Paytm Payment Bank Chairman Resigns : పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) ఛైర్మన్ పదవికి సోమవారం రాజీనామా చేశారు. బోర్డు సభ్యత్వం నుంచీ ఆయన వైదొలిగారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో విజయ్ శేఖర్ శర్మ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే డిపాజిట్లను, క్రెడిట్ లావాదేవీలను నిలిపివేయాలని పేటీఎంకు ఆర్‌బీఐ కోరింది. ఫాస్టాగ్‌లను మార్చి 15 తర్వాత రీఛార్జ్ చేయడానికి కుదరదు. అందులో నగదు పూర్తయ్యే వరకే వినియోగించే వెసులుబాటు కల్పించింది.
Vijay Shekhar Sharma Resigns :
మరోవైపు పీపీబీఎల్ బోర్డు పునర్నిర్మాణం కూడా పూర్తయినట్లు పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్ లిమిటెడ్ తెలిపింది. బోర్డు డైరెక్టర్లుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్‌కుమార్, విశ్రాంత ఐఏఎస్ అధికారి దేవేంద్రనాథ్ సారంగి, మాజీ ఐఏఎస్ రజినీ సెఖ్రీ సిబల్ నియమితులైనట్లు వెల్లడించింది. త్వరలోనే బోర్డు కొత్త ఛైర్మన్ ఎంపిక ప్రక్రియను పీపీబీఎల్ ప్రారంభించనుందని పేర్కొంది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఉద్యోగి ఆత్మహత్య
Paytm Employee Suicide : మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన గౌరవ్ గుప్తా అనే వ్యక్తి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ఉద్యోగం పోతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం పోతుందనే ఒత్తిడి కారణంగా గౌరవ్ గుప్తా బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు సోమవారం తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. 'గౌరవ్ గుప్తా ఆదివారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.' అని చెప్పారు.
పేటీఎంపై ఆర్‌బీఐ ఆంక్షలు
ఎవరైతే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలు, ఫాస్టాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులు (ఎన్సీఎమ్సీ) వాడుతున్నారో వారు మార్చి 15లోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. అంతకుముందు ఈ ఫిబ్రవరి 29 వరకు గడువు విధించింది. తర్వాత దాన్ని మార్చి 15కు పొడిగించింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.