Phonepe Indus AppStore Launch : ఫోన్‌పే సంస్థ గూగుల్, యాపిల్ ప్లేస్టోర్లకు పోటీగా ఇండస్ యాప్‌స్టోర్‌ను తీసుకువస్తోంది. ఫిబ్రవరి 21న దిల్లీలో దీనిని లాంఛ్ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారులు, స్టార్టప్ సంస్థలు, పరిశ్రమల ప్రతినిధుల దృష్టిని ఆకర్షించేందుకే ఫోన్‌పే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఫోన్‌పే సంస్థ గతేడాది సెప్టెంబర్ నెలలో ఇండస్ యాప్‌నకు సంబంధించిన డెవలపర్ ప్లాట్‌ఫాం ఆండ్రాయిడ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే యాప్ డెవలపర్ల కోసం ఈ సరికొత్త ఇండస్యాప్ను ఒక సంవత్సరం పాటు ఎలాంటి రుసుము లేకుండా యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆ కాలవ్యవధి పూర్తయ్యాక నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుందని గతంలోనే ఫోన్‌పే స్పష్టం చేసింది.
ఎలాంటి ఛార్జెస్ లేవు!
గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్లు డెవలపర్ల నుంచి రుసుములు, కమీషన్లు వసూలు చేస్తున్నాయి. వీటివల్ల డెవలపర్లపై అధిక ఆర్థిక భారం పడుతోంది. అందుకే వీటికి భిన్నంగా ఫోన్‌పే డెవలపర్ల నుంచి ఎలాంటి రుసుములు వసూలు చేయకూడదని నిశ్చయించుకుంది. అదే గూగుల్ ప్లేస్టోర్‌కు, ఫోన్‌పే ఇండస్స్టోర్కు ఉన్న ప్రధానమైన బేధం.
పేమెంట్ గేట్‌వే
ఫోన్‌పే ఇండస్యాప్ స్టోర్‌లో డెవలపర్లు తమ అప్లికేషన్లలో తమకు ఇష్టమైన చెల్లింపు గేట్వేలను ఏకీకృతం చేసుకునే సౌలభ్యం ఉంటుంది. యాప్ కొనుగోళ్లపై గూగుల్, యాపిల్ స్టోర్లు ప్రస్తుతం 30 శాతం కమీషన్‌ను విధిస్తున్నాయి. దీనిపట్ల డెవలపర్లలో ఎంతో అసంతృప్తి ఉంది. అందుకే ఫోన్‌పే ఈ కమీషన్ల బెడద లేకుండా ఇండస్ యాప్‌స్టోర్‌ను తీసుకువచ్చింది.
ఇండస్ యాప్‌స్టోర్ వెబ్సైట్ ప్రకారం, ఈ స్టోర్‌లో వీడియో ఆధారిత యాప్ డిస్కవరీ లాంటి సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు ఇంగ్లీష్ సహా వివిధ భారతీయ భాషల్లో కస్టమైజ్డ్ టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ ఫోన్‌పే ఇండస్యాప్ కనుక మార్కెట్లోకి వస్తే గూగుల్ ప్లేస్టోర్‌కు, యాపిల్ స్టోర్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
UPI ట్రాన్సాక్షన్స్ లిమిట్ - ఫోన్‌పే, జీపేలో అలా - పేటీఎంలో ఇలా!