NPS Vatsalya Scheme : తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలకు మంచి ఆర్థిక భవిష్యత్ ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం తమకు వీలైనంత సొమ్మును పొదుపు, మదుపు చేస్తుంటారు. మరి మీరు కూడా మీ పిల్లల కోసం పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే.
మోదీ 3.0 ప్రభుత్వం 'ఎన్‌పీఎస్ వాత్సల్య' పేరిట ఫ్లాగ్‌షిప్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. వాస్తవానికి రెగ్యులర్ 'నేషనల్ పెన్షన్ స్కీమ్'కు దీనిని ఒక ఎక్స్‌టెన్షన్‌గా తీసుకువచ్చింది. పిల్లలకు మంచి ఆర్థిక భవిష్యత్ కల్పించాలని ఆశించే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడులు పెట్టవచ్చు. 18 నుంచి 70 ఏళ్లలోపు ఉన్న భారతీయ పౌరులు అందరూ ఈ సేవింగ్స్ కమ్ రిటైర్‌మెంట్ స్కీమ్‌లో తమ పిల్లల పేరు మీద మదుపు చేయవచ్చు.
'ఎన్‌పీఎస్'లానే, ఎన్‌పీఎస్ వాత్సల్య పథకాన్ని కూడా 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ' (పీఎఫ్ఆర్‌డీఏ)యే నిర్వహిస్తుంది. ఈ స్కీమ్ ప్రత్యేకంగా పిల్లల కోసం, మైనర్ల కోసం రూపొందించారు. కనుక తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ పిల్లల పేరిట ఈ పథకంలో పెట్టుబడులు పెట్టవచ్చు.
ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్ వివరాలు
- ఎన్‌పీఎస్ వాత్సల్య పథకంలో సంవత్సరానికి కనిష్ఠంగా రూ.1000 పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠ మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు. అందువల్ల తల్లిదండ్రులు తమ ఆర్థిక స్తోమతకు తగినట్లుగా దీనిలో ఇన్వెస్ట్ చేయవచ్చు.
- మైనర్లు లేదా 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లల కోసం ఈ పథకంలో పెట్టుబడులు పెట్టాలంటే, తల్లిదండ్రులు లేదా సంరక్షకులు కచ్చితంగా తమ పేరుతో కేవైసీ (నో యువర్ కస్టమర్) పూర్తి చేయాల్సి ఉంటుంది.
- మీరు కావాలని అనుకుంటే మీ పిల్లల వయస్సు 18 ఏళ్లు దాటిన తరువాత ఈ స్కీమ్ నుంచి ఎగ్జిట్ కావచ్చు. కానీ ఇక్కడ ఒక షరతు ఉంది. మీకు వచ్చిన డబ్బులో 20 శాతాన్ని మాత్రమే వెనక్కు తీసుకోవచ్చు. మిగతా 80 శాతం డబ్బును కచ్చితంగా ఒక యాన్యుటీ ప్లాన్‌లో రీ-ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
- మీ పిల్లలకు 18 ఏళ్లు దాటక ముందు కూడా ఈ స్కీమ్ నుంచి విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇందుకు కూడా కొన్ని షరతులు ఉన్నాయి. ఈ స్కీమ్‌లో చేరి, మూడేళ్లు గడచిన తరువాత, అప్పటి వరకు మీరు కట్టిన డబ్బులో 25 శాతాన్ని వెనక్కు తీసుకోవచ్చు. ఈ విధంగా మీ పిల్లలకు 18 ఏళ్లు వచ్చే లోపు 3 సార్లు డబ్బులు వెనక్కు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. మీ పిల్లల చదువుల కోసం, వైద్య ఖర్చుల కోసం ఈ డబ్బులు వాడుకోవచ్చు.
- పీఎఫ్ఆర్‌డీఏ నిబంధనల ప్రకారం, పిల్లలు 75 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యానికి గురైనప్పుడు కూడా ఈ పథకం నుంచి డబ్బులు తీసుకోవచ్చు.
18 ఏళ్లు దాటిన తరువాత
మీ పిల్లల వయస్సు 18 ఏళ్లు దాటిన తరువాత ఈ ఎన్‌పీఎస్ వాత్సల్య అనేది రెగ్యులర్ ఎన్‌పీఎస్ స్కీమ్‌గా మారిపోతుంది. కనుక మీ పిల్లలు తమకు 18 ఏళ్లు దాటిన మూడు నెలల్లోపు కేవీసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ పిల్లలు కావాలనుకుంటే అప్పటి వరకు కట్టిన డబ్బుల్లో 20 శాతాన్ని వెనక్కు తీసుకోవచ్చు. మిగతా 80 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లోనే కొనసాగించాలి. ఒక వేళ మీ మొత్తం కార్పస్ రూ.2.5 లక్షలలోపే ఉంటే, అప్పుడు ఆ మొత్తం డబ్బును వెనక్కు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఎన్‌పీఎస్ వాత్సల్య బెనిఫిట్స్
ఉదాహరణకు అప్పుడే పుట్టిన బిడ్డ పేరు మీదుగా తల్లిదండ్రులు ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్‌లో నెలకు రూ.1000 చొప్పున డబ్బులు పెట్టారని అనుకుందాం. 18 ఏళ్ల తరువాత ఆ బిడ్డకు ఎంత డబ్బు వస్తుందంటే?
- సంవత్సరానికి వచ్చే వడ్డీ - 12.86 శాతం (హిస్టారికల్ యావరేజ్ రేటు ప్రకారం) అనుకుంటే,
- మొత్తం పెట్టుబడి - (12 నెలలు X రూ.1000 X 18 సంవత్సరాలు) - రూ.2,16,000
- మొత్తం వడ్డీ - రూ.6,32,718
- మొత్తం కార్పస్ (నిధి) - రూ.8,48,000
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ మొత్తం డబ్బులో మీరు 20 శాతాన్ని (రూ.1,69,600) మాత్రమే మీరు విత్‌డ్రా చేసుకోగలుగుతారు. మిగతా 80 శాతాన్ని (రూ.6,78,400) ఒక యాన్యుటీ స్కీమ్‌లో రీ-ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మీరు రిటైర్ అయ్యేటప్పుడు పెద్ద మొత్తంలో రిటర్న్ వస్తుంది.
ఇలా చేస్తే రూ.11 కోట్లు గ్యారెంటీ!
మీరు కనుక సంవత్సరానికి రూ.10,000 చొప్పున మీ పిల్లల పేరు మీద ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. రేట్ ఆఫ్ రిటర్న్ 12.86 శాతం చొప్పున లెక్కవేస్తే, మీ పిల్లలకు 60 ఏళ్లు వచ్చే నాటికి ఏకంగా రూ.11.05 కోట్లు లభిస్తాయి.
నోట్ : ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు ఎంచుకున్న యాన్యుటీ ప్లాన్‌ను బట్టి ఈక్విటీల్లో, గవర్నమెంట్ సెక్యూరిటీల్లో మీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. వాటి పెర్ఫార్మెన్స్ బట్టి మీకు వచ్చే రిటర్నులు ఆధారపడి ఉంటాయి.
నెలకు రూ.1 లక్ష పెన్షన్ కావాలా? ఈ ప్రభుత్వ పథకంపై ఓ లుక్కేయండి! - NPS Pension