Top 5 Pension Plans In India : జీవితాంతం కష్టపడి పనిచేసిన వాళ్లు వృద్ధాప్యంలోనైనా ప్రశాంతంగా జీవితం గడపాలని ఆశిస్తారు. అయితే వయస్సు మళ్లిన తరువాత లేదా రిటైర్మెంట్ తర్వాత ఆదాయం ఎలా అనే బెంగ చాలా మందికి ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రశాంత జీవనం గడిపేందుకు, నెలనెలా పెన్షన్ అందించే ప్రభుత్వ పథకాలు చాలానే ఉన్నాయి. ఈ పథకాల్లో చిన్న వయస్సు నుంచే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించడం ఉత్తమం. ఇవి మీకు భవిష్యత్‌లో ఆర్థిక భరోసా కల్పిస్తాయి. అందుకే నెలవారీ పెన్షన్‌ను అందించే టాప్-5 స్కీమ్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. అటల్ పెన్షన్ యోజన
అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం, అల్పాదాయ వర్గానికి చెందిన ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించాలన్న లక్ష్యంతో కేంద్రం అటల్ పెన్షన్ యోజనను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టి వృద్ధాప్యంలో నెలనెలా పెన్షన్ అందుకోవచ్చు. 18-40 ఏళ్ల వయసున్న వారు ఈ పథకంలో చేరొచ్చు. 60 సంవత్సరాలు వచ్చే వరకు నెలవారీగా కొంత జమ చేస్తూ ఉండాలి. మీ పెట్టుబడిని బట్టి 60 ఏళ్ల తర్వాత కనీసం రూ.1000 నుంచి రూ.5 వేల వరకు ప్రతి నెలా పెన్షన్ అందుతుంది.
2. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)
నెలవారీ పెన్షన్ పొందేందుకు మరో బెస్ట్ స్కీమ్ 'నేషనల్ పెన్షన్ సిస్టమ్'(NPS). దీంట్లో చేరిన వారు 60 ఏళ్లు వచ్చే వరకు ఇన్వెస్ట్ చేయాలి. అత్యవసర సమయాల్లో 60 శాతం వరకు డబ్బులు తీసుకోవచ్చు. మిగతాది యాన్యుటీకి వెళ్తుంది. దీనిని పెన్షన్ రూపంలో అందుకోవచ్చు. యాన్యుటీ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ పెన్షన్ వస్తుంది. 18-70 వయస్సున్న ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు.
3. సిస్టమేటిక్ విత్ డ్రావెల్ ప్లాన్ (SWP)
మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలంపాటు పెట్టుబడులు పెడితే, పదవీ విరమణ నాటికి చాలా పెద్దమొత్తంలో కార్పస్ (నిధి) ఏర్పడుతుంది. దీనిని పూర్తిగా విత్‌డ్రా చేసుకోకుండా, అలానే కొనసాగిస్తే, మీ ఆదాయం మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే, మ్యూచువల్ ఫండ్స్‌లో కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది బాగా పనిచేస్తుంది. ఇలా మీరు పెట్టుబడి పెట్టిన మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి కార్పస్ క్రియేట్ అయిన తరువాత, సిస్టమాటిక్ విత్డ్రావెల్ ప్లాన్ ఉపయోగించి, రెగ్యులర్‌గా ఆదాయం సంపాదించవచ్చు. పైగా పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. అది ఎలా అంటే? మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ నుంచి ప్రతినెలా లేదా త్రైమాసికం లేదా ఏడాదికి ఒకసారి నిర్దిష్ట శాతాన్ని లేదా నిర్దిష్ట మొత్తాన్ని (Fixed Amount) విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనినే సిస్టమాటిక్ విత్డ్రావెల్ ప్లాన్ అంటారు. దీని వల్ల మీకు రెగ్యులర్‌గా రాబడి వస్తుంది.
4. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)
నెలవారీగా జీతాలు అందుకుంటూ 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్'లో రిజిస్టర్ అయిన ఉద్యోగులకు రిటైర్ అయిన తరువాత మంచి ఆదాయం వస్తుంది. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఇది ఆర్థిక, సామాజిక భద్రత కల్పిస్తుందని చెప్పొచ్చు. కనీసం వరుసగా 10 సంవత్సరాల పాటు ఈ స్కీమ్‌లో డబ్బులు జమ చేస్తేనే పెన్షన్ వస్తుంది. మీ పెట్టుబడుల్ని బట్టి పెన్షన్ వస్తుంది.
5. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS)
రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా ఆదాయం అందుకునేందుకు పోస్టాఫీస్ ఆఫర్ చేస్తున్న పథకమే POMIS. దీంట్లో సింగిల్, జాయింట్ అకౌంట్ తెరవొచ్చు. సింగిల్ అకౌంట్ కింద గరిష్ఠంగా రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్ కింద గరిష్ఠంగా రూ.15 లక్షలు వరకు డిపాజిట్ చేయొచ్చు. దీంట్లో ప్రస్తుతం 7.40 శాతం వడ్డీ రేటు ఉంది. డిపాజిట్ గడువు ఐదేళ్లు. అకౌంట్ తెరిచినప్పటి నుంచి వడ్డీ అందుకుంటారు. ఉమ్మడి ఖాతాపై గరిష్ఠంగా నెలకు రూ.9250 చొప్పున పెన్షన్ పొందవచ్చు.