Isha Ambani Advice For Girls : భారత్ అభివృద్ధి చెందాలంటే ఎక్కువ మంది అమ్మాయిలు శాస్త్ర సాంకేతిక రంగంలోకి(STEM) వెళ్లాలని అభిప్రాయపడ్డారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ ఈషా అంబానీ. అమ్మాయిలు శాస్త్ర సాంకేతికత రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలని సూచించారు. 'గర్ల్స్ అన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ డే 2024' అనే కార్యక్రమంలో బుధవారం ఈషా ఈ వ్యాఖ్యలు చేశారు.
'కలల భారతదేశాన్ని నిర్మించాలంటే ఇలా చేయాల్సిందే'
"మన కలల భారతదేశాన్ని నిర్మించాలంటే సాంకేతికతను పురుషులు, మహిళలు అందిపుచ్చుకోవాలి. సాంకేతిక రంగంలోని ఉద్యోగాల్లో మహిళలు తక్కువ ఉంటున్నారు. ఇది లింగ పక్షపాతాన్ని సూచిస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు పెరగడం పరిశ్రమలు, సమాజానికి చాలా అవసరం. భారత్‌లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో 36 శాతం మహిళలే ఉద్యోగాలు చేస్తున్నారు. అందులో 7 శాతం మహిళలు మాత్రమే కార్యనిర్వాహక స్థాయి పదవులను కలిగి ఉన్నారు. 13 శాతం మంది డైరెక్టర్ స్థాయి పదవుల్ని, 17 శాతం మంది మిడ్ మేనేజిరియల్ స్థాయి పోస్టుల్లో ఉన్నారు" అంటూ ఈషా అంబానీ చెప్పుకొచ్చారు.
మహిళలు పుట్టుకతోనే నాయకులు!
"భారత్‌లో శాస్త్ర సాంకేతిక విభాగంలో(STEM) 43 శాతం మంది గ్రాడ్యుయేషన్ చేశారు. వారిలో 14 శాతం మంది మాత్రమే శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులుగా ఉన్నారు. ఈ సాంకేతిక యుగంలో స్టార్టప్‌లలో మహిళ భాగస్వామ్యం కొరవడింది. పురుషుల కంటే మహిళలు తక్కువేం కాదు. వారు కూడా కంపెనీలకు నాయకత్వం వహించగలరు. అయితే కెరీర్లో పురుషుల ఎదుగుదలతో పోలిస్తే మహిళల ఎదుగుదల చాలా కష్టం. మగవాళ్ల కంటే మహిళలు నాయకత్వంలో ముందుంటారని నేను వ్యక్తిగతంగా నమ్ముతా. ఒక వ్యక్తి సాధికారత సాధిస్తే అతడు తన కుటుంబాన్ని మాత్రమే పోషిస్తాడు. అదే మహిళ సాధికారత సాధిస్తే గ్రామం మొత్తాన్ని పోషిస్తుంది. మా అమ్మ (నీతా అంబానీ) చెప్పింది నిజమే. మహిళలు పుట్టుకతోనే నాయకులు. మహిళల్లో ఉండే నిస్వార్థమైన మనసు వారిని మంచి నాయకులుగా తీర్చిదిద్దుతుంది" అని ఈషా అంబానీ తెలిపారు.