Mistakes Avoid In Health Insurance : ఈ రోజుల్లో ఏదైనా అనారోగ్య కారణాల వల్ల ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలనుకుంటే.. జేబులు ఖాళీ అవ్వాల్సిందే. అంతలా వైద్య ఖర్చులు పెరిగిపోయాయి. అందుకే.. చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఇది కుటుంబానికి రక్షగా ఉంటుందనే స్పృహ అందరిలోనూ పెరుగుతోంది. అయితే.. ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిపుణుడిని సంప్రదించాలి..
చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్ విషయాలపై అంతగా అవగాహన ఉండకపోవచ్చు. ఒకవేళ మీకు ఆరోగ్య బీమా తీసుకోవాలని అనిపిస్తే వెంటనే దీనికి సంబంధించి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మీ మిత్రుడిని లేదా ఏజెంట్ల సహాయం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన బడ్జెట్‌కు అందుబాటులో ఉండే పాలసీలను తీసుకునే అవకాశం ఉంటుంది.
పాలసీని రెన్యూవల్ చేసుకోవాలి..
ఒకవేళ మీరు గతంలోనే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నట్లయితే.. ఎప్పటికప్పుడు ఆ పాలసీని రెన్యూవల్ చేసుకోవాలి. పాలసీ గడువు ముగిసిపోతే మీరు ఎలాంటి సేవలూ పొందే అవకాశం ఉండదు. అదే సమయంలో రెన్యూవల్ చేసుకునేటప్పుడే.. మీ పాలసీ కవరేజీలో ఏవైనా మార్పులు ఉంటే సరిచేసుకుంటూ ఉండండి.
ఎక్కువ ఆస్పత్రులలో సేవలు ఉండేలా..
ఎక్కువ ఆస్పత్రుల్లో సేవలు అందించే ఇన్సూరెన్స్ కంపెనీని ఎంపిక చేసుకోండి. దీనివల్ల మీకు ఏవైనా అత్యవసర సమయాల్లో సేవలు కావాలనుకుంటే దగ్గర్లో ఉన్న ఆసుపత్రులకు వెళ్లొచ్చు. ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అలా కాకుండా.. తక్కువ ఆసుపత్రుల్లో సేవలు ఉన్న బీమా కంపెనీతో అయితే ఇబ్బంది పడాల్సి రావొచ్చు.
త్వరగా తీసుకోండి..
మనలో చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వృద్ధాప్యంలో తీసుకుంటేనే మంచిది అని ఆలోచిస్తుంటారు. కానీ.. ఇలాంటి ఆలోచన మంచిది కాదని నిపుణులంటున్నారు. తక్కువ వయసులోనే బీమాను తీసుకోవడం వల్ల తక్కువ ప్రీమియంతో పాలసీని పొందవచ్చు. అయితే.. ఇలా తీసుకోవడం వల్ల అనుకోని అనారోగ్య సమస్యలు ఏవైనా మనల్ని చుట్టుముడితే అప్పులపాలు కాకుండా మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా 45 ఏళ్ల లోపు వ్యక్తులకు వారి బడ్జెట్‌కు తగినట్లుగానే ఎన్నో రకాల ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయని అంటున్నారు.
నిబంధలను తెలుసుకోండి..
ఆరోగ్య బీమా పాలసీలను ఎంచుకునేటప్పుడు వాటికి సంబంధించిన అన్ని నియమ, నిబంధనల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. పాలసీ డాక్యుమెంట్‌లోని అన్ని వివరాలనూ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలోనూ.. కొన్ని పరిస్థితుల్లో బీమా వర్తించదని రాసి ఉంటుంది. కాబట్టి ఆ విషయాలను కచ్చితంగా పరిశీలించాలి. అప్పుడే భవిష్యత్‌లో ఎలాంటి ఆటంకాలూ లేకుండా పరిహారం పొందడానికి వీలవుతుందని నిపుణులంటున్నారు.
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ బెనిఫిట్ల గురించి తెలుసా?
బడ్జెట్‌పై కోటి ఆశలు! ఇన్సూరెన్స్ పాలసీలపై GST తగ్గుతుందా?
హెల్త్ ఇన్సూరెన్స్‌లో "నో క్లెయిమ్ బోనస్" గురించి తెలుసా? - లేదంటే మీకు చాలా నష్టం!