Nvidia Briefly Overtook Apple : ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఎన్వీడియా, శుక్రవారం నాడు యాపిల్ కంపెనీని తాత్కాలికంగా అధిగమించింది. 3.53 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో, ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. దీనితో యాపిల్ కంపెనీ 3.52 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యూతో తాత్కాలికంగా రెండో స్థానానికి పడిపోయింది. రాయిటర్స్ ప్రకారం, యూఎస్ స్టాక్ మార్కెట్లో ఎన్వీడియా షేర్లు రికార్డ్ లాభాలు సంపాదించడమే ఇందుకు కారణం. అయితే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి ఎన్వీడియా మార్కెట్ వాల్యూ 3.47 ట్రిలియన్ డాలర్లకు దిగజారింది. దీనితో యాపిల్ కంపెనీ 3.52 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యూతో తిరిగి అగ్రస్థానాన్ని చేరుకుంది.
శుక్రవారం యూఎస్ స్టాక్ మార్కెట్లో ఎన్వీడియా షేర్లు 0.8 శాతం మేర లాభపడ్డాయి. యాపిల్ షేర్లు 0.4 శాతం, మైక్రోసాఫ్ట్ షేర్లు 0.8 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం 3.18 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యూతో మైక్రోసాఫ్ట్ కంపెనీ మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఇదే ఫస్ట్ టైమ్ కాదు!
ఎన్వీడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించడం ఇదే మొదటిసారి కాదు. జూన్ నెలలో కూడా మైక్రోసాఫ్ట్, యాపిల్ కంపెనీలను ఇది తాత్కాలికంగా అధిగమించింది. వాస్తవానికి గత కొన్ని నెలలుగా ఈ మూడు టెక్ దిగ్గజాలు మార్కెట్ క్యాపిటలైజేషన్ రేసులో పోటాపోటీగా తలపడుతున్నాయి. అయితే అక్టోబర్ నెలలోనే ఎన్వీడియా కంపెనీ షేర్లు సుమారు 18 శాతం మేర లాభపడడం గమనార్హం.
ఎన్వీడియా సక్సెస్ సీక్రెట్
ఎన్వీడియా వీడియో గేమ్‌లు కోసం ప్రత్యేకంగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (GPU)లను తయారు చేస్తుంది. అంతేకాదు ఏఐ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లను తయారు చేస్తూ మిగతా టెక్ కంపెనీలకు గట్టి సవాలు విసురుతోంది. టెక్ సేవల రంగంలోనూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఏఐ చిప్ లీడింగ్ సప్లయిర్‌గా వెలుగొందుతోంది.
రిలయన్స్‌తో భాగస్వామ్యం
ఇటీవలే భారతదేశంలో ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో ఎన్వీడియా భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ఇండియాలో జరిగిన ఈ కంపెనీల మొదటి ఏఐ సమ్మిట్‌లో ఎన్వీడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, రిలయన్స్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ పాల్గొన్నారు. భారత్‌లో కంప్యూటర్ ఇంజినీర్లు, విస్తారమైన డేటా వనరులు, కస్టమర్ల సంఖ్య భారీ ఉన్న నేపథ్యంలో, ఇక్కడ ఏఐ రంగం అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.