Personal Loan Vs Overdraft : డబ్బులు అవసరమైనప్పుడు కొందరు పర్సనల్ లోన్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ వంటి క్రెడిట్ ఆప్షన్స్‌ను ఎంచుకుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది తెలుసుకోవాలంటే మీకు ఎంత కాలానికి డబ్బులు అవసరం? రుణ దాతలు ఎంత వడ్డీ వసూలు చేస్తున్నారు? మీరు ఎలా తిరిగి చెల్లిస్తారు? అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓవర్ డ్రాఫ్ట్, పర్సనల్ లోన్ అంటే ఏమిటి? వాటి మధ్య ఉన్న తేడాలు, రెండింటిలో ఏది ఎంచుకుంటే బెటర్? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏమిటి?
ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఒక నిర్ణీత సమయానికి, నిర్ధిష్ట వడ్డీ రేటుతో బ్యాంకులు కల్పించే క్రెడిట్ లైన్. మీకు బ్యాంక్ అకౌంట్లో సరిపడేంత డబ్బులు లేకపోయినా, మీకు అప్రూవ్ అయిన లిమిట్ నుంచి, మీకు నచ్చినంత డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ అవసరాన్ని బట్టి డబ్బులు వాడుకోవచ్చు. అలాగే తిరిగి చెల్లించే విధానంలోనూ మీకు వెసులుబాట్లు ఉంటాయి. మీరు తీసుకున్న డబ్బుకు మాత్రమే వడ్డీ అనేది ఉంటుంది. ముందస్తుగా చెల్లిస్తే ఎలాంటి పెనాల్టీలు, అదనపు రుసుములు ఉండవు.
పర్సనల్ లోన్ అంటే ఏమిటి?
పర్సనల్ లోన్ అనేది ఒక అసురక్షిత రుణం. అంటే ఎలాంటి తనఖా లేకుండా బ్యాంకులు ఒక నిర్ధిష్టమైన కాలానికి, స్థిరమైన వడ్డీ రేటుతో రుణాలు ఇస్తాయి. ప్రతి నెలా ఈఎంఐల ద్వారా వీటిని తిరిగి చెల్లించవచ్చు. అయితే, ఈఎంఐల విషయంలో పెద్దగా ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ముందుగా నిర్ణయించిన సమయానికి, నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ముందస్తుగా మొత్తం రుణం చెల్లించాలనుకుంటే బ్యాంకులు అదనపు రుసుములు వసూలు చేస్తాయి. అలాగే మీరు ఎంత వినియోగించుకున్నారనే దానితో సంబంధం లేకుండా మొత్తం నగదు పై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
పర్సనల్ లోన్ పొందాలంటే డాక్యుమెంటేషన్ అవసరం. ఈ రుణాలు అంత త్వరగా మంజూరు కావు. క్రెడిట్ స్కోర్ లేకుంటే అసలు రుణమే ఇవ్వకపోవచ్చు కూడా. పర్సనల్ లోన్ కోసం గత ఆరు నెలల ఆదాయ పత్రాలు, మునుపటి 3 నెలల ఐటీఆర్, కేవైసీ వివరాలు వంటి వివిధ పత్రాలు అవసరం. ఈ పత్రాలు అన్నీ ఉన్నాగానీ, లోన్ ఇస్తారని కచ్చితంగా చెప్పలేం.
అదే ఓవర్ డ్రాఫ్ట్ ఎలిబిలిటీ ఉంటే, తక్షణమే ఫండ్ యాక్సెస్‌ను పొందవచ్చు. ఒకసారి ఓవర్ డ్రాఫ్ట్ ఎలిజిబిలిటీ వస్తే, ప్రతిసారీ మీరు లోన్ అర్హతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే రీపేమెంట్ సకాలంలో చేయకపోతే, బ్యాంకు మీకు ఇచ్చిన ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది.
ఏది బెస్ట్ ఆప్షన్?
పర్సనల్ లోన్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ల్లో ఏది ఎంచుకోవాలనేది మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. అవసరమైన డబ్బు, వడ్డీ రేట్లు, ఈఎంఐలపై ఆధారపడి ఉంటుంది. మంచి జీతం పొందే వ్యక్తులకు వ్యక్తిగత రుణాలు బాగుంటాయి. ఓవర్ డ్రాఫ్ట్ లోన్లకు అధిక వడ్డీ రేట్లు ఉన్నప్పటికీ ఫ్లెక్సిబిలిటీగా, మీకు అవసరమైన నిధులు వెంటనే దొరుకుతాయి. కాబట్టి మీరు ఏది ఎంచుకున్నా జాగ్రత్తగా ఉండండి. మీ నిజమైన అవసరాల కోసం మాత్రమే రుణం తీసుకోండి.
త్వరలో విడుదల కానున్న టాప్-8 బైక్స్ & స్కూటీస్ ఇవే! - Upcoming Bikes