Jeff Bezos Success Secret : ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలలో ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడైన జెఫ్ బెజోస్ ఒకరు. అమెజాన్ సంస్థను వృద్ధి పథంలో నడిపించడంలో ఆయన పాత్ర చాలా కీలకమైంది. ఎప్పటికప్పుడు సవాళ్లను స్వీకరిస్తూ, కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దారు. అందుకే జెఫ్ బెజోస్ ఆచరిస్తున్న నిర్వహణ వ్యూహాల గురించి ఎల్లప్పుడూ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అందులో ఒకటి ప్రతి అమెజాన్ సమావేశంలోనూ ఒక కుర్చీని ఖాళీగా ఉంచడం. ఇంతకీ ఆయన ఎందుకు అలా చేసేవారో తెలుసా?
కస్టమర్లకే మొదటి ప్రాధాన్యం!
బిలియనీర్ జెఫ్ బెజోస్ నిర్వహించే ప్రతీ సమావేశంలోనూ ఒక కుర్చీ ఖాళీగా ఉంటుంది. ఆ కుర్చీ కస్టమర్లను గుర్తుచేస్తుంది. అంటే ఈ ఖాళీ కుర్చీ కస్టమర్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తూ, వారి దీర్ఘకాలిక అంశాలపై దృష్టిపెట్టాలని అమెజాన్ బృందానికి రిమైండర్‌గా పని చేస్తుందని బెజోస్ నమ్ముతారు. ఈ ఆచరణ బయట వ్యక్తులు చూసేందుకు విచిత్రంగా అనిపించినప్పటికీ, దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
తక్కువ మందితో సమావేశాలు!
తక్కువ మందితో సమావేశాలు నిర్వహించడం వల్ల చర్చలు బాగా జరుగుతాయని, సరైన నిర్ణయాలు తీసుకోగలమని జెఫ్ బెజోస్ భావిస్తారు. ఎక్కువ మందితో మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ సంభాషణ నీరుగారిపోతుందని ఆయన భావన. అందుకే ఆయన కేవలం 6 నుంచి 8 మంది సభ్యులతోనే సమావేశాలు ఏర్పాటు చేసేవారు.
నో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్!
అమెజాన్ మేనేజ్‌మెంట్ మీటింగ్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను బెజోస్ నిషేధించారు. సమావేశాల్లో పాల్గొనేవారు బుల్లెట్ పాయింట్ ఫార్మాట్‌లో లేదా మెమోలుగా సమాచారాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. అంతే కాదు, ప్రతీ సమావేశంలో పాల్గొనేవారంతా మొదట అందుబాటులో ఉన్న వివిధ అంశాల గురించి చదవాలి. ఈ అభ్యాసం ప్రతీ అంశంపై లోతుగా ఆలోచించడానికి సాయపడుతుంది. నిశ్శబ్ద పఠనం ఏకాగ్రతను పెంచడమే కాకుండా, ఇతరుల ముందు మాట్లాడటానికి ఇష్టం లేని వారు కూడా చర్చల్లో పాల్గొనేలా చేస్తుందని బెజోస్ ఈ విధానాలు అమలు చేసేవారు.
1.96 ట్రిలియన్ల వ్యాపారం
1994లో సీటెల్‌లో ఓ చిన్న గ్యారేజీలో స్థాపించిన ఆన్‌లైన్ పుస్తక దుకాణం నేడు 1.96 ట్రిలియన్ల డాలర్ల విలువైన వ్యాపారంగా మారింది. 2021లోనే సీఈఓ పదవి నుంచి బెజోస్ వైదొలిగారు. ప్రస్తుతం ఆయన అమెజాన్ ఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. అమెజాన్‌లో తన యాజమాన్య వాటాను 2023 నాటికి 41 శాతం నుంచి 10 శాతానికి తగ్గించుకున్నారు. ఫోర్బ్స్ ప్రాకారం, ప్రస్తుతం బెజోస్ సంపద 204.4 బిలియన్ డాలర్లుగా ఉంది.
బాగా ధనవంతులు కావాలని ఆశపడుతున్నారా? ఈ 'సక్సెస్ ఫార్ములా' మీ కోసమే! - How To Become Rich