How Much Personal Loan Can I Get On My Salary : జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆర్థిక అవసరాలు వస్తాయో ఎవరమూ చెప్పలేము. ఇలాంటప్పుడు అక్కరకు వచ్చేవే వ్యక్తిగత రుణాలు (పర్సనల్ లోన్స్). బ్యాంకులు ఎలాంటి హామీ లేకుండా ఈ లోన్స్ ఇస్తాయి కాబట్టి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కనుక మిగతా రుణాలతో పోలిస్తే, ఈ వ్యక్తిగత రుణాలపై అధిక వడ్డీని వసూలు చేస్తుంటాయి. ప్రస్తుతం చాలా బ్యాంకులు వ్యక్తిగత రుణాలపై 12-18 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి.
వ్యక్తిగత రుణాలు ఎవరికి ఇస్తారు?
బ్యాంకులు సాధారణంగా స్థిరాదాయం లేనివారికి రుణాలు ఇవ్వవు. కానీ మంచి ఉద్యోగం ఉండి, క్రెడిట్ స్కోర్ బాగున్నవాళ్లకు త్వరగా లోన్స్ ఇస్తుంటాయి. పైగా ఇతరులతో పోలిస్తే, తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తాయి. ఇంకా ఏమేమి చూస్తాయంటే?
- నెలవారీ ఆదాయం : బ్యాంకులు, మీకు వచ్చే జీతం లేదా ఆదాయం ఆధారంగా వ్యక్తిగత రుణాలు ఇస్తాయి. మీ జీతం ఎక్కువగా ఉంటే, మీకు ఎక్కువ లోన్ అమౌంట్ ఇస్తాయి. ఒక వేళ మీ జీతం తక్కువగా ఉంటే, అందుకు తగ్గట్టే, తక్కువ మొత్తంలో రుణాలు ఇస్తాయి.
- క్రెడిట్ స్కోర్ : బ్యాంకులు లోన్స్ ఇచ్చే ముందు కచ్చితంగా మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ చాలా బాగుంటే, తక్కువ వడ్డీకే త్వరగా పర్సనల్ లోన్ ఇస్తాయి. ఒక వేళ మీ క్రెడిట్ స్కోర్ మధ్యస్థంగా ఉంటే, కాస్త ఎక్కువ వడ్డీ రేటుకు రుణం మంజూరు చేస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ బాగా తక్కువగా ఉంటే మాత్రం రుణం ఇచ్చే అవకాశం బాగా తగ్గిపోతుంది.
- ఇప్పటికే ఉన్న రుణాలు : ఇది వరకు మీరు తీసుకున్న రుణాలను కూడా బ్యాంకులు పరిశీలిస్తాయి. ఒక వేళ మీ ఆదాయ పరిమితికి మించి రుణాలు చేసి ఉంటే, కొత్త రుణాలు మంజూరు చేయవు. అలాకాకుండా మీకు ఇంకా రుణార్హత ఉంటే, ఆ పరిమితి మేరకే లోన్ ఇస్తాయి. ఉదాహరణకు మీరు ఇది వరకే రూ.5 లక్షలు రుణం తీసుకున్నారని అనుకుందాం. కానీ మీకు వచ్చే ఆదాయం ప్రకారం, మీకు రూ.16 లక్షలు రుణం పొందే అర్హత ఉంది. అప్పుడు బ్యాంకులు మీకు కొత్తగా రూ.11 లక్షల వరకు వ్యక్తిగత రుణం ఇస్తాయి.
- లోన్ క్యాప్ : బ్యాంకులు ఇచ్చే వ్యక్తిగత రుణాలకు ఒక పరిమితి అంటూ ఉంటుంది. దీని 'క్యాప్ ఆన్ లోన్' అని అంటారు. ఉదాహరణకు ఒక బ్యాంకు రూ.20 లక్షల వరకు మాత్రమే వ్యక్తిగత రుణాలు ఇస్తుంది. మరో బ్యాంకు రూ.40 లక్షల వరకు పర్సనల్ లోన్ ఇస్తుంటుంది. కనుక బ్యాంకులను బట్టి పర్సనల్ లోన్ గరిష్ఠ మొత్తం ఆధారపడి ఉంటుంది.
ఎంత ఆదాయానికి - ఎంత లోన్?
భారతదేశంలోని బ్యాంకులు సాధారణంగా ఒక వ్యక్తి ఆదాయానికి 20 నుంచి 30 రెట్లు వరకు వ్యక్తిగత రుణాలు ఇస్తాయి. ఉదాహరణకు మీ ఆదాయం నెలకు రూ.1 లక్ష అనుకుంటే, మీకు రూ.20 లక్షలు - రూ.30 లక్షల వరకు పర్సనల్ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆదాయం, రుణ నిష్పత్తి అనేది బ్యాంకులను బట్టి మారిపోతూ ఉంటుంది.
నెలవారీ ఆదాయం (జీతం) | వ్యక్తిగత రుణం |
రూ.25,000 | రూ.5 లక్షలు |
రూ.50,000 | రూ.10 లక్షలు |
రూ.75,000 | రూ.15 లక్షలు |
రూ.1 లక్ష | రూ.20 లక్షలు |
రూ.1.25 లక్షలు | రూ.25 లక్షలు |
రూ.1.5 లక్షలు | రూ.30 లక్షలు |
రూ.1.75 లక్షలు | రూ.35 లక్షలు |
రూ.2 లక్షలు | రూ.40 లక్షలు |
నోట్ : ఇక్కడ ఇచ్చిన వివరాలు కేవలం రఫ్ లెక్కలు మాత్రమే. మీ ఆదాయం, బ్యాంకు, ఇతర నిబంధనలు, అంశాలు ఆధారంగా ఈ రుణ మొత్తాలు మారిపోతూ ఉంటాయి.
పర్సనల్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్! - PERSONAL LOAN TIPS
పర్సనల్ లోన్ Vs ఓవర్ డ్రాఫ్ట్ - వీటిలో ఏది బెటర్ ఆప్షన్! - Personal Loan Vs Overdraft