Mukesh Ambani One Hour Income : భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయిన ముకేశ్ అంబానీ గురించి తెలియని విద్యాధికులు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. ఆసియాలోని అత్యంత ధనవంతుడైన వ్యక్తిగా, ప్రపంచంలోనే 11వ అత్యంత ఐశ్వర్యవంతుడిగా ముకేశ్ అంబానీ కొనసాగుతున్నారు. ఆయన సంపద 106 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో చెప్పుకోవాలంటే సుమారుగా రూ.9,15,405 కోట్లు.
గంటకు రూ.90 కోట్ల సంపాదన!
ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా ప్రకారం, 2020లో ముకేశ్ అంబానీ ఒక గంటకు సుమారుగా రూ.90 కోట్లు సంపాదిస్తున్నారు. ఆక్స్ఫామ్ రిపోర్ట్ కూడా ఇదే విషయాన్ని బలపరుస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, 2020లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. అందువల్ల భారతదేశమంతా లాక్డౌన్ విధించారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ ముకేశ్ అంబానీ గంటకు రూ.90 కోట్లు చొప్పున సంపాదించగలిగారు. కానీ దేశంలోని దాదాపు 24 శాతం మంది ప్రజలు నెలకు కేవలం రూ.3000 మాత్రమే సంపాదించగలుగుతున్నారు.
కోటి సంవత్సరాలైనా సంపాదించగలమా!
స్టాటిస్టికా ప్రకారం, ముకేశ్ అంబానీ ఒక గంటకు సంపాదిస్తున్నంత డబ్బును, ఒక సగటు భారతీయుడు సంపాదించాలంటే, కనీసం 17.4 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, సంవత్సరానికి రూ.4 లక్షలు (నెలకు సుమారుగా రూ.33వేలు) సంపాదించే వ్యక్తి రూ.90 కోట్లు సంపాదించాలంటే, సుమారుగా 1.74 కోట్ల సంవత్సరాలు పడుతుంది.
ఒక మనిషి వందేళ్లకు మించి బతకడమే కష్టం. అలాంటిది ఎవరైనా కోటి సంవత్సరాలు కష్టపడి డబ్బు సంపాదించగలరా? సింపుల్గా చెప్పాలంటే, ఒక సామాన్యుడు కలలో కూడా సంపాదించలేనంత డబ్బులు ముకేశ్ అంబానీ సంపాదిస్తున్నారు.
ముకేశ్ అంబానీ జీతం ఎంతో తెలుసా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ముకేశ్ అంబానీ స్వయంగా తన యాన్యువల్ సాలరీని రూ.15 కోట్లకు మాత్రమే పరిమితం చేసుకున్నారు. ఆయన ఒక రోజులో సంపాదిస్తున్న డబ్బుతో పోల్చితే ఇది ఏమాత్రం చెప్పండి!
ఈ భారతీయ వ్యాపార దిగ్గజం పెట్రో కెమికల్స్, రిఫైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్, టెక్స్టైల్స్, రిటైల్, టెలికమ్యునికేషన్స్ లాంటి పలు విధాలైన బిజినెస్లు చేస్తున్నారు. వీటన్నింటి ద్వారా ఆయనకు భారీగా ఆదాయం వస్తోంది. ఇవి కాకుండా ముకేశ్ అంబానీ వద్ద రియల్ ఎస్టేట్ ఆస్తులు కూడా భారీగా ఉన్నాయి. దక్షిణ ముంబయిలోని ఆయన నివాస భవనం యాంటిలియా ఒక్కటే సుమారుగా రూ.15,000 కోట్లు ఉంటుంది.
ముకేశ్ అంబానీ కార్ కలెక్షన్ చూశారా? చూస్తే మతిపోవాల్సిందే! - Mukesh Ambani Car Collection