LPG Price Cut News : లోక్‌సభ చివరి (7వ) దశ ఎన్నికలు జరుగుతున్న వేళ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. హోటల్స్, రెస్టారెంట్లలో ఉపయోగించే 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.69 మేర తగ్గిస్తున్నట్లు వెల్లడించాయి. జూన్ 1వ తేదీ నుంచే ఈ ధరలు అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి. డొమెస్టిక్ సిలిండర్ల ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి.
దేశ రాజధాని దిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.69.50 తగ్గింది. కోల్కతాలో అదే సిలిండర్ ధర రూ.72 మేర తగ్గింది. వాణిజ్య రాజధాని ముంబయిలో రూ.69.50, చెన్నైలో రూ.70.50 మేర కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు దిగివచ్చాయి.
క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు!
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడం ఇదే మొదటిసారి కాదు. ఏప్రిల్, మే నెలల్లో కూడా వీటి ధరలు తగ్గించారు. కొత్త ధరల ప్రకారం, వివిధ రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
- దిల్లీ - రూ.1676 (ఇంతకు ముందు రూ.1745.50)
- ముంబయి - రూ.1629 (ఇంతకు ముందు రూ.1698.50)
- కోల్కతా - రూ.1787 (ఇంతకు ముందు రూ.1859)
- చెన్నై - రూ.1840 (ఇంతకు ముందు రూ.1911)
- హైదరాబాద్ - రూ.1903 (ఇంతకు ముందు రూ.1975.50)
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు లేదు!
ఆయిల్ కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం దిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.803గా ఉంది. అయితే ఉజ్వల లబ్ధిదారులకు మాత్రం రూ.603కే ఇది లభిస్తుంది. ముంబయిలో ఈ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.802.50; చెన్నైలో రూ.818.50; హైదరాబాద్లో రూ.855; విశాఖపట్నంలో రూ.812గా ఉంది.
జెట్ ఇంధనం కూడా తగ్గింది!
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం వల్ల, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జెట్ ఇంధనం (ATF) ధరలను 6.5 శాతం మేర తగ్గించాయి. దీని ప్రకారం కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ.6,673.87 మేర తగ్గింది. మారిన ధరల ప్రకారం, దిల్లీలో కిలీలీటర్ ఏటీఎఫ్ ధర రూ.94,969.01కు చేరుకుంది. ముంబయిలో ఏటీఎఫ్ రేటు రూ.95,173.70 నుంచి రూ.88,834.27కు దిగివచ్చింది.
ఎల్‌పీజీ సిలిండర్ ధరలను ఎలా, ఎక్కడ చెక్ చేయవచ్చు?
How To Check LPG Gas Rate Online : ఎల్‌పీజీ సిలిండర్ అసలు ధరలను తెలుసుకోవాలనుకుంటే, ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్ https://iocl.com/prices-of-petroleum-products లో చూడవచ్చు. ఇదే వెబ్సైట్లో ఎల్‌పీజీ ధరలతోపాటు, జెట్ ఫ్యూయెల్, ఆటో గ్యాస్, కిరోసిన్ మొదలైన ఇంధనాల ధరలను కూడా తెలుసుకోవచ్చు.
ఐటీ రీఫండ్ స్టేటస్ - ఆన్లైన్లో ఈజీగా చెక్ చేసుకోండిలా! - Income Tax Refund Status Check