎన్‌సీపీఏ గ్రౌండ్లో రతన్ టాటా భౌతిక కాయాన్ని ఉంచారు. ఆ సమయంలో ప్రజలతో ప్రముఖులు నివాళులు అర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ రతన్ టాటాకు నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముంబయి వెళ్లి నివాళులు అర్పించారు.
VIDEO | Mortal remains of Ratan Tata reach Worli Crematorium for last rites. pic.twitter.com/ZiZbkQs0eP
— Press Trust of India (@PTI_News) October 10, 2024
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ పారిశ్రామిక దిగ్గజానికి పుష్పాంజలి సమర్పించారు. ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ పార్టీ అధినేత శరద్ పవార్ సహా పలువురు నేతలు రతన్ టాటాకు అంజలి ఘటించారు. పారిశ్రామికవేత్తలు సైతం ఎన్‌సీపీఏ మైదానానికి తరలివచ్చి నివాళులు అర్పించారు. ఆదిత్య బిర్లా గ్రూపు అధినేత కుమార మంగళం బిర్లా రతన్ టాటాకు నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ కూడా రతన్ టాటాకు నివాళులు అర్పించారు.
VIDEO | State honours to be accorded to industrialist Ratan Tata, whose mortal remains are being cremated at Worli Crematorium in Mumbai. pic.twitter.com/4qysETpVG5
— Press Trust of India (@PTI_News) October 10, 2024
బుధవారం రాత్రి ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన రతన్ టాటా భౌతిక కాయాన్ని తొలుత కోలాబాలో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. అక్కడ పలువురు ప్రమఖులు, టాటా గ్రూప్ ఉన్నతాధికారులతో సహా మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ కూడా ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. తర్వాత ముంబయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌కు పార్థివ దేహాన్ని తరలించారు. ప్రత్యేకంగా బ్యాండు, కవాతుతో పోలీసులు ఆయన్ను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ క్రమంలో NCPA గ్రౌండ్‌కు దారితీసే మెరైన్ డ్రైవ్ మార్గాన్ని పోలీసులు మూసివేశారు. అంతేకాకుండా ఆ దారిలో భద్రతా బలగాలను మోహరించారు.