Sam Altman Pledges To Donate Wealth : ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ 'ఓపెన్‌ఏఐ' సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు. తాజాగా బిలియనీర్ల జాబితాలో చేరిన ఆయన, తన మొత్తం సంపదలో సగానికి పైగా సమాజానికే తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించారు. తన భాగస్వామి ఆలివర్ మల్హెరిన్‌తో కలిసి 'ది గివింగ్ ప్లెడ్జ్' దాతృత్వ కార్యక్రమంపై ఆయన సంతకం చేశారు.
నవ సమాజ నిర్మాణం కోసం
'నవ సమాజ నిర్మాణం కోసం ఎంతో మంది గొప్ప వ్యక్తులు కృషి చేశారు. ఈ ప్రపంచాన్ని మెరగుపరిచేందుకు వాళ్లు అంకితభావంతో చేసిన కృషి; వాళ్ల దాతృత్వం లేకుంటే మేం ఈ స్థాయిలో ఉండేవాళ్లం కాదు. అందుకే మా సంపదలో సగానికి పైగా తిరిగి సమాజానికే తిరిగి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నాం' అని శామ్ ఆల్ట్‌మన్ అన్నారు. తమ ప్రయాణంలో తోడుగా ఉండి, అండగా నిలిచిన ప్రతీ వ్యక్తికి ఆల్ట్‌మాన్, ముల్హెరిన్లు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే, సమాజ పురోగతికి అవసరమయ్యే సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తూ, తమ దాతృత్వాన్ని కొనసాగించడంపై దృష్టి కేంద్రీకరిస్తామని శామ్ ఆల్ట్మెన్ తెలిపారు.
ఓపెన్ఏఐలో ఎలాంటి వాటా లేదు!
ఓపెన్‌ఏఐ సంస్థకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ, ఆ కంపెనీలో తనకు ఎలాంటి వాటా లేదని ఆల్ట్‌మన్ ఇది వరకే ప్రకటించారు. రెడ్డిట్, స్ట్రైప్ మొదలైన పలు టెక్ కంపెనీలలో ఆయనకు వాటాలు ఉన్నాయి. అలాగే అణుశక్తి, బయోటెక్నాలజీ, రియల్ ఎస్టేట్ వెంచర్‌లతో సహా, పలు విభిన్నమైన వ్యాపారాల్లో కూడా ఆయనకు పెట్టుబడులు ఉన్నాయి.
డబ్బున్న వాళ్లు ధర్మం చేయాల్సిందే!
బిల్ గేట్స్, మెలిండా గేట్స్, వారెన్ బఫెట్లు కలిసి 'ది గివింగ్ ప్లెడ్జ్' (THE GIVING PLEDGE) సంస్థను స్థాపించారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన వ్యక్తులు, తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని స్వచ్ఛందసేవకు అందించేలా ఇది ప్రోత్సహిస్తుంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, మెటా అధిపతి మార్క్ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిస్సిల్లా చాన్, అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత మెకెంజీ స్కాట్, ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ రీడ్ హాఫ్‌మన్, సేల్స్‌ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్, ఒరాకిల్ సీటీఓ లారీ ఎల్లిసన్ సహా అనేక మంది ఐశ్వర్యవంతులు ఇందులో భాగస్వాములయ్యారు.