No Salaries To BYJUs Employees : ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉందని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు రవీంద్రన్ వెల్లడించారు. షేర్ హోల్డర్లతో విభేదాల నేపథ్యంలో రైట్స్ ఇష్యూ నిధులు సెపరేట్ ఖాతాలో లాక్ అయ్యాయని, అందుకని సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నామని ఆయన చెప్పారు. కొందరు ఇన్వెస్టర్లు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని రవీంద్రన్ ఆవేదన వ్యక్తం చేశారు.
మార్చి 10లోగా జీతాలు
'నెల రోజుల క్రితం ప్రారంభించిన రైట్స్ ఇష్యూను విజయవంతంగా మూసివేయగలిగాం. ఇది సంతోషకరమైన పరిణామం. అన్నింటికంటే ముఖ్యంగా ముందుగా స్వల్పకాలిక అవసరాలతో పాటు ఉన్న అప్పులను క్లియర్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వీటికి సరిపడా ఫండ్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. చట్టం ప్రకారం ఈ చెల్లింపులను అన్నింటినీ మేము చెల్లిస్తాం. ఈ క్రమంలో ఇప్పటికీ మీకు జీతాలు చెల్లించలేకపోతున్నందుకు చింతిస్తున్నాను' అని సిబ్బందిని ఉద్దేశించి శనివారం రాసిన ఓ లేఖలో రవీంద్రన్ వివరించారు. అయితే ఈ నెల 10లోగా స్టాఫ్‌కు జీతాలు చెల్లించేలా కంపెనీ కృషి చేస్తోందని ఆయన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా, గత నెలలో కంపెనీ మూలధన కొరత కారణంగా ప్రతికూల సవాళ్లను ఎదుర్కొందని, ఇప్పుడు తమ వద్ద నిధులు ఉన్నప్పటికీ స్టాఫ్ శాలరీల విషయంలో జాప్యం జరుగుతోందని రవీంద్రన్ తన లేఖలో చెప్పుకొచ్చారు. మరోవైపు, 200 మిలియన్ల అమెరికా డాలర్ల విలువ గల హక్కుల ఇష్యూ ముగింపు తేదీని పొడిగించడాన్ని పరిశీలించాలని ఎడ్‌టెక్ సంస్థను కంపెనీ లా కోర్టు ఈ వారం ప్రారంభంలో కోరింది. తదుపరి విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది.
"దురదృష్టవశాత్తు, 150కి పైగా మదుపరుల్లో నలుగురు అత్యంత దీనస్థితికి దిగజారారు. వారికి అర్థం చేసుకునే మనసు లేదు. ఇప్పటికే వీరు కంపెనీ నుంచి గణనీయమైన లాభాలను ఆర్జించారు. అయినప్పటికీ ఇలా ప్రవర్తించడం చాలా బాధాకరం. ఇతరుల జీవీతాలను, జీవనోపాధిని పట్టించుకునే పరిస్థితుల్లో వారు లేరు. వారు (ఇన్వెస్టర్లు) కష్టపడి సంపాదించిన సొమ్మును కంపెనీ చెల్లించడానికి సిద్ధంగా ఉంది. ఇందుకోసం సేకరించిన నిధులను ప్రస్తుతం పలు కారణాలతో వినియోగించుకోలేకపోతున్నాం."
- రవీంద్రన్, బైజూస్ వ్యవస్థాపకుడు
బైజూస్ రవీంద్రన్‌కు షాక్- CEOగా తొలగిస్తూ షేర్ హోలర్డ నిర్ణయం
'దేశాన్ని విడిచి వెళ్లనీయొద్దు' బైజూస్ రవీంద్రన్‌పై ఈడీ లుక్ అవుట్ నోటీసులు