Maruti Suzuki Swift 2024 Price : ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన పాపులర్ హ్యాచ్ బ్యాక్ మోడల్ స్విఫ్ట్ ఫోర్త్ జనరేషన్ కారును భారత్ మార్కెట్లో గురువారం లాంఛ్ చేసింది. అత్యంత సరసమైన ధరలో ఈ కొత్త హ్యాచ్ బ్యాక్‌ను విడుదల చేసింది. ఇండియన్ మార్కెట్లో అత్యంత ఎక్కువగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటైన స్విఫ్ట్ ఇప్పుడు సరికొత్త వెర్షన్‌గా వచ్చింది. మరి ఆ కారు ధర, ఫీచర్లు, డిజైన్ వంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
భారతీయుల ఫేవరెట్ మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ను సంస్థ కొత్త హ్యాచ్ బ్యాక్‌ను రూ.6.49 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. 2024 స్విఫ్ట్‌ను సంస్థ ఐదు వేరియంట్లు LXi, VXi, VXi (O), ZXi, ZXi+లో లాంఛ్ చేసింది. వేరియంట్లను బట్టి ధరలు మారుతుంటాయి. లోయర్ ట్రిమ్ ధర రూ.6.49 లక్షలు ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ. 9.65 లక్షల(ఎక్స్-షోరూమ్)వరకు ఉంటుంది. ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్‌ను ఆరు రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది మారుతీ సంస్థ. ఆ రంగులు ఇవే
- సిజ్లింగ్ రెడ్
- లస్టర్ బ్లూ
- నోవల్ ఆరెంజ్
- మాగ్మా గ్రే
- స్ప్లెండిడ్ సిల్వర్
- పెర్ల్ ఆర్కిటిక్ వైట్
దీంతో పాటు మూడు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లు సైతం కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే?
- బ్లాక్ రూఫ్‌తో సిజ్లింగ్ రెడ్
- బ్లాక్ రూఫ్‌తో లస్టర్ బ్లూ
- బ్లాక్ రూఫ్‌తో ఆర్కిటిక్ వైట్
Maruti Suzuki Swift Features : 2024 స్విఫ్ట్‌లో ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్, ఫీచర్ల పరంగా చాలా మార్పులు చేసింది మారుతీ సంస్థ. రీడిజైన్ చేసిన రియర్ బంపర్, కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్‌లు, C-షేప్ టెయిల్ ల్యాంప్‌లు వంటి వాటితో కొత్త స్విఫ్ట్ ఆకర్షణీయంగా ఉంది. వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అప్డేడేటెడ్ స్విచ్ గేర్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్‌తో కూడిన 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెనక భాగంలో ఏసీ వెంట్స్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.
స్విఫ్ట్‌లో కొత్తగా 1.2 లీటర్ 3 సిలిండర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను మారుతీ తీసుకొచ్చింది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు అనుసంధానించింది. 80 బీహెచ్‌పీ గరిష్ఠ శక్తితో పాటు 112 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. లీటర్‌కు 25.72 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. కొత్త స్విఫ్ట్ అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్ బ్యాగ్‌లను ప్రామాణికం చేసింది.
2024 స్విఫ్ట్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొనుగోలుదారులు రూ.11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.