ITR Filing Benefits : 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు సమయం దగ్గర పడింది. జులై 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్దేశిత పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు నిర్ణీత శ్లాబుల్లో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను పరిధిలోకి రానివారు కూడా ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. అయితే వీరు కూడా గడువులోపే ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇలా నిర్ణీత గడువులోగా రిటర్నులు దాఖలు చేయడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ట్యాక్స్ బెనిఫిట్స్
- రుణం కోసం అప్లై చేసినప్పుడు, అలాగే వీసా దరఖాస్తు సమయంలో ఈ పన్ను రిటర్నులు సాయపడతాయి. లోన్ కావాలంటే, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు మన ఆదాయ రుజువులు సమర్పించాల్సి ఉంటుంది. అందుకు ఐటీఆర్ బాగా ఉపయోగపడతుంది.
- ఐటీఆర్ సమర్పించడం వల్ల త్వరగా వీసా జారీ చేసే అవకాశాలు పెరుగుతాయి.
- ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చే నష్టాలను తదుపరి సంవత్సరానికి బదిలీ చేసుకోవచ్చు. అంటే గత సంవత్సరం వచ్చిన నష్టాలను, భవిష్యత్తు ఆదాయానికి జతచేసి పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు.
- స్టాక్ మార్కెట్లలో, వెంచర్లలో పెట్టుబడులు పెట్టే వారు, ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.
ఐడెంటిటీ ప్రూఫ్
- ఐటీ రిటర్నులు మీకు ఒక ఐడెంటిటీ ప్రూఫ్‌గా కూడా ఉపయోగపడతాయి. ఏదైనా అధికారిక పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే, మీరు దాఖలు చేసిన ఐటీఆర్‌ను ఐడెంటిటీ ప్రూఫ్‌గా వినియోగించుకోవచ్చు.
- నిర్ణీత సమయంలోపు ఐటీఆర్‌లను ఫైల్ చేస్తే, ఆ వ్యక్తి క్రెడిట్ ప్రొఫైల్ మెరుగవుతుంది. క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ యోగ్యతను అంచనా వేసే సమయంలో దీన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. దీంతో తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశాలు ఉంటాయి.
- వ్యాపారం కోసం, ప్రభుత్వ టెండర్ల కోసం బిడ్డింగ్ చేయాలన్నా, ఐటీఆర్ దాఖలు చేయడం తప్పనిసరి. దీని వల్ల టెండర్లను గెలుచుకొనే అవకాశాలు కూడా పెరుగుతాయి.
భవిష్యత్ ప్రణాళిక కోసం
- ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల, మీ ఆదాయానికి సంబంధించిన సమగ్ర వివరాలు మీ దగ్గరే ఉంటాయి. ఇది ఒక రకంగా మీరు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో సాయపడుతుంది. ముఖ్యంగా ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులు వంటివి చూసుకుని, మీ భవిష్యత్‌కు తగిన ప్రణాళికలు రూపొందించుకోవడానికి వీలవుతుంది.
వ్యక్తి సంపాదించిన ఆదాయం, మూలధన లాభాలు తదితరాలపైన నిబంధనల మేరకు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం పొందినప్పుడు టీడీఎస్ కట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో మనం అదనపు పన్నులు చెల్లించి ఉండవచ్చు. వీటిని తిరిగి పొందాలంటే, తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఒక వేళ నిర్ణీత గడువులోపు ఐటీ రిటర్నులు దాఖలు చేయకపోతే జరిమానా పడుతుంది. అందుకనే గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేయడమే మంచిది.
బాగా ధనవంతులు కావాలని ఆశపడుతున్నారా? ఈ 'సక్సెస్ ఫార్ములా' మీ కోసమే! - How To Become Rich